తొలి ‘ట్రైబల్‌ క్వీన్‌’గా పల్లవి దరువా

Odisha Woman Pallavi Darua Crowned As India First Tribal Queen - Sakshi

భువనేశ్వర్‌ : భారతదేశ తొలి ట్రైబల్‌ క్వీన్‌గా ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్‌ జిల్లాకు చెందిన పల్లవి దరువా చరిత్ర సృష్టించారు. ఆది రాణి కళింగ ట్రైబల్‌ క్వీన్‌ పోటీలో పాల్గొన్న వివిధ రాష్ట్రాలకు చెందిన 22 మందిని ఓడించి ఆమె కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. గిరిజన వేషధారణ, ఆభరణాల ప్రదర్శన, అద్భుత ప్రతిభ, సంస్కృతిని ప్రదర్శించడంలో నైపుణ్యం, ఫొటోజెనిక్‌ ఫేస్‌, బెస్ట్‌ స్కిన్‌, బెస్ట్‌ పర్సనాలిటీ వంటి ఏడు విభిన్న విభాగాల్లో పల్లవి విజేతగా నిలిచారు. ఈ పోటీలో టిట్లాఘడ్‌కు చెందిన పంచమీ మజీ మొదటి రన్నరప్‌గా నిలవగా.. మయూర్‌భంజ్‌కు చెందిన రష్మీరేఖా హన్స్‌దా రెండో రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఒడిశా ఎస్సీ, ఎస్టీ డిపార్ట్‌మెంట్‌, టూరిజం శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. స్థానిక ఉత్కళ్‌ మండపంలో జరిగిన ఈ పోటీలో ‘పద్మశ్రీ’ తులసి ముండా నేతృత్వంలోని జ్యూరీ సభ్యులు విజేతలను నిర్ణయించారు.

సమయం ఆసన్నమైంది...
‘చాలా మంది గిరిజన బాలికలు, మహిళలకు నాలాగా ఈ విధంగా బయటి ప్రపంచంలోకి రావడం, చదువుకోవడం వంటి అవకాశాలు దక్కడం లేదు. ట్రైబల్‌ క్వీన్‌గా కిరీటాన్ని సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కానీ వారందరికీ నేనొక చక్కని ఉదాహరణగా నిలుస్తానని అనుకుంటున్నాను. మూఢనమ్మకాలు వదిలేసి.. బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టాల్సిన సమయం వచ్చేసిందంటూ’  ట్రైబల్‌ క్వీన్‌ పల్లవి దరువా పిలుపునిచ్చారు.

చరిత్ర సృష్టించాం...
విజేతలను ప్రకటించిన అనంతరం అవార్డు కమిటీ ప్రధాన కార్యదర్శి చిదాత్మిక ఖట్వా మాట్లాడుతూ... ‘ఈరోజు మేము చరిత్ర సృష్టించాం. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన సంస్కృతిని దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చాం. ఇది కేవలం బాహ్య సౌందర్యానికి సంబంధించిన పోటీ కానే కాదు. కేవలం కళలు, నృత్యరీతుల ద్వారానే కాకుండా గిరిజన మహిళలకంటూ ఒక సొంత గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ పోటీ నిర్వహించాం. సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాంప్‌పై నడవడం, అందరి ముందు అభిప్రాయాలను వెల్లడించడం వంటివి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయంటూ’ వ్యాఖ్యానించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top