మధ్యప్రదేశ్‌లో ‘హనీ ట్రాప్‌’

MP Honeytrap Case Father Of Accused Monika Yadav Detained - Sakshi

యువతులను ఎరగా వేసి నేతలు, అధికారుల నుంచి కాంట్రాక్టులు

కీలక సూత్రధారి అరెస్ట్‌

ఇండోర్‌: కాలేజ్‌లకు వెళ్లే వయసులో ఉన్న మధ్య తరగతి యువతులను డబ్బు, లగ్జరీ లైఫ్, ఇతర అవసరాలు ఎరగా వేసి.. రాజకీయ నాయకులు, సీనియర్‌ అధికారులకు లైంగిక వాంఛలు తీర్చేలా వారిని ఒత్తిడి చేసి.. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కమిషన్లు, ఇతర సౌకర్యాలు పొందే భారీ కుంభకోణం మధ్యప్రదేశ్‌లో బయటపడింది. హర్భజన్‌ అనే సీనియర్‌ ఇంజినీర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు గతవారం ఇద్దరు మహిళలను అరెస్ట్‌ చేశారు. వారిలో మోనిక యాదవ్‌ అనే యువతి రూ. 3 కోట్లు ఇవ్వాలని, లేదంటే తనతో సెక్స్‌ చేసిన వీడియోను బయటపెడ్తానని బ్లాక్‌ మెయిల్‌ చేసిందని హర్భజన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో మోనికను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె చెప్పిన వివరాలతో దీని వెనుక భారీ స్కామే దాగి ఉందని పోలీసులకు అర్థమైంది.

దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసింది. ఈ కుంభకోణంలో కీలక పాత్రధారి శ్వేత జైన్‌ కాగా, ఆమెకు ఆర్తి దయాల్‌ సహకరించేదని మోనిక విచారణలో తెలిపింది. అనంతరం వీరిద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మధ్యతరగతికి చెందిన కాలేజ్‌కి వెళ్లే దాదాపు పాతికమంది యువతులను వారి అవసరాలు, డబ్బు ఎరగా వేసి, వారిని ప్రభుత్వంలోని కీలక పెద్దలు, సీనియర్‌ ఉన్నతాధికారులకు వద్దకు పంపించేదని, అనంతరం వారినుంచి పెద్దపెద్ద కాంట్రాక్టులను భారీ కంపెనీలకు ఇప్పించి, కమిషన్లు తీసుకునేదని తేలింది. వీలైన చోట్ల బ్లాక్‌మెయిల్‌ చేసి వారి నుంచి డబ్బు లాగేదని తెలిసింది. ఈ అవసరాల కోసం దాదాపు 40 మంది సెక్స్‌వర్కర్లను కూడా ఉపయోగించుకుందని తేలింది.

ఇండోర్‌కు చెందిన మోనికను కూడా ఇలాగే ప్రతిష్టాత్మక కాలేజీలో సీట్‌ ఇప్పిస్తానని చెప్పి ఈ స్కామ్‌లో భాగం చేసింది. అయితే, ఇందుకు నిరాకరించిన మోనిక ఇండోర్‌ లోని తన ఇంటికి వెళ్లింది. ఆ తరువాత మోనిక ఇంటికి వెళ్లిన ఆర్తి.. మోనిక చదువు ఖర్చులు తమ ఎన్జీవో తరఫున తామే భరిస్తామని ఆమె తల్లిదండ్రులను ఒప్పించి తిరిగి భోపాల్‌ తీసుకువచ్చింది. అనంతరం ఆమెను ఒక ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో హర్భజన్‌ వద్దకు పంపించారు. హర్భజన్‌ ఫిర్యాదుతో గుట్టంతా బయటపడింది. ఈ విషయాన్ని బయటపెడితే ఆ సెక్స్‌ వీడియోను నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని తనను కూడా బెదిరించారని మోనిక తెలిపింది. ఈ స్కామ్‌ విచారణను సీఎం సిట్‌కి అప్పగించారు.

హనీట్రాప్‌ కేసు:  నిందితురాలు ఆర్తి దయాల్‌

మాజీ సీఎం కూడా..  
శ్వేతా జైన్‌ క్లయింట్లలో సెక్రటరీ స్థాయి అధికారులు, దాదాపు 8 మంది మాజీ మంత్రులతో పాటు ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం. పెద్దపెద్ద కంపెనీలకు ప్రభుత్వ కాంట్రాక్టులు ఇప్పించి కమిషన్లు తీసుకునేవాళ్లమని, అలాగే ఐఏఎస్, ఐపీఎస్‌ సహా వివిధ స్థాయిల్లో అధికారుల బదిలీల్లోనూ తమ సిఫారసులు పని చేసేవని శ్వేత జైన్‌ సిట్‌ అధికారుల విచారణలో వెల్లడించింది. ఇప్పటివరకు దాదాపు డజను మంది అధికారులను, 8 మంది మాజీ మంత్రులను విచారించారు.  శ్వేత, ఆర్తిల నుంచి 200 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, 1000 ఆడియో, వీడియో క్లిప్పులను వారి కంప్యూటర్‌ నుంచి సేకరించామని పోలీసులు చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top