
ఉత్తరాఖండ్ మృతులు 6 వేలు!
ఉత్తరాఖండ్‌లో గత జూన్‌లో సంభవించిన ప్రకృతి బీభత్సానికి ఆరువేల మందికిపైగా మరణించి ఉంటారని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో వెల్లడించింది.
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో గత జూన్‌లో సంభవించిన ప్రకృతి బీభత్సానికి ఆరువేల మందికిపైగా మరణించి ఉంటారని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో వెల్లడించింది. అందులో 580 మంది మృతి చెందినట్లుగా ధ్రువీకరించామని, 5,474 మంది ఆచూకీ ఇప్పటికీ వెల్లడికాలేదని పేర్కొంది. ఆ ఘటనలో ఇంత భారీగా మృతులు ఉండవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం ఇదే మొదటిసారి. ఈ మేరకు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ మంగళవారం లోక్‌సభకు ఒక నివేదిక సమర్పించారు. జూన్ 1 నుంచి 18 మధ్య అక్కడ 385 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, అది సాధారణ వర్షపాతానికి 440 రెట్లు ఎక్కువని తెలిపారు. భారీ వర్షాలు, వరద వల్ల రోడ్లు దెబ్బతిన్నా, వాతావరణం సహకరించకున్నా తక్కువ సమయంలోనే 1.10 లక్షల మందిని సురక్షితప్రాంతాలకు తరలించామని చెప్పారు.
సహాయకార్యక్రమాల్లో భారీగా సైనిక బలగాలు పాలు పంచుకున్నాయని ఆంటోనీ తెలిపారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఐదుగురు వైమానికదళ సిబ్బంది, తొమ్మిది మంది విపత్తు సహాయక సిబ్బందితో పాటు మరో ఎనిమిది మంది పారామిలటరీ సిబ్బంది మరణించినట్లు చెప్పారు. నష్టపోయిన ప్రాంతాల పునరుద్ధరణకు ప్రధాని రూ. వెయ్యికోట్ల సహాయాన్ని ప్రకటించగా.. ఇప్పటికే రూ. 400 కోట్లు అందజేశామని చెప్పారు. చార్‌ధామ్ ప్రాంతాల పునర్నిర్మాణానికి ప్రధాని నేతృత్వంలో కేబినెట్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే, కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని ప్రకటించినా.. ఇంతవరకూ ఉత్తరాఖండ్‌కు నిధులు అందలేదంటూ బీజేపీ, ఎస్పీ, తృణమూల్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా.. చార్‌ధామ్‌లో గల్లంతైనవారి సంఖ్య, వారికి నష్టపరిహారం చెల్లింపు తదితర అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎల్‌జేపీ నేత రాంవిలాస్ పాశ్వాన్ రాజ్యసభలో డిమాండ్ చేశారు. దేశంలో విపత్తు నిర్వహణ వ్యవస్థను, వాతావరణ హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపర్చాలని కోరారు. ఉత్తరాఖండ్ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు.