కరోనాతో మాజీ సీనియర్‌ అధికారి, రచయిత్రి మృతి

Maharashtra Former Election Commissioner Dies Of Corona - Sakshi

మహారాష్ట్ర  తొలి మహిళా ఎన్నికల కమిషనర్‌ నీలా సత్యనారాయణ

నిబద్ధతగల అధికారిగా, మంచి వ్యక్తిగా గుర్తింపు 

మంచి రచయిత్రి, గాయని కూడా

సాక్షి, ముంబై : కరోనా కారణంగా మహారాష్ట్రకు చెందిన మాజీ ఎన్నికల కమిషనర్, మరాఠీ రచయిత్రి నీలా సత్యనారాయణ‌ (72) మృతి చెందారు. ఇటీవల ఆమెకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో  ముంబైలోని  ఈస్ట్ అంధేరీ,  సెవన్ హిల్స్ ఆస్పత్రిలో చేరారు.  చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె భర్త, కుమారుడికి  కూడా కోవిడ్-19 సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్ర తొలి మహిళా ఎన్నికల కమిషనర్‌గా సేవలందించిన సత‍్యనారాయణ మరణంపై పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిబద్దత గల అధికారిణి, సామాజిక స్పృహ కలిగిన మంచి వ్యక్తిని సమాజం కోల్పోయిందని రాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్ కోశ్యారీ సంతాపం ప్రకటించారు. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సహా రాజకీయ నాయకులు సత్యనారాయణకు  నివాళులు అర్పించారు. ప్రభుత్వ అధికారిగానే కాకుండా, సాహిత్యరంగంలో కూడా తనకంటూ  సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నారని  సీఎం ఠాక్రే గుర్తు చేసుకున్నారు. యువతకు  ఆమె ప్రేరణ అని ఆయన పేర్కొన్నారు.

ఆమె మరణం తనను షాక్‌కు గురిచేసిందని  ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. రాష్ట్ర మంత్రులు అశోక్ చవాన్, నవాబ్ మాలిక్, ధనంజయ్ ముండే, అనిల్ పరాబ్, ఎన్‌పీసీ ఎంపి సుప్రియా సులే కూడా సత్యనారాయణ మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయంటూ ట్విట్‌ చేశారు. ఇంకా పలువురు ఇతర ప్రముఖులు కూడా ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. 

కాగా ముంబైలోని మరాఠీ కుటుంబంలో జన్మించిన నీలా సత్యనారాయణ మహిళా ఐఏఎస్‌ అధికారుల ప్రాధాన్యత కోసం పోరాడారు. ఈ సందర్భంగా మహిళా బ్యూరోక్రాట్లు చేసిన తిరుగుబాటు, నిరససన చాలా విశేషంగా నిలిచింది. అలాగే  జైలు శాఖ అధికారిగా పనిచేసిన సమయంలో మహిళా ఖైదీల కళా నైపుణ్యాలను ప్రోత్సహించే సంస్కరణలు  చేపట్టారు. 1972 బ్యాచ్ ఐఏఎస్‌ అధికారి నీలా సత్యనారాయణ 2009 లో రాష్ట్ర రెవెన్యూ విభాగానికి అదనపు ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. అనంతరం  2009-2014 మధ్య రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేశారు. దీంతోపాటు ఆమె అనేక పుస్తకాలను రచించారు. మంచి గాయని కూడా. లాక్‌డౌన్‌ కాలంలో తన అనుభవాలతో ఒక పుస్తకాన్ని రచించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top