సర్వే కోసం సొంతూళ్లకు.. | peoles are coming to home town for survey | Sakshi
Sakshi News home page

సర్వే కోసం సొంతూళ్లకు..

Aug 16 2014 11:02 PM | Updated on Oct 8 2018 6:18 PM

ఈ నెల 19న చేపట్టిన సర్వేకోసం ముంబైతోపాటు మహారాష్ట్రలోని ప్రజలు తెలంగాణలోని సొంతూళ్ల బాటపట్టారు. దీంతో బస్సులు, రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి.

సాక్షి ముంబై, బోరివలి, న్యూస్‌లైన్: ఈ నెల 19న చేపట్టిన సర్వేకోసం ముంబైతోపాటు మహారాష్ట్రలోని ప్రజలు తెలంగాణలోని సొంతూళ్ల బాటపట్టారు. దీంతో బస్సులు, రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అదనంగా బస్సులను నడుపుతోంది. అయినప్పటికీ రద్దీ మాత్రం తగ్గడంలేదు. సర్వేలో పాల్గొనకపోతే తెలంగాణ రాష్ట్రంలో తమ పేర్లు ఉండబోవని భయాందోళనలు చెందుతున్న అనేక మంది పిల్లపాపలతో స్వగ్రామాలకు వెళ్తున్నారు.
 
కుటుంబానికి ఒక్కొక్కరి చొప్పున సర్వేలో పాల్గొంటేచాలని కొందరు చెబుతున్నారు. అందరూ ఉండాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు అధికారుల నుంచి ప్రకటనలు వెలుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో తమ పేర్లను తెలంగాణలో నమోదు చేసుకోవాలన్న లక్ష్యంతో అనేక మంది కుటుంబ సమేతంగా ఊరిబాటపట్టారు. స్వగ్రామాలకు వెళ్లేందుకు డబ్బులు లేనివారు కూడా అప్పులు చేసి మరి ఊళ్లకు వెళ్తున్నారు.
 
ఊరికి వెళ్లలేని వారి సంఖ్య లక్షల్లోనే...!
ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఒక కోటి మంది తెలుగు ప్రజలుండగా వీరిలో అత్యధికంగా తెలంగాణ వాసులే ఉన్నారు.  ఒక్క ముంబైలోనే సుమారు ఎనిమిది లక్షలకుపైగా ఉన్నారు. వీరిలో ఇక్కడే స్థిరపడినవారిని మినహాయిస్తే మిగతా వారిల్లో అత్యధికులు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనాలని భావిస్తున్నారు.  వీరంతా స్వగ్రామాలకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం ఉన్న రైళ్లతోపాటు బస్సుల టికెట్లన్నీ నిండుకున్నాయి. ఎక్కువ మంది రైళ్లలో జనరల్ బోగీల్లో ప్రయాణిస్తున్నారు. కొందరు బస్సుల్లో నిలబడి ప్రయాణిస్తూ ఊరికి వెళుతున్నారు.
 
అదనంగా బస్సులు, రైళ్లు నడపాలని ముంబైలోని తెలుగు సంఘాలతోపాటు ముంబై తెలంగాణ సంఘం అధ్యక్షుడు బద్ది హేమంత్‌కుమార్ తెలంగాణమంత్రులు, అధికారులతో సంప్రదింపులు జరిపారు. రైల్వే స్పందించకపోయినప్పటికీ ఆర్టీసీ మాత్రం ముంబైతోపాటు పుణే నుంచి సర్వే కోసం ప్రత్యేక బస్సులు ప్రారంభించింది. దీంతో అనేక మంది స్వగ్రామాలకు వెళ్లగలుగుతున్నారు. మరోవైపు కొందరు ప్రైవేట్ వాహనాలతోపాటు బస్సులను అద్దెకు తీసుకుని వెళ్తున్నారు. అయినప్పటికీ ఇంకా లక్షలాది మంది ఊళ్లకు వెళ్లలేకపోతున్నారు.
 
నేడు ముంబై, పుణే నుంచి అదనంగా 12 బస్సులు..
సమగ్ర కుటుంబ సర్వేను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ముంబై నుంచి ఎనిమిది.. పుణే నుంచి నాలుగు బస్సులను అదనంగా నడపనుంది. ఇప్పటికే పరేల్, కుర్లా, ఠాణే నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ప్రారంభించింది. అయితే ఆదివారం మాత్రం కుర్లా నుంచి నారాయణపేట, మహబూబ్‌నగర్‌కు రెండు బస్సులు, పరేల్ నుంచి జగిత్యాల, సిద్ధిపేట తదితర ప్రాంతాలకు రెండు బస్సులు, బోరివలి నుంచి కరీంనగర్ (వయా కోరుట్ల, జగిత్యా ల), ఠాణే నుంచి వనపర్తికి  మూడు బస్సులు అదనంగా నడుపుతున్నారు.
 
దీంతోపాటు పుణే నుంచి తాండూర్‌కు రెండు బస్సులు, మహబూబ్‌నగర్‌కు రెండు బస్సులతోపాటు పరిగికి అదనంగా బస్సును నడపనున్నట్టు తెలిసింది. దీంతో ప్రజలకు కొంత మేర ఊరట లభించనుందని భావిస్తున్నారు. వీటితోపాటు పరేల్ నుంచి లక్షెట్టిపేట (వయా ధర్మపురి, జగిత్యాల), బోరివలి-కరీంనగర్, గోరేగావ్-నార్కట్‌పెల్లి, కుర్లా-పరిగి వయా ఠాణే, కుర్లా-తాండూర్ వయా ఠాణే, ఠాణే-వనపర్తి, కుర్లా-నారాయణపేట మధ్య నడిచే రెగ్యులర్ సర్వీసులు కూడా ఉన్నాయి. ఈ బస్సులన్నీ కిక్కిరిసి కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement