
న్యూఢిల్లీ: కేంద్రం బడ్జెట్‌లో భారీ స్థాయిలో ప్రకటించిన జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం(మోదీ కేర్) అమలుకు ఏడాదికి రూ. లక్ష కోట్లు అవసరమవుతాయని ఒక అధ్యయనంలో తేలింది. బీమా మొత్తంలోని 2 శాతాన్ని ప్రీమియంగా వసూలు చేసినా.. పథకం అమలుకు ఏడాదికి రూ. లక్ష కోట్లు అవసరమని అధ్యయనం తేల్చింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ(ఎన్‌ఐపీఎఫ్‌పీ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మితా చౌదురీ రూపొందించిన ఈ పత్రంలో.. ‘మోదీ కేర్ పథకం వల్ల రాష్ట్రాలు తమ సొంత ఆరోగ్య పథకాల్ని అమలు చేసుకునే స్వేచ్ఛ తగ్గవచ్చు’ అని ఆందోళన వెలిబుచ్చారు.
‘మోదీ కేర్’ అమలుకు ఏడాదికి రూ. 10 నుంచి 12 వేల కోట్లు సరిపోతాయని నీతి ఆయోగ్ సలహాదారు అలోక్ కుమార్ విశ్లేషించిన నేపథ్యంలో పరిశోధన పత్రంలోని అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘60 శాతం నిధుల్ని కేంద్రం, మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని నిర్ణయించారు. ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ. 60 వేలకోట్లు సమకూర్చాలి’ అని పరిశోధన పత్రంలో తెలిపారు. మోదీ కేర్‌పై విమర్శల్ని నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్ కుమార్ తోసిపుచ్చారు. అదనంగా వసూలు చేసే 1% సెస్ నిధులు ఈ పథకం అమలుకు సరిపోతాయన్నారు.