భారీ ఫైన్లతో రోడ్డు ప్రమాదాలు తగ్గేనా ?!

Should Accidents Will Be Reduced By Fines - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనకు భారీ జరిమానాలు నిర్ణయిస్తూ కేంద్ర మోటారు వాహనాల చట్టంకు చేసిన సవరణలు సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెల్సిందే. దీంతో దేశవ్యాప్తంగా ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ చలాన్లు విధిస్తున్నారు. హరియాణా, ఒడిశా రాష్ట్రాల్లో మొదటి ఐదు రోజులు నిర్వహించిన తనిఖీల్లోనే ట్రాఫిక్‌ పోలీసులు 1.4 కోట్ల రూపాయలను చలాన్ల రూపంలో రాబట్టారు. కొన్ని సార్లు వాహన ఖరీదు కంటే జరిమానా ఎక్కువగా ఉండడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. 

గురుగావ్‌లో ఓ ద్విచక్ర వాహనం దారుడికి పలు నిబంధనల ఉల్లంఘన కింద ట్రాఫిక్‌ పోలీసులు ఏకంగా 23 వేల రూపాయల జరిమానా విధించారు. రాజస్థాన్‌లో రిజిస్టర్‌ అయిన ఓ ట్రక్కుకు సెప్టెంబర్‌ 9వ తేదీన ఢిల్లీ పోలీసులు 1. 41 లక్షల రూపాయల జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాలను నివారించి తద్వారా పోతున్న ప్రాణాలను రక్షించే ఉద్దేశంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం జరిమానాలను భారీగా పెంచింది. అయితే దీని వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని భావించడం పొరపాటే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. 

రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ముందుగా రోడ్డు ప్రమాదాల్లో పోతున్న మానవ ప్రాణం విలువెంతనే అంశంపైన దష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ‘వరల్డ్‌ రిసోర్సెస్‌ ఇండియా’ ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డైరెక్టర్‌ అమిత్‌ భట్‌ చెప్పారు. కొన్ని సార్లు జరిమానాలు వాహనం విలువకన్నా ఎక్కువగా ఉంటున్నాయని, అది ఎంత అర్ధరహితమని ఆయన వ్యాఖ్యానించారు. 

దేశంలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో అధిక రెవెన్యూ వసూళ్ల కోసమే మోదీ ప్రభుత్వం ట్రాఫిక్‌ జరిమానాలను పెంచిందంటూ విమర్శిస్తున్న వారూ ఉన్నారని భారీగా పెంచిన జరిమానాలను పశ్చిమ బెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు నిరాకరించగా, గుజరాత్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు జరిమానాల మొత్తాన్ని తగ్గించాయి. రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాలు ఈ అంశాన్ని ఇంకా పరిశీలిస్తున్నాయి. ప్రమాదాల్లో పోతున్న మానవ ప్రాణాల విలువను ఒక్కో రాష్ట్రం ఒక్కో రకంగా ఎలా లెక్క గడుతుందో చూడండంటూ భట్‌ వ్యాఖ్యానించారు.

వాహనదారుల నడవడికను పరిశీలించకుండా ట్రాఫిక్‌ జరిమానాలను పెంచుకంటూ పోవడం హ్రస్వ దృష్టియే అవుతుందని పారిశ్రామిక పరిశోధన సంస్థ ‘కేర్‌ రేటింగ్స్‌’ డిప్యూటీ మేనేజర్‌ దర్శిణి కన్సారా అన్నారు. జరిమానాలు పెంచడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న వారు కూడా దేశంలో ఎంత మంది ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారో, వారిని ఎలా అరికట్ట వచ్చో అనే అంశాలను పరిగణలోకి తీసుకోవడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జరిమానాలను పెంచడం వల్ల ప్రయోజనం లేదని, పైగా ట్రాఫిక్‌ పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ ఉల్లంఘనలను కని పెట్టడం కూడా కష్టమేనని ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ‘బిహేవియరల్‌ సైంటిస్ట్‌’ ఆనంద్‌ దామిని తెలిపారు. 

అతి వేగం వల్ల ఎక్కువ ప్రాణాలు పోతున్నాయని, ముందుగా అతి వేగాన్ని అరికట్టే విషయంపై దష్టిని కేంద్రీకరిస్తే సత్ఫలితాలు ఉంటాయని ఆయన చెప్పారు. 2018 సంవత్సరంలో జాతీయ రహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 54 వేల మంది మరణించారని, వారిలో కేవలం 5 శాతం కేసులో తాగి నడిపిన కేసులు ఉన్నాయని, మిగతా ప్రమాదాల్లో ఎక్కువ వరకు అతి వేగం వల్ల జరిగినవేనని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్వయంగా ప్రకటించడం ఇక్కడ గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top