నిర్భయ వ్యక్తిత్వంపై లాయర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

Nirbhaya Convicts Lawyer Questions Nirbhaya Character After Execution - Sakshi

న్యూఢిల్లీ: ఏడేళ్ల న్యాయ పోరాటం తర్వాత నిర్భయకు న్యాయం జరిగిందంటూ దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంటే దోషుల తరఫు లాయర్‌ అజయ్‌ ప్రకాశ్‌ సింగ్‌(ఏపీ సింగ్‌) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాధితురాలి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అహంకార పూరితంగా వ్యవహరించారు. అత్యంత హేయమైన నేరానికి పాల్పడిన నిర్భయ దోషులను కాపాడేందుకు ఏపీ సింగ్‌ శతవిధాలా ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దోషుల ఉరితీతకు రెండు గంటల ముందు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా రివ్యూ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో శుక్రవారం ఉదయం నలుగురు దోషులు ముఖేష్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ ఠాకూర్‌లను ఉరితీసిన విషయం తెలిసిందే. (నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు)

ఈ నేపథ్యంలో నిర్భయ తల్లిదండ్రులు సహా ఢిల్లీ వ్యాప్తంగా యువత, మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. విజయచిహ్నం చూపుతూ స్వీట్లు పంచుకున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఏపీ సింగ్‌.. స్థానికుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు ఓడిపోయిన క్రమంలో... దోషుల తల్లుల కడుపుకోతను వేడుక చేసుకుంటారా అంటూ మండిపడ్డారు. నిర్భయ తల్లిని ఉద్దేశించి.. ‘‘ ఒక తల్లి కోసం ఇంతమంది ముందుకు వచ్చారు. మరి ఆ తల్లి తన కూతురు అర్ధరాత్రులు ఎక్కడ తిరుగుతుందో ఎందుకు పట్టించుకోలేదు. ఎవరితో ఎటువంటి పరిస్థితుల్లో ఉందో ఎందుకు తెలుసుకోలేదు’’ అంటూ అవమానకర రీతిలో మాట్లాడారు. దోషుల తల్లులు కూడా తమ కొడుకులను నవ మాసాలు మోసి కన్నారని.. వారికి బాధ ఉండదా అంటూ అక్కసును వెళ్లగక్కారు. మరో రెండు మూడు రోజుల పాటు ఉరిశిక్ష వాయిదా వేయించడానికి ప్రయత్నించానని చెప్పుకొచ్చారు.(ఉరితీయొద్దు.. సరిహద్దుకు పంపండి)

కాగా ఏపీ సింగ్‌ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. ఆయన వ్యాఖ్యలు పితృస్వామ్య భావజాలానికి అద్దం పడుతున్నాయని.. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఇక నిర్భయ ఘటన జరిగిన సమయంలోనూ ఏపీ సింగ్‌ ఇలాగే మాట్లాడిన విషయం తెలిసిందే. తనకు డబ్బు, ఆరోగ్యం కంటే కూడా వ్యక్తిత్వమే ముఖ్యమని.. నిర్భయ స్థానంలో తన కూతురు ఉండి ఉంటే ఆమెను తానే పెట్రోల్‌ పోసి నిప్పంటించేవాడినని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. (ఉరి ఖాయం.. ఇక నా కూతురి ఆత్మకు శాంతి!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top