ప్రతి ఉద్యోగి చేతిలో ఆరోగ్యసేతు

Everyone Using Aarogya Setu Application To Take Care From Corona - Sakshi

లాక్‌డౌన్‌ తర్వాత తప్పనిసరిగా యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిందే

సమాచారం నమోదుతో పాటు జీపీఎస్‌ ఆన్‌లో ఉండాలి

కేంద్ర సంస్థలతో పాటు పరిశ్రమలు, కర్మాగారాలకు ఇవే నిబంధనలు

కేంద్ర హోం శాఖ సూచన

సాక్షి, హైదరాబాద్‌: కరోనా తాజా సమాచారంతో పాటుగా వైరస్‌ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తలు, కేంద్రం అనుసరిస్తున్న నియంత్రణ చర్యలు వంటి అంశాలను అందించే ఆరోగ్య సేతు యాప్‌ను ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా వినియోగించేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కాలంలో మినహాయింపు రంగాలతో పాటు లాక్‌డౌన్‌ తర్వాత పనిచేసే అన్ని రంగాల్లో ఆరోగ్య సేతు యాప్‌ను తప్పనిసరి చేయాలని భావిస్తోంది. ఇటీవల కేంద్ర హోంశాఖ, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల తో జరిగిన సమావేశంలో ఆరోగ్య సేతు యాప్‌పైనే చర్చించారు. ఈనెల 20 నుంచి లాక్‌డౌన్‌లో కొన్ని రంగాలకు మినహాయింపు ఇచ్చింది. ఆహార పరిశ్రమలు, ఆహార ఉత్పత్తుల తయారీ రంగంతో పాటు నిర్మాణ రంగానికి నిబంధనలతో కూడిన మినహాయింపులు ఇచ్చింది. అయితే ఈ రంగాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు, ఇతర సిబ్బంది భౌతికదూరం పాటించడంతో పాటు ప్రతి ఒక్కరు ఆరోగ్యసేతు యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు
ప్రస్తుత లాక్‌డౌన్‌ కాలంతో పాటు లాక్‌డౌన్‌ తర్వాత తీసుకునే చర్యలకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధిత సర్క్యులర్‌ కాపీని కేంద్రం పంపించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సూచించిన ఆరోగ్యసేతు యాప్‌ నిబంధనలకు మద్దతు ఇచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మే 3 తో లాక్‌డౌన్‌ ముగియనుండగా..రాష్ట్రంలో మాత్రం మే 7తో లాక్‌డౌన్‌ ముగుస్తుంది. ఆ తర్వాత విడతల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు పలు సందర్భాల్లో ప్రకటించారు. విడతల వారీగా ఇచ్చే మినహాయింపులను పకడ్బందీగా చేపట్టి పరిశ్రమలు, ప్రైవేటు సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలకు మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య సేతు అప్‌డేటెడ్‌ వెర్షన్‌లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేస్తే కరోనా వ్యాప్తిని కేంద్రం సైతం పసిగట్టి తదుపరి చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.

ఎందుకీ యాప్‌? ప్రయోజనం ఏమిటి?
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) రూపొందించిన ఆరోగ్యసేతు యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత పలు రకాల ప్రశ్నలకు అందులో సమాధానాలు ఎంట్రీ చేయాలి. కరోనా వైరస్‌ వ్యాప్తి, సంబం«ధీకులతో మనం కనెక్ట్‌ అయ్యామా? విదేశాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చామా, కరోనా వైరస్‌ సోకే లక్షణాలేమైనా ఉన్నాయా అనే రీతిలో ప్రశ్నలకు జవాబులు రాయాలి. వీటి ఆధారంగా మన ఆరోగ్య పరిస్థితి ఈ యాప్‌లో రికార్డవుతుంది. కరోనా వైరస్‌ సోకకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను ఈయాప్‌ సూచిస్తుంది. మన చుట్టుప్రక్కల ఎవరైనా కరోనా రోగులుంటే అలర్ట్‌ చేస్తుంది. ఇందుకు జీపీఎస్‌ను ఆన్‌లో ఉంచాలి. ప్రస్తుతం ఆరోగ్య వివరాలను ఒకసారి మాత్రమే ఎంట్రీ చేయాల్సి ఉండగా..త్వరలో మరింత అప్‌డేట్‌ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో మన ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుంది. ప్రతి వ్యక్తిని పరిశీలించేందుకు బదులుగా..సాంకేతిక సాయంతో విశ్లేషించడానికి ఈ యాప్‌ దోహదపడుతుందని అధికారులు భావించి ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top