స్కూల్‌ పిల్లల కన్నా దారుణం

MPs in the Lok Sabha Speaker comment on style - Sakshi

లోక్‌సభలో ఎంపీల తీరుపై స్పీకర్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: లోక్‌సభ సభ్యుల ప్రవర్తన స్కూల్‌ పిల్లల కన్నా దారుణంగా ఉందని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ వ్యాఖ్యానించారు. రఫేల్‌ విమానాల కొనుగోలు వివాదంపై అధికార, ప్రతిపక్షాలు సభలో సృష్టిస్తున్న గందరగోళం నేపథ్యంలో స్పీకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మన కన్నా స్కూల్‌ పిల్లలు నయం అని నాకు ఓ మెసేజ్‌ వచ్చింది. స్కూల్‌ పిల్లల కన్నా మనం దారుణమా?’అని ఆమె వ్యాఖ్యానించారు. లోక్‌సభ ప్రారంభమైన కొద్దిసేపటికే రఫేల్‌ వివాదంపై ఇరు పక్షాలు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు పోటాపోటీగా నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించడంతో ప్రారంభమైన కొద్ది సేపటికే ఇరు సభలు మరుసటి రోజుకు వాయిదా పడ్డాయి.

రాజ్యసభలో కూడా రఫేల్, కావేరీ వివాదంపై ఆందోళనలు కొనసాగాయి. తుపానులు వంటి పలు అత్యవసర అంశాలపై చర్చ జరిగేలా సభ నడిచేలా సహకరించాలని చైర్మన్‌ వెంకయ్యనాయుడు సభ్యులను కోరారు. సంబంధిత పత్రాలను మంత్రులు ప్రవేశపెట్టగానే డీఎంకే, అన్నా డీఎంకే సభ్యులు కావేరీ సమస్యపై చర్చకు పట్టుపట్టారు. నినాదాలు చేస్తూ ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకెళ్లారు. రఫేల్‌ వివాదంలో ప్రభుత్వంపై సభా హక్కుల నోటీసులు జారీ చేశామని, దానిపై చర్చ జరగాలని రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ డిమాండ్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top