ట్విటర్‌ ఫాలోవర్స్‌ను భారీగా కోల్పోయిన మోదీ

Narendra Modi, Rahul Gandhi, Donald Trump Lose Followers On Twitter - Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచంలో చాలామంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు భారీ సంఖ్యలో ట్విటర్ ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వినియోగం భారీగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో ట్విటర్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగి వుండటాన్ని ప్రముఖులు ప్రతిష్టాత్మకంగానూ తీసుకుంటున్నారు. అయితే, ఈ మధ్యన పలువురు ప్రముఖులకు ట్విటర్‌ ఫాలోవర్స్‌ భారీగా తగ్గిపోయారట. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి వారు భారీగా ట్విటర్‌ ఫాలోవర్స్‌ను కోల్పోయినట్టు తెలిసింది. తాజా రిపోర్టు ప్రకారం ప్రధాని మోదీ ట్విటర్‌ ఫాలోవర్స్‌ 43.4 మిలియన్‌ నుంచి 43.1 మిలియన్‌కు పడిపోయినట్టు వెల్లడైంది.

కేవలం మన దేశ రాజకీయవేత్తలే కాకుండా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌,  ఆ దేశ మాజీ తొలి మహిళ హిల్లరీ క్లింటన్‌లు కూడా భారీ ఎత్తున్న ట్విటర్‌ యూజర్లను నష్టపోయారని తెలిసింది. దీనికంతటికీ కారణం ట్విటర్‌ ఇటీవల తన మైక్రోబ్లాగింగ్‌ సైట్‌లో ఫేక్‌ అకౌంట్లను డిలీట్‌ చేయడమే. ట్విటర్‌ ఫేక్‌ అకౌంట్లను, ఫాలోవర్స్‌ను తొలగించడంతో, వీరికి ఫాలోవర్స్‌ తగ్గిపోయారు. బాలీవుడ్‌ స్టార్లు షారుఖ్‌ ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌లు, టాలీవుడ్‌ నటుడు మహేష్‌ బాబు కూడా పెద్ద ఎత్తున్న ట్విటర్‌ ఫాలోవర్స్‌ను కోల్పోయినట్టు రిపోర్టులు వెల్లడించారు. 

‘గత ఏడాదంతా టెక్నాలజీ, మెరుగైన ప్రక్రియలను చేపడటంతో మా స్పామ్‌ విధానాలను ఉల్లంఘిస్తున్న 214 శాతానికి పైగా అకౌంట్లను నిర్మూలిస్తున్నాం. మేము అభివృద్ధి చేసిన కొత్త ప్రొటెక్షన్లు రోజుకు 50,000 కంటే ఎక్కువ స్పామ్ సైన్అప్‌లను నిరోధించడంలో మాకు సహాయపడ్డాయి’ అని ట్విటర్‌ అధికార ప్రతినిధి చెప్పారు. తాజాగా విడుదలైన రిపోర్టుల ప్రకారం తొలగిస్తున్న ఈ అకౌంట్లతో ట్విటర్‌ వ్యాపారాలు, కంపెనీ షేర్లు ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3.1 బిలియన్‌ డాలర్లు పడిపోయే అవకాశం ఉంది. తాము తొలగించిన అకౌంట్లలో గత 30 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజుల నుంచి వాడనవే ఉన్నాయని తెలిసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top