పీఎం కేర్స్‌ ఫండ్‌ వివరాలు ఇవ్వలేం: పీఎంఓ

PM Office Refuses RTI Application Seeking PM Cares Fund Details - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పీఎం కేర్స్‌ ఫండ్‌కు వస్తున్న విరాళాల వివరాలు ఇవ్వాలని దాఖలైన ఆర్టీఐ దరఖాస్తును ప్రధానమంత్రి కార్యాలయం తిరస్కరించింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం గతంలో చేసిన వివాదాస్పద ప్రకటనను ఉదహరిస్తూ.. పీఎం కేర్స్‌ ఫండ్‌ వివరాలు నేరుగా బహిరంగపర్చలేమని, దీనికి అనేక కారణాలు ఉన్నాయని పీఎంఓ తెలిపింది. దాంతోపాటు, కోవిడ్‌ కట్టడికి జరిగిన అత్యున్నస్థాయి సమావేశ వివరాలు బహిరంగం చేయలేమని స్పష్టం చేసింది. సమాచారం హక్కు చట్టం కింద నొయిడాకు చెందిన పర్యావరణ వేత్త విక్రాంత్‌ తోగాడ్‌ ఏప్రిల్‌ 21న పీఎంఓ నుంచి 12 అంశాలతో నివేదిక కోరతూ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, అతను సమర్పించిన ఆర్టీఐ దరఖాస్తు సరిగా లేదని, ఒకే దరఖాస్తులో ఇన్ని వివరాలు ఇవ్వలేమని దేనికదే విడిగా అప్లై చేయాలని సూచించింది.  

కాగా, కోవిడ్‌–19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజల నుంచి విరాళాలను సేకరించే లక్ష్యంతో పీఎం కేర్స్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని పిలుపుతో సెలబ్రిటీలే కాకుండా సామాన్యులు సైతం పీఎం కేర్స్‌ ఫండ్‌ పెద్ద ఎత్తున విరాళాలు పంపిస్తున్నారు. దీనికి మోదీ ఎక్స్‌ అఫిషియో చైర్మన్‌గా ఉండగా, రక్షణ, ఆర్థిక, హోం మంత్రులు ఎక్స్‌ అఫిషియో ట్రస్టీలుగా ఉన్నారు. ఈ విరాళాలకు పన్ను మినహాయింపును ఇచ్చారు. ఇక విచక్షణారహిత, అసాధ్యమైన డిమాండ్ల మేరకు సమాచారం ఇవ్వాలని చూస్తే..  అది ఆ సంస్థ పనితీరుపైనా, ఫలితంగా సమాచారం సేకరించి, సమకూర్చే ఎగ్జిక్యూటివ్‌పైనా పడుతుందని, అలాంటి సందర్భంలో దరఖాస్తులను స్వీకరించాల్సిన అవసరం లేదని గతంలో సుప్రీం ధర్మాసనం వివాదాస్పద ప్రకటన చేయడం గమనార్హం. 
(చదవండి: ఇకపై కచ్చితంగా ‘ఆరోగ్య సేతు’!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top