
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి చైనా కంపెనీలతో ధరలపరంగా పోటీపడటంపై దృష్టి పెడుతున్నట్లు టాటా మోటర్స్ ఎండీ (ప్యాసింజర్ వెహికల్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ) శైలేష్ చంద్ర తెలిపారు. ఇప్పటికే కొన్ని అంశాల్లో దీటుగా పోటీనిస్తుండగా, వచ్చే ఏడాది, ఏడాదిన్నర వ్యవధిలో చైనా తయారీ సంస్థలకు సరిసమానమైన రేట్లకే వాహనాలను అందించే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
స్థానికంగా తయారీ, స్వావలంబన సాధించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారీ ఉత్పత్తి స్థాయితో పాటు ప్రభుత్వం నుంచి లభించే ప్రోత్సాహకాలు చైనా కంపెనీలకు ప్రయోజనకరంగా ఉంటున్నాయని, అందుకే అవి తక్కువ రేట్లకు ఉత్పత్తులను అందించగలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా స్థిరమైన పాలసీలపరంగా ప్రభుత్వ తోడ్పాటు, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం 5 శాతానికి పెరిగిందని చెప్పారు. టాటా మోటర్స్ ఆగస్టులో 7,111 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. గతేడాది ఆగస్టులో నమోదైన 4,392 యూనిట్లతో పోలిస్తే ఇది 62 శాతం అధికం.