‘తబ్లిగ్‌’ తెచ్చిన ‘తక్లీఫ్‌’ అంతా ఇంతా కాదు! | Nizamuddin Cluster Spreads Coronavirus | Sakshi
Sakshi News home page

‘తబ్లిగ్‌’ తెచ్చిన ‘తక్లీఫ్‌’ అంతా ఇంతా కాదు!

Apr 2 2020 5:14 PM | Updated on Apr 2 2020 6:00 PM

Nizamuddin Cluster Spreads Coronavirus - Sakshi

మూడు రోజుల మత సమ్మేళనం నేడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో మార్చి పదవ తేదీ నుంచి 13వ తేదీ వరకు ‘తబ్లిగ్‌ జమాత్‌’ నిర్వహించిన మూడు రోజుల మత సమ్మేళనం నేడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కార్యక్రమానికి కరోనా వైరస్‌ విస్తరించిన దేశాల నుంచే కాకుండా భారత్‌లోని పలు రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 2000 మంది ముస్లింలు హాజరవడం, వారిలో దాదాపు 150 మందికి వైరస్‌ సోకినట్లు ఇప్పటికే నిర్ధారణ అవడం, వారిలో ఏడుగురు మరణించడం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. 

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నమోదైన కరోనా కేసుల్లో ఎక్కువ కేసులు ఆ ఢిల్లీ మత సమ్మేళనానికి హాజరైనవారివి అవడం గమనార్హం. ఢిల్లీ కన్నా ముందు మలేసియాలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన తబ్లిగ్‌ జమాత్‌ సమ్మేళనంలో పాల్గొన్న వారిలో కూడా 650 మందికి కరోనా సోకినట్లు అక్కడి నుంచి అందిన వార్తలు తెలియజేస్తున్నాయి. సున్నీల విస్తరణ ఉద్యమంలో భాగంగా ఇండోనేసియా ప్రధాన కేంద్రంగా 1926లో ఏర్పాటయిన తబ్లిగ్‌ జమాత్‌కు ఇండోనేసియా, భారత్, మలేసియాతోపాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, సింగపూర్‌ దేశాల్లో ఫొలోవర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ సంస్థ ఈ దేశాల్లో ప్రతి ఏటా ఇలాంటి సమ్మేళనాలను నిర్వహిస్తోంది. ఈసారి ఢిల్లీలోని సమ్మేళనానికి ఇరాన్, అఫ్గానిస్థాన్, లండన్‌ నుంచి ఎనిమిది మంది ముస్లిం ప్రతినిధులు రావడం, వారందరికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరి నెల నాటికే ఇరాన్, లండన్‌లకు కరోనా వైరస్‌ విస్తరించింది. ఆ 8 మందిని ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ నగరంలోకి లాలా లజ్‌పత్‌రాయ్‌ ఆస్పత్రి ‘క్వారెంటైన్‌’లో ఉంచారు.  (లాక్‌డౌన్‌ అతిక్రమిస్తే రెండేళ్ల జైలు)

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎవరైనా 14 రోజుల క్వారెంటైన్‌కు వెళ్లాల్సిందే అన్న ట్రావెల్‌ హెచ్చరికను భారత ప్రభుత్వం మార్చి 16వ తేదీన జారీ చేసింది. విదేశీ ప్రతి నిధులు అంతకుముందే వచ్చారుకనుక వారికి ‘క్వారెంటైన్‌’ నిబంధన వర్తించకపోవచ్చు. ఎలాంటి వేడుకలు, మత కార్యక్రమాలు, సభలు, సమావేశాల పేరుతో 200 మందికి మించి గుమికూడరాదంటూ ఢిల్లీలోని కేజ్రివాల్‌ ప్రభుత్వం మార్చి 13వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. జమాత్‌ సమ్మేళనం మార్చి పది నుంచి 13వ తేదీ వరకు జరిగినందున, ఉత్తర్వులు వెలువడిన రోజు, 13న సమ్మేళనంపై చర్య తీసుకున్నా పెద్ద ప్రయోజనం ఉండేది కాదు. 

అయినా భారత్‌లో కరోనా విస్తరణకు ‘తబ్లిగ్‌ జమాత్‌’ కారణం అయింది కనుక అది ‘ఇస్లాం జిహాద్‌’లో భాగంగా జరిగిందని కొందరు చెబుతుంటే ‘ఇస్లామిక్‌ ఇన్‌సరెక్షన్‌ (ఇస్లాం తిరుగుబాటు), కరోనా టెర్రరిజమ్‌’ అని మరికొందరు విమర్శిస్తున్నారు. వారందరిపై దేశ ద్రోహం నేరం కింద కేసులు పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. విదేశాల నుంచి విజిటింగ్‌ వీసాలపై వచ్చి ఎలాంటి మత కార్యక్రమాల్లో పాల్గొన రాదు. మత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రావాలంటే ప్రత్యేక అనుమతి అవసరం. అందుకని ఇంతవరకు ఢిల్లీలోని జమాత్‌ సమ్మేళనానికి హాజరైన వందమందిపై విదేశీయుల చట్టం, భారతీయ శిక్షాస్మృతి కింద 23 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. (ఏపీలో135కి చేరిన కరోనా కేసులు)

ఈ చర్యల వల్ల ఇప్పుడు ఢిల్లీ జమాత్‌కు హాజరైన వారందరిని గుర్తించడం కష్టం అవుతోంది. తమ మీద కూడా కేసులు పెడతారనే భయంతో వారు ముందుకు రావడం లేదు. సామాజిక దూరం పాటించాలనే నిబంధనలను ఉల్లంఘించడం హిందూ మత కార్యక్రమాల్లో కూడా చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత మహారాష్ట్రలోని శిరిడీ సాయిబాబా ఆలయంలో ఓ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. యూపీలోని అయోధ్యలో సాక్షాత్తు ఆదిత్యయోగి నిర్వహించిన పూజా కార్యక్రమంలో వందల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మోదీ లాక్‌డౌన్‌ ప్రకటించిన రెండోరోజు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆ ప్రజా సమూహాల ద్వారా కరోనా విస్తరించక పోవడం అదృష్టంగా భావించాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement