
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలకు ప్రత్యేక హోదా మంజూరు చేసే ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. లోక్‌సభలో ఎంపీ కౌశలేంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు ఆమె రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
ఒడిశా, రాజస్థాన్, బిహార్, తెలంగాణ, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ప్రత్యేక హోదా కోసం అభ్యర్థనలు వచ్చాయని వివరించారు. జాతీయ అభివృద్ధి మండలి (ఎన్డీసీ) గతంలో ప్రణాళిక సహాయం కోసం ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక హోదా మంజూరు చేసేదన్నారు. గతంలో ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాల్లో పరిశ్రమల వృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహకాలేవీ ఇవ్వలేదని తెలిపారు.