మళ్లీ రానంటున్న రాహుల్‌..

Rahul Gandhi Made His Views On Leadership Clear - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ పగ్గాలను మరోసారి చేపట్టడంపై ఎంపీ రాహుల్‌ గాంధీ స్పందించారు. తాను పార్టీ చీఫ్‌ పదవికి రాజీనామా చేశానని, మళ్లీ ఆ బాధ్యతలు చేపట్టే ఉద్దేశం లేదని రాహుల్‌ స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వ బాధ్యతలను తిరిగి రాహుల్‌ స్వీకరిస్తారన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. నాయకత్వ బాధ్యతను రాహుల్‌ స్వీకరించే పరిస్దితి లేకపోవడంతో ఈ అంశంపై ఏప్రిల్‌లో జరిగే కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు.

పార్టీ చీఫ్‌ బాధ్యతలను తిరిగి స్వీకరించాలని పార్టీ ఒత్తిడి తెస్తే ఏమిటన్న ప్రశ్నకు రాహుల్‌ బదులిస్తే కాంగ్రెస్‌ అధినేత్రి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలని అన్నారు. కాగా గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్‌ తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. సోనియా ఆరోగ్య పరిస్ధితుల దృష్ట్యా చురుకైన పార్టీ చీఫ్‌ ఉండాలని ఏఐసీసీ యోచిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఆవశ్యకతను సుస్పష్టంగా చాటాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరోవైపు కాంగ్రెస్‌ పాలిత మధ్యప్రదేశ్‌లో కమల్‌ నాథ్‌ ప్రభుత్వం సైతం కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ శిబిరానికి దగ్గరవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో చురుకైన నేత పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టాలని ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి. గాంధీ కుటుంబం నుంచే పార్టీ అధినేత ఉండాలన్నది ఆ పార్టీ శ్రేణుల అభిప్రాయంగా ముందుకొస్తోంది. 

చదవండి : కొత్త సారథి కావలెను

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top