లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోండి:  డేంజర్ బెల్స్

People Still Not Taking lockdown seriously says PM Narendra Modi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న కరోనా మహమ్మారి దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది.  సోమవారం నాటికి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య  430 కి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మరణాల సంఖ్య  ఎనిమిదికి చేరింది. మరోవైపు లాక్ డౌన్  అమలుపై దేశ ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ సోమవారం ట్విటర్‌ వేదిక  అసంతప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌ పట్ల  నిర్లక్ష్యం వద్దంటూ ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరూ విధిగా ఆరోగ్య సూచనలు పాటించాలని సూచించారు. (మూడో దశకు సిద్ధమవ్వండి!)

‘లాక్‌డౌన్‌పై నిర్లక్ష్యం పనికిరాదు. దీన్ని ఎందుకు ప్రకటించామో గుర్తించాలి. లాక్‌డౌన్‌ను తీవ్రంగా పరిగణించి ప్రతి ఒక్కరూ విధిగా లాక్‌డౌన్‌ నియమాలు పాటించాలి. దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని’ మోదీ ట్వీట్ చేశారు.  మనల్ని మనం రక్షించుకోవడానికే లాక్‌డౌన్‌  పాటించాలని మోదీ పేర్కొన్నారు. మరోవైపు మహమ్మారి ప్రభావం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ అన్ని పరిశ్రమ సంస్థలతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మోదీ సమీక్ష  నిర్వహించనున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌ పట్ల కఠినగా వ్యవహరించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేం‍ద్రం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలను ఉ‍ల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. (రోడ్లపై వాహనాలు.. హెచ్చరికలు ఉల్లంఘన)

కాగా దేశవ్యాప్తంగా దాదాపు 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ మార్చి 31వరకు ఇది కొనసాగనుంది. అన్ని మెట్రో, రైళ్లు,  ఇతర రవాణా సౌకర్యాలు మార్చి 31 వరకు నిలిపివేయగా, అత్యవసర సరుకులు, మందుల కొరత రాకుండా ఆయా ప్రభుత్వాలు సంబంధిత చర్యలను తీసుకుంటున్నాయి. ముఖ్యంగా డెయిరీ, కిరాణా షాపులు, పెట్రోల్ పంపులు లాంటి అవసరమైన సేవలు మాత్రమే ప్రజల సౌలభ్యం కోసం తెరిచి ఉంటాయి. ఈ  ఆంక్షల ప్రభావం పడకుండా ఆయా రాష్ట్ర  ప్రభుత్వాలు ఆర్థిక సాయం కూడా ప్రకటించాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top