వాళ్లకు ఏ అవకాశాలు లేవన్న కోర్టు.. కానీ మళ్లీ | Sakshi
Sakshi News home page

నిర్భయ దోషులకు ఏ అవకాశాలు లేవు: ఢిల్లీ కోర్టు

Published Thu, Mar 19 2020 3:43 PM

Delhi Court Says No Legal Remedies Of Nirbhaya Convicts Pending Ahead Execution - Sakshi

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఇక ఎటువంటి చట్టపరమైన అవకాశాలు మిగిలిలేవని ఢిల్లీ కోర్టు గురువారం స్పష్టం చేసింది. మార్చి 20న నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు దోషులు ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌ శర్మలను ఉరితీయాలంటూ ఢిల్లీ కోర్టు డెత్‌వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... తాము దాఖలు చేసిన పలు పిటిషన్లు, అభ్యర్థనలు పెండింగ్‌లో ఉండటం, రెండోసారి క్షమాభిక్ష కోరే అవకాశాలు పరిశీలించేంత వరకు ఉరిని నిలుపుల చేయాలని బుధవారం వీరు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం.. దోషులకు ఇక ఏ అవకాశాలు లేవని పేర్కొంది. ఈ సందర్భంగా వారు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఇదిలా ఉండగా... ఈ కేసులో దోషి పవన్‌ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్‌ పిటిషన్‌ను గురువారం సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చిన విషయం తెలిసిందే.(‘నిర్భయకు ఇక న్యాయం జరుగుతుంది’)

మరోవైపు దోషి అక్షయ్‌ ఠాకూర్‌ గురువారం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. రాష్ట్రపతి తన క్షమాభిక్షను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ క్రమంలో అక్షయ్‌ లాయర్‌ ఏపీ సింగ్‌ తన వాదనలు వినిపిస్తూ.. అక్షయ్‌ క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించిన అంశం మిగిలిన ముగ్గురు దోషులు, అతడితో సంబంధం కలిగి ఉన్న ప్రతీ ఒక్కరిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన న్యాయస్థానం... ‘‘మీరు రెండోసారి క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలు చేస్తే దానిని రాష్ట్రపతి తిరస్కరించారు. ఇప్పుడు దానిపై న్యాయ సమీక్ష చేయాల్సిన అవసరం ఏముంది?’’ అని ప్రశ్నించింది. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు అవుతుందా లేదా అన్న విషయంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక నిర్భయ తల్లి ఆశాదేవి మాత్రం తన కూతురికి రేపు న్యాయం జరుగుతుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. (నిర్భయ దోషుల ఉరికి డమ్మీ పూర్తి)

Advertisement
Advertisement