భారీ భద్రత.. శరణు ఘోష

Sabarimala temple opens - Sakshi

ఉద్రిక్తతల నడుమ తెరుచుకున్న శబరిమల ఆలయం

‘మహిళలకు ప్రవేశం’పై సుప్రీంకోర్టుకు వెళ్తా: టీడీబీ

కోచి/శబరిమల/పంబ: భారీ పోలీసు బందోబస్తు, అయ్యప్ప భక్తుల శరణు ఘోష మధ్య శుక్రవారం సాయంత్రం శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌ రాకతో కోచిలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు రాత్రి వరకు కొనసాగాయి. పోలీసుల సూచనతో ఆమె తిరిగి పుణె వెళ్లిపోయారు. ఆలయంలోకి రుతుస్రావం వయసు మహిళలనూ అనుమతించాలన్న ఉత్తర్వుల అమలుకు సుప్రీంకోర్టును సమయం కోరనున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్వోమ్‌ బోర్డు(టీడీబీ) తెలిపింది.

భారీగా భక్తుల రాక
శుక్రవారం సాయంత్రం శబరిమల ఆలయ తలుపులను ప్రధాన పూజారి కందరారు రాజీ వరు తెరిచారు. పూజారులు ఎంఎల్‌ వాసుదేవన్‌ నంబూద్రి, ఎంఎన్‌ నారాయణన్‌ నంబూద్రి అయ్యప్ప, మలిక్కపురమ్‌ పూజల బాధ్యతలను స్వీకరించారు. చలి తీవ్రంగా ఉన్నప్పటికీ లెక్క చేయకుండా ఇరుముడులతో తరలివచ్చిన వందలాది భక్తుల శరణు ఘోషతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. దర్శనం క్యూలన్నీ భక్తులతో నిండిపోయాయి. నేటి నుంచి డిసెంబర్‌ 27 వరకు అంటే మండల పూజలు జరిగే 41 రోజుల పాటు భక్తుల దర్శనం కోసం ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. జనవరి 14వ తేదీన జరిగే మకరవిలక్కు పూజల కోసం తిరిగి డిసెంబర్‌ 30 నుంచి జనవరి 20వ తేదీ వరకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు.

సుప్రీం తలుపుతడతాం: టీడీబీ
నేటి నుంచి మండల పూజలు ప్రారంభం కానున్న దృష్ట్యా టీడీబీ అధ్యక్షుడు ఎ.పద్మకుమార్‌ శుక్రవారం బోర్డు సభ్యులు, న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. రుతుస్రావ వయసు మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ ఆందోళనలు సాగుతుండటంపై వారు చర్చించారు. టీడీబీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉత్తర్వుల అమలుకు మరికొంత సమయం కావాలంటూ శని లేదా సోమవారాల్లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తామన్నారు.

ఆలయం వద్ద భారీ బందోబస్తు
ఆలయం, చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసు శాఖ భారీ బందోబస్తు చేపట్టింది. గురువారం అర్ధరాత్రి నుంచి 144వ సెక్షన్‌ నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నారు. 20 మంది సభ్యుల కమాండో బృందం, 234 మందితో కూడిన బాంబ్‌ స్క్వాడ్, 800పైగా మహిళా పోలీసులతోపాటు మొత్తం 15వేల మందిని వివిధ ప్రాంతాల్లో బందోబస్తుకు వినియోగిస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత సన్నిధానంలో ఉండేందుకు భక్తులను అనుమతించడం లేదు.  

కనీస వసతుల కొరత
ఆలయ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని భక్తులు ఆరోపిస్తున్నారు. టాయిలెట్లు, విశ్రాంతి గదులు దొరక్క తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని మహిళా భక్తులు తెలిపారు. కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేదని మరికొందరు చెప్పారు. టీడీబీతోపాటు రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు కనీస వసతులు కల్పించడంలో విఫలమయిందని ప్రతిపక్ష నేత రమేశ్‌ చెన్నితల ఆరోపించారు.  

వెళ్తున్నా.. మళ్లీ వస్తా!
సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌ రాకపై కోచిలో బీజేపీ కార్యకర్తలు, భక్తులు తదితరుల నిరసనలతో ఉదయం నుంచి రాత్రి వరకు ఉత్కంఠ కొనసాగింది. తృప్తి దేశాయ్, మరో ఆరుగురు మహిళలతో కలిసి శుక్రవారం వేకువజామున 4.40 గంటల సమయంలో పుణె నుంచి విమానంలో కోచికి చేరుకున్నారు. శబరిమల ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు వారిని ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. ‘శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు చెప్పడంతో వెనుదిరిగి వెళ్తున్నా. కానీ, త్వరలోనే వస్తాం. ఆలయంలో పూజలు చేస్తా’ అని తృప్తి అన్నారు. ఆమెను విమానాశ్రయంలోనే అడ్డుకున్న సుమారు 200 మంది ఆందోళనకారులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశామని పోలీసులు తెలిపారు.

ఎయిర్‌పోర్టులో అభివాదం చేస్తున్న తృప్తి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top