కాటేసిన పామును కొరికి చంపేశాడు

Man got Bitten by Snake He Retaliated by Biting it back  - Sakshi

‘మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు..కుక్కను మనిషి  కరిస్తే వార్త’  అంటూ సాధారణంగా జర్నలిజం నేర్చుకునే  విద్యార్థులకు  చెబుతారు. వార్త  ప్రాధాన్యత, ప్రాముఖ్యతను గురించి తెలియ చెప్పటానికి ఈ నానుడి బాగా ఉపయోగపడుతుంది. అయితే గుజరాత్‌లో దాదాపు ఇలాంటి వింత విషయం ఒకటి చోటుచేసుకుంది. 

పొలంలో పనిచేసుకుంటున్న ఓ పెద్దాయనను పాము కాటేసింది. దానిపై పగ తీర్చుకోవాలనుకున్నాడో ఏమో..తెలియదుగానీ..తనను కాటేసిన పామును పట్టుకుని పరపర కొరికి పారేశాడు. అయితే ఆ పాము బాగా విషపూరితమైంది కావడంతో దురదృష్ట వశాత్తూ ఆయన కూడా చనిపోయారు. మాహిసాగర్ జిల్లా  అజన్వా గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

పర్వత్ గాలా బారియా (70) తన వ్యవసాయం క్షేత్రంలోని మొక్కజొన్న పంటను ట్రక్కులో లోడ్ చేస్తున్న ప్రదేశంలోకి ఒక పాము వచ్చింది. దాన్ని చూసిన అక్కడి వారందరూ పారిపోయారు. కానీ అంతకుముందు కూడా పాములను పట్టుకున్న అనుభవం వున్న పర్వత్‌ అక్కడే వుండిపోయారు. కానీ పాము కాటు నుంచి మాత్రం తప్పించుకోలేక పోయారు. చేతులమీద, ముఖం మీద కాటు వేసింది. దీంతో ఆగ్రహం  కట్టలు తెంచుకున్న పర్వత్‌ పామును దొరకబుచ్చుకుని కొరికి చంపేశాడని  అజన్వా సర్పంచ్ కనుబరియా చెప్పారు. వెంటనే ఆయన్ను లూనావాడా ఆసుపత్రికి ఆ తరువాత గోద్రాలోని పెద్దాసుపత్రికి తరలించాం.. కానీ సకాలంలో మెరుగైన వైద్యం అందకపోవడం, విషం శరీరమంతా వ్యాపించడంతో పర్వత్‌ ప్రాణాలు  విడిచాడని  సర్పంచ్‌  చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు  వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top