Sakshi News home page

ఖర్గే.. ఓ సారి కౌగిలించుకో..

Published Sat, Nov 28 2015 12:26 PM

Mallikarjun Kharge-Narendra Modi warmth, off camera

న్యూఢిల్లీ: రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలతో పోల్చితే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా హాలులో, లాబీల్లో నేత మధ్య చోటుచేసుకునే ఆసక్తిర అంశాలు బయటికి వెల్లడికావటం చాలా అరుదు. శుక్రవారం సభ వాయిదా అనంతరం పార్లమెంట్ సెంట్రల్ హాలులో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, వెంకయ్య నాయుడు సహా మరో ఇద్దరు కేంద్ర మంత్రుల మధ్య జరిగిన సంభాషణ.. అంతకుముందు సభ రాజేసిన వేడిని కాస్త చల్లార్చే విధంగా సాగింది.

శుక్రవారం సభ ముగిసిన తర్వాత స్పీకర్ సుమిత్రా మహాజన్ తన ఛాంబర్ లోకి వెళ్లిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం దాదాపు 10 నిమిషాలపాటు సెంట్రల్ హాలులోనే ఉండిపోయారు. వెంకయ్యనాయుడు, రాంకృపాల్ యాదవ్ మోదీ చుట్టూ చేరి ఏదో మాట్లాడుకుంటున్నారు. సభకు కుడివైపు.. అప్పుడే బయటికి వెళ్లేందుకు ఉద్యుక్తులవుతున్న కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను ఉద్దేశించి వెంకయ్యనాయుడు.. 'ఖర్గేజీ.. రండి రండి.. మోదీగారితో ఓసారి చెయ్యికలిపి వెళుదురుగానీ' అన్నారు. (అప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు సభ నుంచి వెళ్లిపోయారు)

ఊహించని ఆహ్వానాన్ని అంగీకరించాలా? వద్దా? అని ఊగిసలాడిన ఖర్గేను మరోసారి గట్టిగా పిలిచారు వెంకయ్య. తప్పక అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకుడు.. ప్రధాని మోదీకి ఫార్మల్గా షేక్హ్యాండ్ ఇచ్చారు. ఖర్గే భావాలను పసిగట్టిన మరో కేంద్ర మంత్రి రాంకృపాల్ యాదవ్ మధ్యలో కలగజేసుకుని.. 'ఖర్గేజీ.. మోదీని కౌగిలించుకోండి(గలే మిలాయియే)' అంటూ ఉత్సాహపర్చారు.

అయితే ఖర్గే మాత్రం ఆ పని చేయకుండా మిన్నకుండిపోయారు. దీంతో అందరి ముఖాల్లో కనిపించీ కనిపించని వెలితి. పరిస్థితిని ప్రశాంతపరుస్తూ 'మా దుస్తులు కూడా మ్యాచ్ అయ్యాయి' అంటూ మోదీ చలోక్తి విసరడంతో అక్కడ నవ్వులు విరిశాయి. శుక్రవారం మోదీ, ఖర్గే ఇద్దరూ తెలుపు రంగు కుర్తా పైజామాపై క్రీమ్ కలర్ కోటు ధరించారు. కాగా, జీఎఎస్టీ సహా ఇతర ముఖ్యబిల్లుల ఆమోదం కోసం విపక్షాలతో చర్చలకు సిద్ధమైన ప్రధాని.. ఆ మేరకు శుక్రవారం రాత్రి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లకు తేనీటి విందు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా, ఇవాళ ఉదయం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన నివాసంలో మల్లికార్జున ఖర్గే కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తమ పార్టీ పేర్కొంటున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నట్లైతే అధికార పార్టీ ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతు తెలిపే అవకాశం ఉంటుందని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement