‘రేపిస్తాన్‌’ ట్వీట్‌.. ఐఏఎస్‌కు నోటీసులు

For Rapistan Tweet Kashmir IAS Topper Shah Faesal Faces Centre Wrath - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సివిల్స్ పరీక్షల్లో తొలి కశ్మీర్ టాపర్ షా ఫైజల్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. సోషల్‌ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నందుకు క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమతుతోంది. ఈ మేరకు మంగళవారం ఆయనకు షోకాజు నోటీసులు పంపించింది. 15 రోజుల్లోగా వివరణయివ్వాలని ఆదేశించింది.

అశ్లీల చిత్రాలు చూడటానికి అలవాటు పడిన ఓ కామాంధుడు గుజరాత్‌లో కన్నతల్లిపై అత్యాచారానికి పాల్పడిన దారుణోదంతంపై స్పందించిన షా ఫైజల్‌.. ఇండియాను ‘రేపిస్తాన్‌’ అనే అర్థం వచ్చేలా వ్యంగ్యంగా ఓ ట్వీట్‌ చేశారు. అది కాస్త వైరల్‌ అయింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి అయివుండి ఇండియాను ఇలా అవమానిస్తారా అని ఓ వ్యక్తి ట్విటర్‌ ద్వారా ప్రశ్నించగా.. ‘మీరు ఇది ఇండియా అని ఎలా గుర్తించారు. మీరు ప్రధాని కార్యాలయం(పీఎంఓ)కు ట్యాగ్‌ చేయడం మరిచిపోయారు’ అని​ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. 

సోషల్‌ మీడియాలో ఇలాంటి వాఖ్యలు చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వం సీరియస్‌ అయింది. ప్రభుత్వాన్ని అధికారులు కించపరిచేవిధంగా ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని 2016లో కేం‍ద్ర ప్రభుత్వం నిబంధన విధించింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. నిబంధనలు అతిక్రమించినందుకు షా ఫైజల్‌కు షోకాజు నోటీసులు పంపించింది. తనకు నోటీసులు వచ్చిన విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. తన బాస్‌ నుంచి లవ్‌ లెటర్‌ వచ్చిందని ట్వీట్‌ చేశారు. ‘దక్షిణాసియాలో పెరిగిపోతున్న అత్యాచార సంస్కృతిపై వ్యంగ్యంగా స్పందించినందుకు మా బాస్‌ నుంచి నాకు ప్రేమలేఖ వచ్చింద’ని వెల్లడించారు.

కాగా, తన వ్యాఖ్యలను షా ఫైజల్‌ సమర్థించుకున్నారు. భావప్రకటన స్వేచ్ఛ తనకుందని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగిని అయినా తాము కూడా సమాజంలో భాగమేనని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మీ వ్యాఖ్యల వల్ల ఉద్యోగం కొల్పోయే అవకాశం ఉంటుందని తెలియదా అని అడగ్గా.. నేను ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు  చేయలేదు. ఎవరిని కించపరిచే విధంగా ప్రవర్తించలేదు. ఈ చర్చలో నా ఉద్యోగం కొల్పోవడం అనేది చిన్న సమస్య. నా ఉద్దేశ్యం వేరు. ఒకవేళ ఉద్యోగం పోయినా పర్లేదు. ప్రపంచానికైనా మంచి జరుగుతుంద’ని సమాధానమిచ్చారు.
 

కాగా షా ఫైజల్‌కు జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా బాసటగా నిలిచారు. షా ఫైజల్‌ ట్వీట్‌లో ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవని అన్నారు. రాజస్థాన్‌ తదితర ప్రాంతాల్లోని అధికారులు ప్రభుత్వ నియమాలను ఉల్లంఘిస్తే పట్టించుకోని ప్రభుత్వం.. ఫైజల్‌కు నోటీసులు పంపడం దారుణమని ట్విటర్‌లో పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top