రూ.35 కోసం ఏడాదిగా పోరాటం! 

Man Fight For Ticket Money With IRCTC - Sakshi

జైపూర్‌ : టికెట్‌ బుక్‌ చేసుకొని, రద్దు చేసుకున్న తర్వాత తనకు రావాల్సిన డబ్బుల్లో రూ.35 కోసం ఓ వ్యక్తి ఏడాదిగా ఐఆర్‌సీటీసీతో పోరాటం చేస్తున్నాడు. వివరాల్లోకెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన  సుజిత్‌ స్వామి అనే యువకుడు రూ.765కు టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. దాన్ని క్యాన్సిల్‌ చేసుకుంటే అతనికి రూ.665 మాత్రమే చెల్లించారు. నిజానికి తనకు రావాల్సిన దానికంటే రూ.35 తక్కువగా చెల్లించడంతో కారణమేంటో తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం ద్వారా ఐఆర్‌సీటీసీని ప్రశ్నించాడు.

దీంతో  ఫిర్యాదు చేస్తే రిఫండ్‌ చేస్తామని తొలుత బదులిచినా.. రీఫండ్‌ చేయలేదు. దీంతో సుజిత్‌ ఐఆర్‌సీటీసీకి లేఖ రాయడంతో అక్కడి నుంచి వచ్చిన సమాధానం చూసి షాక్‌ అయ్యాడు. ‘రైల్వే కమర్షియల్‌ సర్క్యులర్‌ 43 కింద జీఎస్టీ అమలు కంటే ముందే టికెట్‌ బుక్‌ చేసుకున్నాడని,  జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత టికెట్‌ రద్దు చేసుకున్నందున.. అదనంగా దీనిపై సర్వీస్‌ ఛార్జీలు వర్తిస్తాయని, అందువల్ల రీఫండ్‌ చెయ్యాల్సిన అవసరం లేదని ఐఆర్‌సీటీసీ సమాధానమిచ్చింది.

ఇక జీఎస్టీ అమలులోకి వచ్చిన జూలై 1 నుంచి జూలై 11 మధ్య ప్రయాణానికి టికెట్‌ కొని, దాన్ని రద్దు చేసుకున్న వారి నుంచి రూ. 3.34 కోట్ల సర్వీస్‌ చార్జీలను ఐఆర్‌సీటీసీ వసూలు చేసింది. చాలా మంది ప్రయాణికులకు ఈ బాదుడు విషయం తెలియదని, కొందరికి తెలిసినా విషయాన్ని పెద్దగా పట్టించుకోవడంలేదని సుజిత్‌ స్వామి ఆవేదన వ్యక్తంచేశాడు. దీనిపై లోక్‌ అదాలత్‌ను సుజిత్‌ ఆశ్రయించగా, రైల్వే బోర్డుకు, పశ్చిమ మధ్య రైల్వేకు, ఐఆర్‌సీటీసీకి నోటీసులు జారీ అయ్యాయి.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top