మందగమనాన్ని ఎదుర్కోగలం

PM Narendra Modi says economy has resilience to reverse slowdown - Sakshi

ఎకానమీ మళ్లీ అధిక వృద్ధి బాట పడుతుంది

కార్పొరేట్లు పెట్టుబడులు పెట్టాలి

సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలి

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు .. ప్రస్తుత మందగమనం నుంచి బైటపడే సత్తా ఉందని, మళ్లీ అధిక వృద్ధి బాట పట్టగలదని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి ఊతమిచ్చేలా పెట్టుబడులకు సంబంధించి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటూ కార్పొరేట్లకు పిలుపునిచ్చారు. పరిశ్రమల సమాఖ్య అసోచాం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. వ్యాపారాల నిర్వహణ సులభతరం చేసేందుకు, కార్పొరేట్లకు తోడ్పాటునిచ్చేందుకు తీసుకున్న చర్యలను పునరుద్ఘాటించారు.

సహేతుకమైన కారణాలతో నిజాయితీగా నిర్ణయాలు తీసుకున్న పక్షంలో కార్పొరేట్లపై ఎలాంటి చర్యలు ఉండబోవన్నారు. రాబోయే రోజుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై రూ. 100 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు, గ్రామీణ ఎకానమీని అభివృద్ధి చేసేందుకు మరో రూ. 25 లక్షల కోట్లు వ్యయం చేయనున్నట్లు చెప్పారు.  2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా మారడం లక్ష్యమన్నారు. ‘ప్రస్తుత ఆర్థిక మందగమనంపై జరుగుతున్న చర్చల గురించి నాకు అంతా తెలుసు. అయితే, ప్రతికూల వ్యాఖ్యల గురించి నేనేమీ మాట్లాడబోను. కేవలం సానుకూలాంశాల గురించే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాను‘ అని ప్రధాని చెప్పారు.

130 కోట్ల భారతీయులకు ఏజెంట్లం...
వ్యాపారాల నిర్వహణ సులభతరంగా ఉన్న దేశాల జాబితాలో మూడేళ్ల వ్యవధిలోనే భారత్‌ 142వ స్థానం నుంచి ఏకంగా 63వ స్థానానికి చేరిందని మోదీ చెప్పారు. గడిచిన మూడేళ్లుగా నిరంతరం మెరుగుపడుతున్న టాప్‌ 10 దేశాల్లో ఒకటిగా ఉంటోందన్నారు. ‘ఇదేమీ..  ఆరోపణలు, ప్రజాగ్రహాలు ఎదుర్కొనకుండానే సాధ్యపడలేదు. మమ్మల్ని కార్పొరేట్‌ ఏజెంట్లంటూ ఆరోపించారు. కానీ మేం 130 కోట్ల మంది భారతీయులకు ఏజంట్లము‘ అని ప్రధాని పేర్కొన్నారు.

కంపెనీల చట్టంలోని చాలా మటుకు నిబంధనలను క్రిమినల్‌ చర్యల పరిధి నుంచి తప్పించామని, మరిన్ని సవరణలు తేబోతున్నామని ఆయన వివరించారు. ఇక, విఫలమైన సంస్థలు బైటపడేందుకు దివాలా కోడ్‌ ద్వారా వెసులుబాటు లభిస్తోందని చెప్పారు. వ్యవస్థలో బలహీనతలను చాలా మటుకు అధిగమించామని తెలిపారు. ఇక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం, పెట్టుబడులు పెట్టడం మొదలైనవి బ్యాంకింగ్, కార్పొరేట్‌ వర్గాల వంతని ప్రధాని చెప్పారు. అయితే, ఈ క్రమంలో కార్మికుల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.   ‘అధిక వృద్ధి సాధించే క్రమంలో హెచ్చుతగ్గులు చోటుచేసుకోవడం గతంలోనూ జరిగింది. అయితే, భారత దేశానికి  ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుంచి బైటపడే సత్తా ఉంది‘ అని మోదీ పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top