లీకైన పత్రాలు చెల్లుతాయి

SC dismisses govt's objections on leaked papers - Sakshi

‘రఫేల్‌’ రివ్యూ పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

ప్రభుత్వ అభ్యంతరాలను తోసిపుచ్చిన ధర్మాసనం

స్వాగతించిన విపక్షాలు, పిటిషన్‌దారులు

మోదీని కోర్టు దొంగ అంది: రాహుల్‌

న్యూఢిల్లీ: వివాదాస్పద రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు మార్గం సుగమమైంది. పిటిషన్‌దార్లు సమర్పించిన లీకేజీ పత్రాల ఆధారంగా విచారణ జరుపుతామని కోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఆ పత్రాలపై విశిష్ట అధికారం ప్రభుత్వానిదే అని, అక్రమంగా సేకరించిన సమాచారంతో వేసిన పిటిషన్ల విచారణార్హతపై కేంద్రం లేవనెత్తిన ప్రాథమిక అభ్యంతరాలను తోసిపుచ్చింది.

ఫ్రాన్స్‌ నుంచి 36 రఫేల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందం అంతా సవ్యంగానే ఉందని గత డిసెంబర్‌ 14న  సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రులు అరుణ్‌ శౌరీ, యశ్వంత్‌ సిన్హా, సీనియర్‌ లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌దార్లు దాఖలుచేసిన పత్రాల యోగ్యత ఆధారంగా రివ్యూ పిటిషన్లను విచారిస్తామని కోర్టు తెలిపింది. ఈ పిటిషన్ల విచారణకు ప్రత్యేక తేదీని ప్రకటిస్తామంది. ఈసారి విచారణలో రఫేల్‌ విమానాల ధరల నిర్ధారణతో పాటు భారత్‌లో ఆఫ్‌సెట్‌ భాగస్వామి ఎంపికపై దృష్టిసారిస్తామంది. తన తరఫున, జస్టిస్‌ కౌల్‌ తరపున జస్టిస్‌ గొగోయ్‌ తీర్పును రాయగా, వేరుగా తీర్పు వెలువరించిన జస్టిస్‌ జోసెఫ్‌ మిగిలిన ఇద్దరు సభ్యులతో ఏకీభవించారు.

‘హిందూ’ ప్రచురణ స్వేచ్ఛా హక్కే
రఫేల్‌ ఒప్పందం వివరాలు ‘ది హిందూ’ పత్రికలో ప్రచురితం కావడం భావప్రకటనా స్వేచ్ఛలో భాగమేనని కోర్టు తెలిపింది. గతంలో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు తమకు గుర్తొచ్చాయని పేర్కొంది. పెంటగాన్‌ పత్రాల ప్రచురణకు సంబంధించి ‘న్యూయార్క్‌ టైమ్స్‌ వర్సెస్‌ యునెటెడ్‌ స్టేట్స్‌’ కేసులో పత్రికలపై ప్రభుత్వ నియంత్రణను అమెరికా కోర్టు గుర్తించలేదని తెలిపింది. ఇదే కేసు రఫేల్‌కూ వర్తిస్తుందని జస్టిస్‌ గొగోయ్, జస్టిస్‌ కౌల్‌ తమ తీర్పులో పేర్కొన్నారు. రహస్య పత్రాల ప్రచురణను నిలిపేసేలా ప్రభుత్వ విభాగాలకు విశేషాధికారులు కట్టబెడుతూ అధికారిక రహస్యాల చట్టంలో నిబంధనలు ఉన్నట్లు తమ దృష్టికి రాలేదని తెలిపారు. జాతీయ భద్రతను సాకుగా చూపుతూ కేంద్రం ఆర్‌టీఐ కింద ఇవ్వాల్సిన సమాచారాన్ని దాచిపెట్టకూడదని జస్టిస్‌ జోసెఫ్‌ అన్నారు. ‘ అడిగినంత మాత్రాన సమాచారం వెల్లడించకూడదనడంలో సందేహం లేదు. కానీ ఆ సమాచారాన్ని వెల్లడించడం కన్నా దాచితే ఎక్కువ నష్టం అని దరఖాస్తుదారుడు నిరూపించాలి. దేశ భద్రతతో ముడిపడిన సమాచారాన్ని అడిగే హక్కును ఆర్‌టీఐ పౌరుడికి కట్టబెట్టింది. ఆæ సమాచారం ప్రజా ప్రయోజనం కోసమే ఉద్దేశించినదవ్వాలి’ అని ఆయన అన్నారు.

బహిరంగ చర్చకు సిద్ధమా?: రాహుల్‌
రఫేల్‌ ఒప్పందం, నోట్లరద్దు అంశాలపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీకి సవాల్‌ విసిరారు.  ‘రఫేల్‌ ఒప్పందం విషయంలో సుప్రీంకోర్టు తనకు క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మోదీ అన్నారు. కానీ, చౌకీదార్‌జీ అవినీతికి పాల్పడినట్లుగా సుప్రీంకోర్టు తాజాగా పేర్కొంది. వైమానిక దళం డబ్బును చౌకీదార్‌జీ(మోదీ) పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి అప్పగించారనే విషయాన్ని గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నా. దీనిపై కోర్టు దర్యాప్తు చేయబోతోంది. మోదీ, అంబానీ పేర్లు బయటకు రానున్నాయి’ అని అన్నారు. ‘సుప్రీంకోర్టు నిర్ణయం నేపథ్యంలో మిమ్మల్ని సవాల్‌ చేస్తున్నా.. బహిరంగ చర్చకు రండి. అవినీతి, నోట్లరద్దు, రఫేల్‌ ఒప్పందం, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా తనయుడు జై షా అవినీతి తదితర అంశాలపై దేశ ప్రజలు మీ నుంచి నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నారు’ అని అన్నారు.

ఎవరేమన్నారంటే..
► నిజాలపై మూత ఎగిరిపోయింది: కాంగ్రెస్‌
మోదీ ఎన్ని అబద్ధాలు చెప్పినా చివరకు నిజం బయటకు వస్తుందని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. ఇన్నాళ్లూ నిజాలు దాచేందుకు మోదీ పెట్టిన మూత కొట్టుకుపోయిందని ఎద్దేవా చేసింది. ‘రఫేల్‌ అవినీతిన బయటపెట్టిన పాత్రికేయులపై అధికారిక రహస్యాల చట్టాన్ని ప్రయోగించాలని మోదీ ప్రభుత్వం భావించింది’ అని కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా అన్నారు.
► దేశభద్రతపై కేంద్రం రాజీ పడిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరీ ఆరోపించారు.
► సుప్రీం తీర్పును పిటిషనర్లలో ఒకరైన అరుణ్‌ శౌరీ స్వాగతించారు.

► అసమగ్ర సమాచారం: రక్షణ శాఖ
జాతీయ భద్రతపై జరిగిన చర్చలకు సంబంధించి అసంపూర్ణ సమాచారం ఇవ్వడమే పిటిషన్‌దారుల ఉద్దేశమని రక్షణ శాఖ పేర్కొంది. ‘గోప్యంగా ఉంచాల్సిన సున్నిత సమాచారం ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం ఆందోళనకరం’ అని సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రక్షణ శాఖ ప్రకటన జారీ చేసింది.

► రాహుల్‌ది కోర్టు ధిక్కారం: బీజేపీ
కోర్టు తన తీర్పులో చెప్పని మాటలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అత్యున్నత న్యాయస్థానానికి ఆపాదించి తీవ్ర కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోదీ దొంగతనానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు తాజాగా స్పష్టం చేసిందని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. రాహుల్‌ సుప్రీం తీర్పులోని సగం పేరాను కూడా చదవలేదని, కోర్టు చెప్పని మాటలు చెప్పినట్లు వ్యాఖ్యానించి తన నైరాశ్యాన్ని చాటుకున్నారని ఎద్దేవా చేశారు.

ఎప్పుడేం జరిగింది
⇒ 2007, ఆగస్టు 28: 126 మీడియం మల్టీరోల్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల (ఎంఎంసీఏ) కొనుగోలుకు ప్రకటన జారీ
⇒ 2011 మే: రఫేల్, యూరో ఫైటర్‌ జెట్‌ విమానాలతో తుది జాబితా తయారీ
⇒ 2012, జూన్‌ 30: తక్కువ మొత్తానికి బిడ్‌ దాఖలుచేసిన ఫ్రాన్స్‌ కంపెనీ డసాల్ట్‌  
⇒ 2014, మార్చి 13: 108 విమానాల కోసం 70, 30 శాతం చొప్పున పని చేయడానికి హాల్, డసాల్ట్‌ మధ్య కుదిరిన ఒప్పందం
⇒ 2015, ఏప్రిల్‌: ఫ్రాన్స్‌ నుంచి ఎగరడానికి సిద్ధంగా ఉన్న 36 విమానాల కొనుగోలుకు కొత్త ఒప్పందం ఖరారు
⇒ సెప్టెంబర్‌ 23: ఇరు దేశాల మధ్య అంతర ప్రభుత్వ ఒప్పందంపై సంతకాలు
⇒ నవంబర్‌ 18: ఒక్కో విమానం ఖర్చు రూ.670 కోట్లు అని ప్రకటించిన ప్రభుత్వం
⇒ 2016, డిసెంబర్‌ 31: 36 విమానాల ఖర్చు రూ.60 వేల కోట్లని డసాల్ట్‌ నివేదికలో వెల్లడి. ఈ మొత్తం ప్రభుత్వం ప్రకటించిన మొత్తంపై రెట్టింపు కన్నా అధికం
⇒ 2018 మార్చి 13: రఫేల్‌ కొనుగోలుపై సుప్రీంలో పిటిషన్‌
⇒ అక్టోబర్‌ 10: రఫేల్‌ కొనుగోలుకు నిర్ణయాలు తీసుకున్న విధానంపై వివరాలు సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలన్న సుప్రీంకోర్టు
⇒ డిసెంబర్‌ 14: ప్రభుత్వ నిర్ణయాల్లో సంశయించాల్సిందేం లేదని తీర్పు
⇒ 2019, జనవరి 2: ఈ తీర్పును సమీక్షించాలని సుప్రీంలో పిటిషన్లు దాఖలు
⇒ మార్చి 6: రఫేల్‌ పత్రాలు చోరీకి గురయ్యాయని కోర్టుకు తెలిపిన కేంద్రం
⇒ మార్చి 13: లీకేజీ పత్రాలతో విచారణ వద్దని కోర్టుకు విన్నవించిన కేంద్రం
⇒ ఏప్రిల్‌ 10: లీకేజీ పత్రాలను విచారణలో పరిగణనలోకి తీసుకుంటామన్న సుప్రీం

నేపథ్యమిదీ..
రివ్యూ పిటిషన్ల దాఖలుపై కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించిన కోర్టు మార్చి 14న తన తీర్పును రిజర్వులో ఉంచింది. రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన కీలక సమాచారం మీడియాలో ప్రచురితం కావడం అప్పట్లో కలకలం రేపింది. ప్రధాని కార్యాలయం ఫ్రాన్స్‌తో సమాంతర చర్చలు జరపడంపై రక్షణ శాఖ అయిష్టత వ్యక్తం చేసినట్లు ‘ది హిందూ’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు, సమాచారంపై కేంద్రానికే పూర్తి హక్కులుంటాయని, సంబంధిత విభాగం అనుమతి లేనిదే వాటిని కోర్టుకు సమర్పించరాదని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top