జైల్లో నిర్భయ దోషుల సంపాదనెంతో తెలుసా..!

Nirbhaya Convicts Earned Over One Lakh In Prison Wages - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దాదాపు ఏడేళ్ల తర్వాత నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలైంది. ఢిల్లీలోని తీహార్‌ జైల్లో శుక్రవారం ఉదయం 05:30 గంటలకు దోషులు ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ ఠాకూర్‌లను ఉరితీశారు. తరువాత మృతదేహాలను పోస్టుమార్టం కోసం దీన్‌దయాల్‌ ఆస్పత్రికి తరలించారు. ఒక వేళ వారి కుటుంబ సభ్యులు మృతదేహాలను తీసుకెళ్లేందుకు ముందుకు రాకపోతే పోలీసులే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  వీరిని ఉరి కంబం వద్దకు తీసుకెళ్లే ముందు నలుగురు దోషులు కంటతడి పెట్టినట్లు జైలు అధికారులు తెలిపారు. అయితే ఈ నలుగురు కూడా శిక్ష అనుభవిస్తున్న కాలంలో జైళ్లో పనిచేసి మొత్తం రూ.1,37,000 సంపాదించారు. వాటిలో అక్షయ్‌ రూ. 69 వేలు సంపాదించగా, పవన్‌ రూ. 29 వేలు, వినయ్‌ రూ. 39 వేలు సంపాదించారు. చదవండి: అర్ధరాత్రి ఎక్కడుందో తెలుసా: దోషుల లాయర్‌

ఇక ముఖేష్‌ సింగ్‌ ఎలాంటి పని చేయలేదు. కేసు కొనసాగిన ఏడేళ్ల కాలంలో ఈ నలుగురు 23 సార్లు జైలు నిబంధనలు ఉల్లంఘించారని సమాచారం. జైలు నిబంధనలు ఉల్లంఘించినందుకు వినయ్‌ శర్మ 11 సార్లు, అక్షయ్‌ సింగ్‌ ఒకసారి శిక్షను అనుభవించారు. ఇక ముఖేష్‌ మూడు సార్లు, పవన్‌ ఎనిమిది సార్లు జైలు నిబంధనలను ఉల్లంఘించారు. వీరి చదువుల విషయానికి వస్తే 2016లో ముఖేష్‌, పవన్‌, అక్షయ్‌.. పదో తరగతిలో అడ్మిషన్‌ తీసుకున్నప్పటికీ వారు పాస్‌ కాలేదు. 2015లో వినయ్‌ బ్యాచిలర్‌ డిగ్రీలో అడ్మిషన్‌ తీసుకున్నాడు. కానీ, అతను ఆ డిగ్రీని పూర్తి చేయలేదు.

కాగా.. 2012 డిసెంబర్‌ 16 అర్థరాత్రి ఆరుగురు వ్యక్తులు నిర్భయపై సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో ఈ దారుణానికి పాల్పడ్డారు. నిర్భయను అత్యంత క్రూరంగా హింసించారు. ఆమెతో ఉన్న స్నేహితుడిపైనా దాడిచేశారు. తీవ్రగాయాలైన ఇద్దరిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నిర్భయ మృతి చెందింది. రామ్‌సింగ్‌, అక్షయ్‌, వినయ్‌ శర్మ, పవన్‌, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత అతడు విడుదలయ్యాడు. అతడిపై నిఘా కొనసాగుతుంది. చదవండి: నిర్భయ కేసు: ఆ మైనర్‌ ఇప్పుడెక్కడా?! 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top