బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చిన మోదీ

Narendra Modi Presents Maldives President Cricket Bat - Sakshi

మాలీ : ప్రస్తుతం ఎక్కడ ఎవరిని కదిపినా క్రికెట్‌ ప్రపంచకప్‌ గురించే చర్చ. క్రికెట్‌ ప్రపంచకప్‌ యావత్‌ ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఇక భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కూడా క్రికెట్‌పై అమితాసక్తి ఉంటుంది. దీంతో టీమిండియా గెలవాలని కోరుకుంటూనే.. విజయం వరించినపుడు శుభాకాంక్షలు తెలుపుతారు. అయితే తాజాగా మాల్దీవుల పర్యటనలో ఉన్న మోదీ ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్‌ సోలికి టీమిండియా క్రికెటర్లు సంతకాలు చేసిన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చారు. మోదీ బ్యాట్‌ను బహుమతిగా ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది 

అయితే సోలి క్రికెట్‌ వీరాభిమాని కావడంతోనే బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చానని మోదీ ట్విటర్‌లో తెలిపారు. అంతేకాకుండా మాల్దీవుల్లో క్రీడా అభివృద్దికి భారత్‌ చేయుతనందిస్తుందని హామీ ఇచ్చారు. మాల్దీవుల్లో క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు భారత్ సహకరిస్తుందని భారత విదేశాంగ కార్యదర్శి విజయ్‌ గోఖలే వెల్లడించారు. అక్కడి క్రికెటర్లకు బీసీసీఐ ద్వారా అత్యుత్తమ శిక్షణను అందిస్తామన్నారు. క్రికెట్‌ స్టేడియం నిర్మించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా నేడు  (శనివారం) మాల్దీవులకు చేరుకున్నారు. రెండవసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ.. విదేశీ పర్యటనలో భాగంగా తొలిసారిగా మాలీని సందర్శిస్తున్నారు.  ఆ దేశ అత్యున్నత పురస్కారం, ప్రఖ్యాత ‘రూల్ ఆఫ్ నిషాన్ ఇజుదీన్‌’ అవార్డుతో మాల్దీవుల అధ్యక్షుడు ప్రధాని మోదీని సత్కరించనున్నారు. అలాగే మాల్దీవుల పార్లమెంట్​లో మోదీ ప్రసంగించనున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top