ఉరితీయొద్దు: దోషుల లాయర్‌

AP Singh Says Nirbhaya Convicts Ready To Serve Country - Sakshi

న్యూఢిల్లీ: ‘‘వాళ్లను భారత్‌- పాకిస్తాన్‌ సరిహద్దుకు పంపండి లేదా డోక్లాంకు పంపండి. అంతేగానీ వాళ్లను ఉరితీయకండి. వాళ్లు దేశ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని నిర్భయ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తాను అఫిడవిట్‌ దాఖలు చేస్తానని పేర్కొన్నారు. డిసెంబరు 16, 2012లో కదులుతున్న బస్సులో వైద్య విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు రామ్‌ సింగ్‌, ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ ఠాకూర్‌ సహా ఓ మైనర్‌ సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. తీవ్ర గాయాలతో ప్రాణాలతో పోరాడుతూ బాధితురాలు సింగపూర్‌లోని ఆస్పత్రిలో కన్నుమూసింది. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక ఈ కేసులో ప్రధాన దోషి రామ్‌సింగ్‌ తీహార్‌ జైలులో ఆత్మహత్య చేసుకోగా... మైనర్‌ విడుదలయ్యాడు. మిగిలిన నలుగురు దోషులు ముఖేశ్‌, పవన్‌, అక్షయ్‌, వినయ్‌లకు ఉరిశిక్ష ఖరారు కాగా అనేక పరిణామాల అనంతర, మూడుసార్లు ఉరిశిక్ష అమలు వాయిదా పడిన తర్వాత.. తాజాగా మార్చి 20న ఉరితీత ఖరారు చేస్తూ డెత్‌వారెంట్లు జారీ అయ్యాయి. (వాళ్లకు ఏ అవకాశాలు లేవన్న కోర్టు.. కానీ మళ్లీ)

ఈ క్రమంలో వారిని శిక్ష నుంచి తప్పించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్న ఏపీ సింగ్‌.. వరుస పిటిషన్లు, రివ్యూ పిటిషన్లు వేయిస్తూ వారికి అండగా నిలిచారు. ఇక తాజాగా నిర్భయ దోషులకు ఎటువంటి చట్టపరమైన అవకాశాలు లేవంటూ ఢిల్లీ కోర్టు పేర్కొనగా.. ఉరిశిక్షపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లను పటియాలా హౌజ్‌ కోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో కోర్టు ప్రాంగణంలో ఏపీ సింగ్‌ మాట్లాడుతూ.. నిర్భయ దోషులు సైనికుల్లా పనిచేస్తారని.. వారికి దేశ సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరడం విశేషం. కాగా నిర్భయ ఘటన జరిగిన సమయంలో దోషులను సమర్థించిన ఏపీ సింగ్‌.. రాత్రిపూట అమ్మాయిలు బయట తిరిగితే ఇలాంటి ఘటనలే జరుగుతాయని... తన కూతురు ఇలా బాయ్‌ఫ్రెండ్‌తో తిరిగితే చంపేసే వాడినంటూ లింగవివక్ష పూరిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా నిర్భయ దోషులు ఉగ్రవాదులు కాదని.. వారిని క్రూరమైన నేరస్తులుగా చిత్రీకరించి ఎప్పుడో చంపేశారని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (దోషులను నాలుగుసార్లు చంపేశారు : ఏపీ సింగ్‌)

నిర్భయ: ‘బతకాలని లేదు.. నేను చచ్చిపోతా’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top