చౌకీదార్‌కు అర్థమేమిటి? అసలెక్కడిదీ పదం! | Meaining Of Chowkidar | Sakshi
Sakshi News home page

చౌకీదార్‌ పేరిట 15మిలియన్ల ట్వీట్లు!

Mar 20 2019 4:01 PM | Updated on Mar 20 2019 4:26 PM

Meaining Of Chowkidar  - Sakshi

తలపాగాతో కాపలా కాస్తున్న చౌకీదార్లు

న్యూఢిల్లీ: దేశ రాజకీయల్లో గత కొన్ని రోజులుగా చౌకీదార్‌ అనే పదం బాగా పాపులరైంది. ప్రధాని నరేంద్రమోదీ తనను తాను ‘చౌకీదార్‌’గా దేశానికి కాపలాదారుగా అభివర్ణించుకోగా.. రఫేల్‌ స్కాంలో మోదీ అవినీతికి పాల్పడ్డారని, ఆయన చౌకీదార్‌ కాదు.. చోర్‌ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ  విమర్శల దాడికి దిగారు. ఈ నేపథ్యంలో రాహుల్‌కు కౌంటర్‌గా ‘మై భీ చౌకీదార్‌’ (నేనూ కాపలాదారుడినే) నంటూ మోదీ సోషల్‌ మీడియాలో సరికొత్త ప్రచారానికి తెరతీశారు. ఈ ప్రచారంలో భాగంగా మోదీ తన ట్విటర్‌ ఖాతాలో పేరుకు ముందు చౌకీదార్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. మోదీకి సంఘీభావంగా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమ ట్విటర్‌ అకౌంట్ల పేర్లకు ముందు మే భీ చౌకీదార్‌ ట్యాగ్‌ను చేర్చారు. బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో ఈ పదానికి విస్తృత ప్రాధాన్యాన్ని కల్పించింది. ఈ పదంతో ట్విటర్‌లో కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు 1.5 మిలియన్ల ట్వీట్లు వెలువడ్డాయి. దీంతో ఈ పదం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఏర్పడింది. 

చౌకీదార్‌ ఒక ఉర్దూ పదం. చౌకీ (సరిహద్దులు)కి దార్ (కాపలాదారు)గా ఉండే వారిని చౌకీదార్‌ అంటారు‌. దోపిడీదారులు, దొంగలు, చొరబాటుదారుల నుంచి గ్రామాన్ని రక్షించే కాపలాదారులుగా, గ్రామ రక్షకులుగా చౌకీదార్‌లను వ్యవహరిస్తారు. ఈ పదాన్ని ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువులో కూడా చేర్చారు. ప్రపంచీకరణతో నగరాల్లో చాలా మార్పులు రావడంతో చౌకీదార్లకు అక్కడ చోటు లేకుండా పోయింది. కాపలా కాస్తూ అందరితో స్నేహంగా మెలిగే చౌకీదార్ల స్థానంలో యూనిఫాం వేసుకునే సెక్యూరిటీ గార్డులు భర్తీ  చేశారు. కానీ ఇప్పటికీ అనేక గ్రామాల్లో చౌకీదార్లు తమ విధులను నిర్వహిస్తూనే ఉన్నారు. చిన్న చిన్న గ్రామాలు, ప్రయాణ సౌకర్యాలు లేని పల్లెల కాపలాకు పోలీసులు ఇప్పటికీ వీరినే నియమిస్తుంటారు. ఆయా గ్రామాల ప్రజలతో మమేకమై, అందరినీ ఓ కంట కనిపెడుతూ.. అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందించడం వీళ్ల విధి. కాపలాదారుగా రక్షణ సేవలు నిర్వహించే చౌకీదారుల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఎప్పడైతే ఈ పదం రాజకీయ రంగు పులుముకుందో దేశవ్యాప్తంగా చౌకీదార్‌ వ్యవస్థపై సోషల్‌ మీడియా, పత్రికలు, టీవీలలో అనేక చర్చలు జరుగుతున్నాయి. కానీ నిజమైన చౌకీదార్ల కష్టాలు, కన్నీళ్ల కథల మీద ఈ చర్చలు నడిస్తే బాగుంటుందని పలువురు పేర్కొంట్నున్నారు.

బాలీవుడ్‌ సినిమాల్లో కూడా చౌకీదార్‌ పదాన్ని కొంతమేర జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. 1974లో ఓం ప్రకాశ్‌ హీరోగా నటించిన చౌకీదార్‌ చిత్రం విడుదలైంది. స్నేహపూర్వకంగా సాగుతూ, పేద ప్రజలను సహాయం చేస్తూ, ఒక అమ్మాయి సంరక్షణ చేపట్టే చౌకీదార్‌ పాత్రలో ఓంప్రకాశ్‌ నటన అప్పట్లో అందరినీ మెప్పించింది. ఆ తర్వాత  చాలా సంవత్సరాలకు మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ తన ‘3 ఇడియట్స్‌’ సినిమాలో చౌకీదార్‌ ప్రస్తావన తీసుకొచ్చాడు. 3 ఇడియట్స్‌లో హీరో ఆమిర్‌ ఖాన్‌  చిన్నతనంలో తనను అల్లారుముద్దుగా చూసుకుంటూ, కథలు చెప్పే చౌకీదార్‌ గురించి మిత్రులతో చెప్పే సీన్‌ సెంటిమెంటల్‌గా అందరికీ బాగా కనెక్ట్‌ అయింది. ఆ తర్వాత  ఇప్పుడే మోదీ వల్ల ఈ పదానికి మళ్లీ ఇంతటి క్రేజ్‌ ఏర్పడింది. గేటెడ్‌ కమ్యూనిటీలు పుట్టుకొచ్చిన ఈ 21వ శతాబ్దంలో యూనిఫాంలు, తలకు టోపీలు పెట్టుకునే  సెక్యూరిటీ గార్డులు వచ్చాక.. నెత్తికి తలపాగా, ధోతీ ధరించి, గుబూరు మీసాలతో అందరితో కలసిపోతూ కాపలాకాసే కాపలాదారలు దాదాపుగా అంతరించిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement