ఇకపై కచ్చితంగా ‘ఆరోగ్య సేతు’!

Aarogya Setu APP Registration Mandatory to Setup New smart Phones - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా (కోవిడ్‌-19)పై సమగ్ర సమాచారమిచ్చే ఆరోగ్య సేతు యాప్‌ ఇకపై అన్ని స్మార్ట్‌ ఫోన్‌లలో కచ్చితంగా ఉండనుంది. ఫోన్‌ను అమ్మడానికి ముందే ఆ యాప్‌ను అన్ని స్మార్ట్‌ ఫోన్‌లలో ఇన్‌స్టాల్‌ చేయడంతో పాటు, ఆ యాప్‌లో రిజిస్టర్‌ చేసుకున్నాకే వినియోగదారుడు ఆ ఫోన్‌ను వాడేలా చూడాలని కేంద్రం ఆదేశాలు జారీకి సిద్ధం అవుతోంది. ఇందుకు సంబంధించి టెలికం సంస్థలతో సంప్రదింపులు జరిపేందుకు ఒక నోడల్‌ ఏజెన్సీని కూడా నియమించాలనుకుంటోందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. (ఆరోగ్య సేతు అడ్డుపెట్టి కరోనా ఆపగలమా?)

కాగా కరోనా తాజా సమాచారంతో పాటుగా వైరస్‌ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తలు, కేంద్రం అనుసరిస్తున్న నియంత్రణ చర్యలు వంటి అంశాలను అందించే ఆరోగ్య సేతు యాప్‌ను ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా వినియోగించేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కాలంలో మినహాయింపు రంగాలతో పాటు లాక్‌డౌన్‌ తర్వాత పనిచేసే అన్ని రంగాల్లో ఆరోగ్య సేతు యాప్‌ను తప్పనిసరి చేయాలని భావిస్తోంది. (ప్రతి ఉద్యోగి చేతిలో ఆరోగ్యసేతు)

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) రూపొందించిన ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత పలు రకాల ప్రశ్నలకు అందులో సమాధానాలు ఎంట్రీ చేయాలి. కరోనా వైరస్‌ వ్యాప్తి, సంబంధీకులతో మనం కనెక్ట్‌ అయ్యామా? విదేశాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చామా, కరోనా వైరస్‌ సోకే లక్షణాలేమైనా ఉన్నాయా అనే రీతిలో ప్రశ్నలకు జవాబులు రాయాలి. వీటి ఆధారంగా మన ఆరోగ్య పరిస్థితి ఈ యాప్‌లో రికార్డవుతుంది. కరోనా వైరస్‌ సోకకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను ఈ యాప్‌ సూచిస్తుంది. మన చుట్టుప్రక్కల ఎవరైనా కరోనా రోగులుంటే అలర్ట్‌ చేస్తుంది. ఇందుకు జీపీఎస్‌ను ఆన్‌లో ఉంచాలి. ప్రస్తుతం ఆరోగ్య వివరాలను ఒకసారి మాత్రమే ఎంట్రీ చేయాల్సి ఉండగా..త్వరలో మరింత అప్‌డేట్‌ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో మన ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుంది. (సొంతూరికి దారేది?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top