
బీజేపీ ముందు సేన డిమాండ్లు ఇవే..
ముంబై : కేంద్రంలో రెండవసారి అధికార పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందు మిత్రపక్షం శివసేన మూడు డిమాండ్లను ఉంచింది. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు మూడు కీలక డిమాండ్లను బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్ షాకు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే నివేదించారు. డిప్యూటీ స్పీకర్‌తో పాటు శివసేన నుంచి క్యాబినెట్‌లో మెరుగైన ప్రాతినిథ్యం, క్యాబినెట్ మంత్రి అరవింద్ గణ్‌పత్ సావంత్‌కు కీలక మంత్రిత్వ శాఖలను కేటాయించాలేని ఉద్ధవ్ బీజేపీ అగ్రనేతలను కోరినట్టు సమాచారం.
తమ డిమాండ్లపై మోదీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నామని శివసేన పార్లమెంటరీ పార్టీ నేత సంజయ్ రౌత్ చెప్పారు. లోక్‌సభలో బీజేపీకి సొంతంగా మెజారిటీ దక్కడం సంతోషమే అయినా మిత్రపక్షాల బలాబలాలను కూడా గుర్తించడం కీలకమని రౌత్ అభిప్రాయపడ్డారు. లోక్‌సభలో 18 మంది, రాజ్యసభలో ముగ్గురు సభ్యులు కలిగిన తమ పార్టీకి కేవలం ఒక్క మంత్రి పదవినే కట్టబెట్టడం సరికాదని, క్యాబినెట్ విస్తరణలో తమకు సరైన ప్రాతినిథ్యం దక్కాలని రౌత్ పేర్కొన్నారు.