ఆ విషయాన్ని రేపు వెల్లడిస్తారు: జవదేకర్‌

Prakash Javadekar Says Lockdown Extension A Game Changer Covid 19 - Sakshi

లాక్‌డౌన్‌ పొడిగింపు గేమ్‌ ఛేంజర్‌ వంటిది: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19)పై పోరులో లాక్‌డౌన్‌ పొడిగింపు గేమ్‌ ఛేంజర్‌ వంటిదని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. మార్చి 24 అర్ధరాత్రి విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలంతా లాక్‌డౌన్‌ అమలుకు సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఈరోజు ప్రధాన మంత్రి ఇచ్చిన ప్రసంగం... కరోనా వైరస్‌ నుంచి దేశాన్ని కాపాడేందుకు శ్రమిస్తున్న నాయకుడి అంకిత భావాన్ని ప్రతిబింబించింది. ప్రతీ పౌరుడి పట్ల ఆయన చూపిస్తున్న శ్రద్ధ, సున్నిత అంశాల్లో వ్యవహరించే తీరు నాయకత్వ ప్రతిభకు నిదర్శనం’’ అని పేర్కొన్నారు. (మే 3 వరకు లాక్‌డౌన్‌ : మోదీ)

ఇక లాక్‌డౌన్‌ పొడిగింపు నేపథ్యంలో ఏప్రిల్‌ 20 తర్వాత అనుసరించాల్సిన విధానాలపై ప్రధాని మోదీ ప్రణాళిక సిద్ధం చేశారని.. ఈ అంశాల గురించి బుధవారం కీలక ప్రకటన చేస్తారని జవదేకర్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు విధిగా లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే కరోనాపై యుద్ధంలో గెలుస్తామని పేర్కొన్నారు. ఎన్నో దేశాలు కరోనాను జయించలేకపోయాయని.. అయితే ప్రజల మద్దతుతో భారత్‌ ఈ పోరులో విజేతగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే విధంగా మహమ్మారి కరోనాకు త్వరగా విరుగుడు కనిపెట్టాలని జవదేవర్‌ ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు విజ్ఞప్తి చేశారు. కాగా మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏప్రిల్‌ 20 వరకు దేశంలో పరిస్థితులను నిశితంగా పరిశీలించి.. తదనుగుణంగా బుధవారం నిబంధనలు జారీ చేస్తామని వెల్లడించారు.(కరోనా కట్టడికి 7 సూత్రాలు చెప్పిన మోదీ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top