‘జస్టిస్‌ ఖన్నా’ నియామకంపై రగడ

SC collegium under fire for elevating junior judges - Sakshi

కొలీజియం సిఫార్సును తప్పుపడుతూ జస్టిస్‌ కౌల్‌ లేఖ

జస్టిస్‌ ప్రదీప్‌ను అకారణంగా తప్పించారని ఆగ్రహం

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది.  జనవరి 10న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేరును సుప్రీంకోర్టు జడ్జీగా సిఫార్సు చేయడాన్ని సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్కే కౌల్‌ తప్పుపట్టారు. రాజస్తాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రదీప్‌ నంద్రజాగ్‌ పేరును తొలగించి, ఖన్నా పేరును జాబితాలో చేర్చడాన్ని ప్రశ్నిస్తూ ఆయన సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌తో పాటు కొలీజియం సభ్యులకు లేఖ రాశారు. జస్టిస్‌ ప్రదీప్‌ సమర్థుడైన న్యాయమూర్తనీ, పరిపాలకుడని జస్టిస్‌ కౌల్‌ వ్యాఖ్యానించారు.  ఇలాంటి సందర్భాల్లో దుందుడుకు  నిర్ణయాలు తగవని అభిప్రాయపడ్డారు.  ఇలాటి నిర్ణయాల కారణంగా న్యాయవ్యవస్థతో పాటు బార్‌లోనూ సమస్యలు ఉత్పన్నమవుతాయని హెచ్చరించారు.

రాష్ట్రపతి కోవింద్‌కు లేఖ..
దేశవ్యాప్తంగా ఉన్న 32 మంది సీనియర్‌ న్యాయమూర్తులను కాదని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాకు కొలీజియం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించిందని ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ కైలాశ్‌గంభీర్‌ ఆరోపించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశారు. 2018 డిసెంబర్‌ 12న సమావేశమైన కొలీజియం జస్టిస్‌ ప్రదీప్‌ నంద్రజాగ్, కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్‌ల పేర్లను సుప్రీం జడ్జీలుగా సిఫార్సు చేసిందని గుర్తుచేశారు.

అయితే, ఈనెల 10న సీజేఐ జస్టిస్‌ రంజన్‌గొగోయ్‌ నేతృత్వంలో భేటీ అయిన కొలీజియం వీరి పేర్లను ఎలాంటి కారణాలు చూపకుండానే తొలగించి జస్టిస్‌ ఖన్నాతో పాటు కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి పేర్లను చేర్చిందన్నారు. సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌తో పాటు జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. గతేడాది జనవరిలో కేసుల కేటాయింపులో అప్పటి సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తీరును వ్యతిరేకిస్తూ జస్టిస్‌ జే.చలమేశ్వర్, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ లోకూర్, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.

న్యాయవాదుల ఆందోళన..
జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పదోన్నతిని వ్యతిరేకిస్తూ బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా బుధవారం ఆందోళన నిర్వహించింది. 32 మంది సీనియర్‌ జడ్జీలను కాదని జస్టిస్‌ ఖన్నా పేరును సిఫార్సు చేస్తూ కొలీజియం తీసుకున్న నిర్ణయం విచిత్రం, ఏకపక్షమని స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు బార్‌ కౌన్సిల్‌ సైతం జస్టిస్‌ ఖన్నా నియామకాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది.

కొలీజియం సిఫార్సుకు కేంద్రం ఓకే
ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరిలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనవరి 10న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సును ప్రభుత్వం ఆమోదించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top