వచ్చే శాసనసభ ఎన్నికల్లో 14 లేదా 15 నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే పేర్కొన్నారు.
ముంబై : వచ్చే శాసనసభ ఎన్నికల్లో 14 లేదా 15 నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో తమ పార్టీకి గుర్తింపు ఉందని, అందువల్ల 12 స్థానాల్లో విజయం సాధించగలమనే ధీమా తమకు ఉందని అన్నారు.
20 స్థానాలను కేటాయించాలంటూ శివసేన, బీజేపీ నేతృత్వంలోని మహాకూటమికి ఓ వినతిపత్రం సమర్పించామన్నారు. కనీసం 14 నుంచి 15 స్థానాలను తమకు కేటాయిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. నరేంద్ర మోడీ వంద రోజుల పరిపాలన అద్భుతంగా ఉందన్నారు. గత ప్రభుత్వ పాలన కంటే మోడీ పాలన ఎంతో మెరుగ్గా ఉందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించేందుకు కేంద్రం శాయశక్తులా కృషి చేస్తోందన్నారు.