అవినీతిని 85 శాతం తగ్గించాం | PM Narendra Modi to inaugurate 15th Pravasi Bharatiya Divas in Varanasi | Sakshi
Sakshi News home page

అవినీతిని 85 శాతం తగ్గించాం

Jan 23 2019 3:28 AM | Updated on Jan 23 2019 9:01 AM

PM Narendra Modi to inaugurate 15th Pravasi Bharatiya Divas in Varanasi - Sakshi

వారణాసి: దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ దేశంలో అవినీతి నిర్మూలన కోసం తీసుకున్న చర్యలు శూన్యమని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతీ రూపాయిలో 85 పైసలు అక్రమార్కుల చేతుల్లోకే వెళ్తోందని ఆ పార్టీకి చెందిన ప్రధాన మంత్రే (రాజీవ్‌ గాంధీ) గతంలో స్వయంగా వ్యాఖ్యానించారనీ, అయినా ఆ అవినీతిని అరికట్టే దిశగా కాంగ్రెస్‌ ప్రయత్నించిన దాఖలాలు లేవని మోదీ ఎద్దేవా చేశారు.

కానీ తమ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో 85 శాతం అవినీతికి అడ్డుకట్ట వేసిందనీ, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు రూ.5.8 లక్షల కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసిందన్నారు. తాను పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో 15వ ప్రవాస భారతీయుల దినోత్సవాలను మోదీ మంగళవారం ప్రారంభించారు. ఎన్‌ఆర్‌ఐలే విదేశాల్లో భారత్‌కు ప్రచారకర్తలనీ, దేశ సామర్థ్యాలకు వారే ప్రతీకలని మోదీ ప్రశంసించారు.  

మోదీ మార్పు తీసుకొస్తున్నారు
భారత్‌ మారజాలదన్న భావనను తమ ప్రభుత్వం తొలగించిందనీ, తాము మార్పు తీసుకొచ్చి చూపిస్తున్నామని మోదీ చెప్పుకొచ్చారు. మారిషస్‌ ప్రధాని ప్రవీంద్‌ జగన్నాథ్, భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, సహాయ మంత్రి వీకే సింగ్, ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ రామ్‌నాయక్, ఉత్తరప్రదేశ్, హరియాణ, ఉత్తరాఖండ్‌ల ముఖ్యమంత్రులు ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రవీంద్‌ జగన్నాథ్‌ మాట్లాడుతూ నైపుణ్య భారతం, బాలికలను రక్షించండి, బాలికలను చదివించండి తదితర పథకాలతో మోదీ భారత్‌లో మార్పు తీసుకొస్తున్నారని ప్రశంసించారు. అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన మోదీ, శుద్ధ ఇంధనాన్ని వాడేలా ప్రపంచ దేశాలను ప్రోత్సహించడంలో ముందున్నారని పేర్కొన్నారు.

మహాత్ముడి స్ఫూర్తితో స్వచ్ఛత
స్వాతంత్య్రానికి ముందు ప్రజల్లో ఉన్న బాధ్యతా చైతన్యం ప్రస్తుతం హక్కులపై చైతన్యంగా మారిందని మోదీ అన్నారు. మహాత్మా గాంధీ నుంచి స్ఫూర్తి పొంది స్వచ్ఛతను ప్రజా ఉద్యమంలా చేపట్టాలని ప్రజలు, సామాజిక, రాజకీయ నాయకులకు ఆయన పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ 150వ జయంత్యుత్సవాల్లో భాగంగా గుజరాత్‌లోని భావనగర్‌ జిల్లాలో కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవీయ నిర్వహించిన 150 కిలోమీటర్ల పాదయాత్ర సానోసరా అనే గ్రామంలో మంగళవారం ముగిసింది. పాదయాత్ర చేసి అక్కడకు చేరిన ప్రజలను ఉద్దేశించి మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. 

‘క్లీన్‌ గంగ’కు నిధులు
ప్రధాని మోదీకి వచ్చిన 1,900కు పైగా వస్తువులను వేలం వేసి, తద్వారా సమకూరే నిధులను గంగా నదిని శుభ్రం చేసే పనులకు ఉపయోగించనున్నారు. వేలానికి వచ్చే వస్తువుల్లో వివిధ చిత్రపటాలు, శిల్పాలు, శాలువాలు, తలపాగాలు, జాకెట్లు, సంప్రదాయిక సంగీత వాద్య పరికరాలు తదితరాలు ఉండనున్నాయి. వీటిని ఈనెల 27, 28 తేదీల్లో వేలం వేస్తారంటూ అధికారిక ప్రకటన వెలువడింది.

ప్రవాస తీర్థ దర్శన పథకం ప్రారంభం
విదేశాల్లో ఉంటున్న భారతీయుల కోసం మోదీ కొత్త పథకాన్ని ప్రారంభించా రు. ప్రవాస తీర్థ దర్శన పథకంలో భాగంగా ఏడాదికి రెండుసార్లు ప్రభుత్వ ఖర్చుతో భారత సంతతి వ్యక్తులను తీర్థయాత్రలకు తీసుకెళ్తారు. ఇప్పటికే తొలి విడతగా 40 మందిని ఈ పథకం లబ్ధి దారులుగా ఎంపిక చేశారు. ప్రవాస భారతీయ దినోత్సవాలు ముగిసిన అనంతరం ఈ యాత్ర ఢిల్లీ నుంచి ప్రారంభం కానుంది. 45 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న ప్రవాస భారతీయులు ఈ పథకానికి అర్హులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement