ఇంతకీ ఆ లేఖలో ఏముంది?.. అసలేం జరిగింది? | A Letter From New York Mayors To Tihar Jail, How Umar Khalid Case Went Global | Sakshi
Sakshi News home page

ఇంతకీ ఆ లేఖలో ఏముంది?.. అసలేం జరిగింది?

Jan 3 2026 9:17 PM | Updated on Jan 4 2026 4:38 PM

New York Mayors Letter To Tihar Jail

దేశంలోని తీహార్‌ జైలులో UAPA అంటే Unlawful Activities Prevention Act కింద ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న ఉమర్‌ ఖాలిద్‌ అనే వ్యక్తికి అమెరికాలోని న్యూయార్క్‌ మేయర్‌ లేఖ రాయడం విచిత్రంగా ఉంది కదూ.. కానీ అది వాస్తవం.. ఆ లేఖలో.. మేమందరం మీ గురించే ఆలోచిస్తున్నాం అని రాశారు. అసలు జైల్లో ఉన్న వ్యక్తికి... మేయర్‌ మధ్య స్నేహం, బంధుత్వాలు లేవు.. అసలు ఒకరినొకరు ఎప్పుడూ కలవలేదు. అయినా జైలులో ఉన్న వ్యక్తి అమెరికా, యూరప్‌లలో చర్చలకు కేంద్ర బిందువయ్యాడు.

జైల్లో ఉన్న వ్యక్తితో పాటు.. అదే కేసులో జైల్లో ఉన్న మరికొందరిని బెయిల్‌ ఇవ్వకుండా UAPA చట్టం కింద బంధించడం మానవ హక్కులను హరించినట్టేనని... వారిని విడుదల చేయాలని ప్రపంచదేశాల నుంచి సందేశాలు రావడం గమనార్హం... అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే.. మనం ఓ సారి 2020లోకి వెళ్లి రావాల్సిందే..

సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. అదే సమయంలో 2020 ఫిబ్రవరిలో ఉత్తర–తూర్పు ఢిల్లీలో భారీగా అల్లర్లు చెలరేగాయి. ఆ గొడవల్లో53 మంది మరణించగా.. వందలాది సంఖ్యలో గాయపడ్డారు. ఆ అల్లర్ల నేపథ్యంలో పోలీసులు ఈ కుట్రలో ఉమర్‌ ఖాలిద్‌ కూడా భాగస్వామి అని ఆరోపిస్తూ దర్యాప్తు చేపట్టారు. జామియా కోఆర్డినేషన్ కమిటీ సమావేశాల్లో చురుకుగా పాల్గొనడమే కాకుండా... అల్లర్లకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారని... రెచ్చగొట్టే ప్రసంగాలు, హింసను ప్రేరేపించారంటూ UAPA, IPC ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఉమర్ ఖాలిద్‌ను, ఆయనతో పాటు షర్జీల్‌ ఇమాంలను  2020 సెప్టెంబర్‌లో అరెస్టు చేసి తీహార్‌ జైలుకు తరలించారు. అప్పటి నుంచి వారు అదే జైలులో ఉన్నారు.

బెయిల్‌ కోసం వారి తరపు న్యాయవాదులు తొలుత ఢిల్లీ హైకోర్టుకు వెళ్లగా.. ఢిల్లీ కోర్టు వారి బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. దీంతో న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ పోలీసుల తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్ మెహతా, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపిస్తూ.. పిటిషన్దారులు అకస్మాత్తుగా అల్లర్లకు పాల్పడలేదని.. పూర్తి ప్రణాళికతోనే అల్లర్లు జరిగాయని.. కోర్టుకు నివేదించారు.

నిందితుల తరఫున కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ దవే, సల్మాన్ ఖుర్షీద్, సిద్ధార్థ్ లూథ్రాలు వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ అరవింద్ కుమార్.., అంజారియాల ధర్మా సనం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని, ప్రభుత్వాన్ని విమర్శించే స్వరాలను అణచివేయడమే లక్ష్యం అని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. మానవ హక్కుల సంస్థలు దీన్ని ప్రజాస్వామ్య సంక్షోభంగా అభివర్ణిస్తున్నాయి.

ఐదేళ్ల నుంచి బెయిల్‌ దొరక్క.. జైల్లో ఉన్న ఉమర్‌ ఖాలిద్‌కు ప్రపంచవ్యాప్తంగా సానుభూతి అందుతోంది. ఆధారాల్లేకుండానే ఉమర్‌ ఖాలిద్‌ ఇండియన్‌ జైల్లో మగ్గుతున్నాడని... న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ, ఢిల్లీ అల్లర్ల కేసులో తీహార్ జైలులో ఉన్న ఉమర్ ఖాలిద్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన “మేమందరం మీ గురించే ఆలోచిస్తున్నాము” అని పేర్కొంటూ.. ఖాలిద్‌‌కు మద్దతు ప్రకటిస్తూ లేఖ రాశారు.

తన లేఖలో ఖాలిద్‌కు మానసిక ధైర్యం ఇవ్వాలని ప్రయత్నించారు. ఆయన “మీరు ఒంటరిగా లేరు, మేమందరం మీ గురించే ఆలోచిస్తున్నాము” అని రాశారు.ఈ లేఖతో ఖాలిద్ కేసు అంతర్జాతీయ వేదికపై మరింత చర్చకు వచ్చింది. అమెరికాలోని రాజకీయ నాయకులు కూడా భారతదేశంలో మానవ హక్కుల అంశాల గురించి చర్చిస్తున్నారనడనికి ఈ లేఖ ఓ ఉదాహరణ.

జోహ్రాన్ మమ్దానీ ఉగాండా దేశంలోని కంపాలలో 1991 అక్టోబర్ 18, జన్మించారు. 2021 నుంచి న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. 2025 ఎన్నికల్లో న్యూయార్క్ నగర మేయర్ పదవికి డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఇతర దేశానికి చెందిన ఓ ఉన్నత స్థాయి నాయకుడు జైల్లో ఉన్న వ్యక్తికి లేఖ రాయడంతో.. ఉమర్‌ ఖాలిద్‌కు మరింత గుర్తింపు తెచ్చిఇచ్చింది.

లేఖ సాధారణమే.. అయినప్పటికీ.. రాసిన లేఖ ఎఫెక్ట్‌ ప్రపంచంపై పడే అవకామంది. ఖాలిద్ వంటి కార్యకర్తలకు ఇది మానసిక ధైర్యం ఇస్తుంది. భారతదేశంలో మానవ హక్కుల పరిస్థితిపై అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. భారత్‌- అమెరికాల సంబంధంపైనా ప్రభావం చూపే అవకాశముంది. అమెరికా మాత్రమే కాకుండా... అమెరికా, యూరప్‌లోని కొన్ని రాజకీయ నాయకులు, మానవ హక్కుల సంస్థలు ఖాలిద్‌కు మద్దతు తెలుపుతూ... ఆయనపై కేసు రాజకీయ ప్రయోజనాలకోసం పెట్టారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement