యే పబ్‌జీ వాలా హై క్యా: మోదీ

Narendra Modi Asked A Mother Ye PUBG Wala Hai Kya - Sakshi

న్యూఢిల్లీ: పరీక్షా పే చర్చ 2.0 కార్యక్రమంలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని ఎలా జయించాలనే దానిపై ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మధుమిత సేన్‌ గుప్తా అనే మహిళ మోదీతో మాట్లాడుతూ.. ‘నా కుమారుడు తొమ్మిది తరగతి చదువుతున్నాడు. ఇదివరకు తను చదువుల్లో ముందుండే వాడు. కానీ ఇటీవలి కాలంలో గేమ్స్‌కు ఆకర్షితుడై చదువుల్లో వెనకబడ్డాడు. గేమ్స్‌ మాన్పించడానికి నేను ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింద’ని తెలిపారు. దీనికి పరిష్కారం చూపాలని మోదీని కోరారు.  

దీనిపై స్పందించిన మోదీ ‘యే పబ్‌జీ వాలా క్యా హై’ అంటూ సరదాగా తన సమాధానాన్ని మొదలెట్టారు. దీంతో అక్కడున్న వాళ్లంతా పెద్దగా నవ్వారు. ఆ తర్వాత మోదీ టెక్నాలజీపై విలువైన సూచన చేశారు. ఈ రోజుల్లో పిల్లలకు టెక్నాలజీని దూరంగా ఉంచితే వారు చాలా వెనక్కి వెళ్లిపోతారని తెలిపారు. ఒక విధంగా చెప్పాలంటే టెక్నాలజీ వచ్చి చాలామందిని రోబోలుగా తయారు చేస్తుందని.. అందుకే దానిని ఎలా వినియోగించాలనే దానిపై పిల్లల్లో అవగాహన తీసుకురావాలని అన్నారు. ఈరోజు ఎవరి చేతిలో చూసినా కూడా సెల్ ఫోన్ తప్పక కనిపిస్తుంది.. సమావేశంలో కూర్చున్న చాలామంది కూడా ప్రస్తుతం ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేస్తున్నారు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. 

అయితే టెక్నాలజీని అభివృద్ధి కోసం వాడాలని తెలిపిన ఆయన.. దాన్ని దుర్వినియోగం చేయకూడదన్నారు. ఉపాధ్యాయులు కూడా పిల్లలకు టెక్నాలజీపై, దాని వినియోగంపై అవగాహన తీసుకురావాలని అన్నారు. ఆ విధంగా చేయడం వల్ల పిల్లలు టెక్నాలజీని మిస్ యూజ్ చేయరని అన్నారు. కాగా,  ప్రస్తుతం పిల్లలకు, యువతకు పబ్‌జీ గేమ్‌ నిద్ర లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. కొందరు విద్యార్థులు ఈ గేమ్‌ బారిన పడి చదువులను పక్కన పెట్టేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top