breaking news
Deputy Speaker Lok Sabha
-
అంత కోపం వద్దు...ప్రేమతో మాట్లాడండి; మీరేమీ మోరల్ సైన్స్ టీచర్ కాదు!
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన ధన్యవాద తీర్మానంలో తృణమాల్ కాంగ్రెస్ పార్టీ నేత మహువా మోయిత్రా వివిధ సమస్యల పట్ల ప్రభుత్వ తీరు పై నిప్పులు చెరిగారు. దీంతో లోక్ సభ డిప్యూటీ స్పీకర్ రమాదేవి.. మోయిత్రా మాటలకు అంతరాయం కలిగిస్తూ లోక్‌సభ గౌరవార్థం "ప్రేమతో మాట్లాడండి, అంత కోపం తెచ్చుకోవద్దని కోరారు. అంతేకాదు సహనం, క్షమ, దయాలతోనే ప్రపంచం ఒక శక్తి దర్పణంలా ప్రకాశిస్తోందని కూడా అన్నారు. దీంతో మోయిత్రా ఒకింతా ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాదు ఆమె సోషల్‌మీడియా వేదికగా లోక్ సభ డిప్యూటీ స్పీకర్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈ మేరకు మోయిత్రా మాట్లాడుతూ.." మేము సహనం, క్షమాపణను తీసుకువస్తాం. కానీ వాటి వెనుక కొద్దిమొత్తంలో కోపంతో కూడిన ఆవేశం కూడా ఉంటుంది. నేను కోపంతో కాక ప్రేమతో మాట్లాడాలి అంటూ ఉపన్యాసాలివ్వడానికి మీరెవరని ప్రశ్నించారు. మీరు నిబంధనల నిమిత్తమే నన్ను సరిదిద్దగలరు. మీరేమీ లోక్‌సభకు మోరల్ సైన్స్ టీచర్ కాదు అంటూ ట్విట్టర్లో ఘాటుగా విమర్శించారు. (చదవండి: నా నియోజకవర్గమే నా పెద్ద కుటుంబం: గనీవ్ కౌర్) -
క్షమాపణ చెప్పిన ఆజంఖాన్
న్యూఢిల్లీ: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ రమాదేవిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎంపీ ఆజంఖాన్ వెనక్కి తగ్గారు. సోమవారం ఆయన బీజేపీ ఎంపీ రమాదేవికి సభలో క్షమాపణలు చెప్పారు. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే అలవాటు తనకుందని ఈ సందర్భంగా ఒప్పుకున్నారు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా.. రమాదేవికి క్షమాపణ చెప్పాలని ఎంపీ ఖాన్‌ను కోరారు. అందుకే వెంటనే ఖాన్ లేచి..‘పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నా. సభా మర్యాదలు నాకు తెలుసు. నా మాటల వల్ల ఎవరైనా నొచ్చుకుంటే, క్షమాపణ కోరుతున్నా’ అని అన్నారు. అయతే, ఆయన మాటలు తమకు వినిపించక అర్థం కాలేదని, మళ్లీ చెప్పాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు. ఖాన్ పక్కనే ఉన్న ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ లేచి, ఆయన క్షమాపణ చెప్పారని, అందుకు తానే హామీ’ అని తెలిపారు. అయితే, మళ్లీ క్షమాపణ చెప్పాలని ఖాన్‌ను స్పీకర్ కోరారు. దీంతో ఆయన.. రమాదేవి తనకు సోదరి లాంటి వారు. స్పీకర్ మాట కాదని నేనేమీ మాట్లాడలేను. నా మాటలతో ఎవరికైనా బాధ కలిగితే క్షంతవ్యుణ్ని’ అని అన్నారు. అనంతరం ఎంపీ రమాదేవి మాట్లాడుతూ.. ‘ఆజంఖాన్ వ్యాఖ్యలతో యావద్దేశం బాధపడింది. అలాంటి మాటలను వినేందుకు నేను ఈ సభకు రాలేదు’ అని ఆవేదనతో పేర్కొన్నారు. ఆజంఖాన్ సభలోను, వెలుపల కూడా గతంలో పలు మార్లు మహిళలపై అవమానకరంగా మాట్లాడారని, ఆయన పద్ధతులను మార్చుకోవాలని అన్నారు. గురువారం సభలో ట్రిపుల్తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆజంఖాన్ ఉన్న రమాదేవిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. -
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా కనిమొళి..!
సాక్షి, చెన్నై: పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ పదవి డీఎంకేకు దక్కే అవకాశాలు ఉన్నట్టుగా చర్చ జోరందుకుంది. ఇందులో ఆ పార్టీ ఎంపీ కనిమొళి పేరు ప్రప్రథమంగా పరిశీలనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ప్రతి పక్షాల తరఫున ఆమెకు చాన్స్ దక్కడం ఖాయం అన్నట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీకి దేశ ప్రజలు ఊహించని రీతిలో మళ్లీ పట్టం కట్టారు. బీజేపీ కూటమి 352 స్థానాల్ని దక్కించుకోగా, అందులో బీజేపీ అభ్యర్థులే 303 మంది విజయఢంకా మోగించారు. ఇక, కాంగ్రెస్ తరఫున 52 మంది, ఆ కూటమిలోని డీఎంకే తరఫున 23 మంది పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవిని అప్పగించేందుకు తగ్గట్టుగా ప్రధాని నరేంద్రమోదీ సర్కారు నిర్ణయించినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. 2014లో కూడా డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతి పక్షానికి అప్పగించడంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన అన్నాడీఎంకేకు ఆ చాన్స్ దక్కింది. ఆ పార్టీ తరఫున తంబిదురై డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. అదే బాణిలో తాజాగా కూడా ప్రతిపక్షాలకు ఆ పదవిని అప్పగించేందుకు తగ్గట్టుగా కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. ఈ పదవిని కాంగ్రెస్‌కు అప్పగించే అవకాశాలు ఎక్కువేనని సమాచారం. అయితే, కాంగ్రెస్‌లో ఆ పదవిని చేపట్టేందుకు ఏ ఒక్క ఎంపీ సిద్ధంగా లేనట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో మిత్ర పక్షం డీఎంకేకు ఆ పదవిని అప్పగించేందుకు తగ్గట్టుగా కాంగ్రెస్ పరిశీలన జరిపి ఉన్నట్టు తెలిసింది. ఇందుకు తగ్గట్టుగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తోనూ కాంగ్రెస్ వర్గాలు చర్చించినట్టు ప్రచారం. కనిమొళికి చాన్స్ ..... దివంగత డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి కనిమొళి గతంలో రాజ్యసభ సభ్యురాలుగా వ్యవహరించారు. రెండుసార్లు ఆమె రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఢిల్లీ కొత్తేమీ కాదు. అక్కడి ఎంపీలతో ఆమెకు పరిచయాలు ఎక్కువే. తాజాగా ఆమె తూత్తుకుడి నుంచి ప్రప్రథమంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయకేతనం ఎగుర వేశారు. తొలిసారిగా పార్లమెంట్లో అడుగు పెట్టనున్న కనిమొళికి పార్టీ పార్లమెంటరీ వ్యవహారాల ఉప నేత పదవిని స్టాలిన్ కేటాయించారు. ఆ పార్టీ పార్లమెంటరీ నేత పదవిని సీనియర్ నేత టీఆర్‌బాలుకు, విప్ పదవి ఎ.రాజాలకు అప్పగించారు. అయితే, ప్రప్రథమంగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా లోక్‌సభలో అడుగు పెట్టనున్న కనిమొళిని అందలం ఎక్కించే విధంగా కాంగ్రెస్ పరిశీలన జరిపి ఉన్నట్టు తెలిసింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ అభ్యర్థిత్వం తమిళనాడు నుంచి దక్కే విధంగా డీఎంకేతో ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు సంప్రదింపుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రతి ఫలం అన్నట్టుగా కనిమొళికి డిప్యూటీ స్పీకర్ పదవి అప్పగించే విధంగా చర్చ సాగి ఉన్నట్టు ప్రచారం. మన్మోహన్ రాజ్యసభ అభ్యర్థిత్వానికి పరోక్షంగా స్టాలిన్ అంగీకరించి ఉన్నట్టు, అందుకే కనిమొళి పేరును కాంగ్రెస్ పరిశీలనలోకి తీసుకున్నట్టు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. స్పీకర్‌గా కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ పేరు పరిశీలనలో ఉన్న దృష్ట్యా, ప్రతి పక్షాల తరఫున మహిళగా కనిమొళికి చాన్స్ ఇచ్చే రీతిలో ప్రయత్నాలు సాగుతున్నట్టు డీఎంకేలోనూ చర్చ సాగుతుండడం గమనార్హం. కనిమొళి విషయంలో స్టాలిన్ సైతం సానుకూలత వ్యక్తం చేసినట్టు చర్చ సాగుతున్న దృష్ట్యా, కనిమొళి పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ అయ్యేనా అన్నది మరి కొద్దిరోజుల్లో తేలనుంది. ఇక, తమిళ మీడియాల్లో సైతం కనిమొళి డిప్యూటీ స్పీకర్ ఖాయం అన్నట్టుగా చర్చ జోరందుకోవడం గమనార్హం. -
బీజేపీ ముందు శివసేన డిమాండ్లు ఇవే..
ముంబై : కేంద్రంలో రెండవసారి అధికార పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందు మిత్రపక్షం శివసేన మూడు డిమాండ్లను ఉంచింది. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవితో పాటు మూడు కీలక డిమాండ్లను బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్ షాకు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే నివేదించారు. డిప్యూటీ స్పీకర్‌తో పాటు శివసేన నుంచి క్యాబినెట్లో మెరుగైన ప్రాతినిథ్యం, క్యాబినెట్ మంత్రి అరవింద్ గణ్‌పత్ సావంత్‌కు కీలక మంత్రిత్వ శాఖలను కేటాయించాలేని ఉద్ధవ్ బీజేపీ అగ్రనేతలను కోరినట్టు సమాచారం. తమ డిమాండ్లపై మోదీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నామని శివసేన పార్లమెంటరీ పార్టీ నేత సంజయ్ రౌత్ చెప్పారు. లోక్‌సభలో బీజేపీకి సొంతంగా మెజారిటీ దక్కడం సంతోషమే అయినా మిత్రపక్షాల బలాబలాలను కూడా గుర్తించడం కీలకమని రౌత్ అభిప్రాయపడ్డారు. లోక్‌సభలో 18 మంది, రాజ్యసభలో ముగ్గురు సభ్యులు కలిగిన తమ పార్టీకి కేవలం ఒక్క మంత్రి పదవినే కట్టబెట్టడం సరికాదని, క్యాబినెట్ విస్తరణలో తమకు సరైన ప్రాతినిథ్యం దక్కాలని రౌత్ పేర్కొన్నారు. -
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా రెండోసారి తంబిదురై
జాతీయం జమ్మూకాశ్మీర్‌లో పర్యటించిన మోడీ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆగస్టు 12న జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. లేహ్‌లో నిమూబజ్గో జల విద్యుత్ ప్రాజెక్ట్‌ను, లేహ్-కార్గిల్-శ్రీనగర్ విద్యుత్ సరఫరా వ్యవస్థను ప్రారంభించారు. లేహ్‌లో సైన్యం, వైమానిక దళాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. జమ్ము, కాశ్మీర్లో రహదారుల నిర్మాణానికి రూ. 8వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. 1999లో కార్గిల్‌లో పాక్ సైన్యం చొరబాటు తర్వాత ఆ ప్రాంతాన్ని భారత ప్రధాని సందర్శించడం ఇదే తొలిసారి. జ్యుడీషియల్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు ఉద్దేశించిన జాతీయ జ్యుడీషియల్ నియామకాల కమిషన్ బిల్లు-2014ను ఆగస్టు 13న లోక్‌సభ ఆమోదించింది. దీంతోపాటు కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే 99వ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లును రాజ్యసభ ఆగస్టు 14న ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థ రద్దవుతుంది. ఆరుగురు సభ్యులు గల జ్యుడీషియల్ నియామకాల జాతీయ కమిషన్ (ఎన్‌జేఏసీ) ఏర్పాటవుతుంది. దీనికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు, మరో ఇద్దరు ప్రముఖులతోపాటు న్యాయశాఖ మంత్రి సభ్యులుగా ఉంటారు. పదేళ్ల తర్వాత లోక్‌సభలో ప్రధాని ఓటు పదేళ్ల తర్వాత లోక్‌సభలో బిల్లుపై ప్రధానమంత్రి ఓటువేశారు. జడ్జీల నియామకానికి గతంలో నియమించిన కొలీజియం వ్యవస్థ రద్దుచేయడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు అనుకూలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు13న ఓటు వేయడంతో పదేళ్ల తర్వాత ప్రధానమంత్రి లోక్‌సభలో ఓటుహక్కు వినియోగించుకున్నట్టయింది. గత పదేళ్ల యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడు కావడంతో ఆయన తన పదవీకాలమంతా లోక్‌సభలో ఓటు వేయడం కుదరలేదు. షహీద్ గౌరవం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్లు, అధికారులకు షహీద్ గౌరవం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1000 మందికి 927 మందే దేశంలో ఆరేళ్ల లోపు వయసున్న బాలల్లో ప్రతి వెయ్యిమంది బాలురకు 927 మంది బాలికలు మాత్రమే ఉన్నారని, స్వాతంత్య్రం తర్వాత ఈ నిష్పత్తి అత్యధికంగా తగ్గడం ఇదే తొలిసారి అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. క్రీడలు చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు పతకం చెస్ ఒలింపియాడ్‌లో భారత్ తొలిపతకాన్ని సాధించింది. నార్వేలో జరిగిన టోర్నీ చివరి రౌండ్లో భారత పురుషుల జట్టు ఉజ్బెకిస్థాన్‌ను ఓడించి ద్వితీయ స్థానంలో నిలిచింది. అయితే టైబ్రేక్ కారణంగా మూడోస్థానంలో భారత్ కాంస్యం గెలుచుకుంది. కాంస్యం గెలుచుకున్న జట్టులో తెలుగుతేజం లలిత్‌బాబు ఉన్నాడు. 1924లో చెస్ ఒలింపియాడ్ మొదలైన తర్వాత భారత్ పతకం గెలుచుకోవడం ఇదే తొలిసారి. ప్రపంచ టీమ్ బిలియర్డ్స్‌లో భారత్‌కు స్వర్ణం మొదటి ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ స్వర్ణ, రజత పతకాలు సాధించింది. ఆగస్టు 15న గ్లాస్గోలో జరిగిన ఫైనల్లో భారత-బి జట్టు భారత-ఎ జట్టును ఓడించి స్వర్ణం సాధించింది. ఈ విజయంతో పంకజ్ అద్వానీ (10) అత్యధిక ప్రపంచ టైటిల్స్ సాధించిన భారత క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. ఇంతవరకు ఏ క్రీడలో ఏ ఆటగాడూ ఇన్ని ప్రపంచ టైటిల్స్‌ను గెలవలేదు. ఇంతవరకు ఏ క్రీడాకారుడూ ఇన్ని టైటిల్స్‌ను గెలుచుకోలేదు. 28 ఏళ్ల అద్వానీ 8 సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను, రెండు సార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించాడు. మదుగలె రికార్డు ఐసీసీ మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలె ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇటీవల భారత్-ఇంగ్లండ్‌ల మధ్య ముగి సిన ఐదో టెస్టు ఆయనకు 150వది కావడం విశేషం. తద్వారా టెస్టు క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి రిఫరీగా మదుగలె రికార్డు సృష్టించారు. 1993లో కరాచీలో పాకిస్థాన్, జింబాబ్వే మధ్య జరిగిన టెస్టుతో ఆయన అంతర్జాతీయ రిఫరీగా మారారు. చైనాలో ప్రారంభమైన యూత్ ఒలింపిక్స్ చైనాలోని నాన్జింగ్ ఒలింపిక్ స్టేడియంలో ఆగస్టు 16న యూత్ ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు జరిగే ఈ ఒలింపిక్స్‌లో 200లకు పైగా దేశాలకు చెందిన దాదాపు 3600 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. పటౌడీ ట్రోఫీ విజేత ఇంగ్లండ్ భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఆగస్టు 18న ముగిసిన ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. తద్వారా వరుసగా మూడో సారి (2011, 2012, 2014) పటౌడీ ట్రోఫీని గెలుచుకుంది. అండర్సన్ (ఇంగ్లండ్), భువనేశ్వర్ (భారత్)లకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. ఫోర్బ్స కోటీశ్వరుల జాబితాలో షరపోవా అగ్రస్థానం రష్యా టెన్నిస్ క్రీడాకారిణి మరియా షరపోవా ఫోర్బ్స్ మహిళ క్రీడాకారుల కోటీశ్వరుల జాబితాలో వరుసగా పదో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. 2013 జూన్- 2014 జూన్ మధ్య కాలంలో వాణిజ్య ఒప్పందాలు, ప్రైజ్ మనీ ద్వారా సుమారు రూ. 148 కోట్లకు పైగా సంపాదనతో మహిళా అథ్లెట్లలో మొదటిస్థానం సాధించింది. చైనా టెన్నిస్ క్రీడాకారిణి లినా రూ. 143 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయం పది లక్షల మందిపై ఎబోలా ప్రభావం ఎబోలా వైరస్ ప్రభావం పశ్చిమ ఆఫ్రికాలో పది లక్షల మందిపై పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) డెరైక్టర్ జనరల్ మార్గరెట్ చాన్ తెలిపారు. త్వరలోనే ఇది మానవ సంక్షోభంగా మారే అవకాశం ఉందని చాన్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న ప్రతి నగరానికి ఈ వ్యాధి నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు హెచ్చరించారు. పనామా కాలువ నిర్మాణానికి నూరేళ్లు ప్రపంచ జల రవాణా చరిత్రలో కీలక మైలురాయిగా భావించే పనామా కాలువ 2014, ఆగస్టు 15 నాటికి వంద సంవత్సరాలను పూర్తి చేసుకుంది. సరిగ్గా వందేళ్ల క్రితం అంటే 1914, ఆగస్టు 15న ఈ కాలువను అట్లాంటిక్- పసిఫిక్ మహా సముద్రాలను కలుపుతూ ఉత్తర, దక్షిణ అమెరికాల మధ్య ఉన్న పనామా దేశంలో నిర్మించారు. దీని ద్వారా అమెరికా పశ్చిమ తీరానికి, ఐరోపా తీరానికి మధ్య వేల మైళ్ల దూరం తగ్గింది. వార్తల్లో వ్యక్తులు యూపీఎస్సీ చైర్ పర్సన్‌గా రజినీ రజ్దాన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్ పర్సన్‌గా రజినీ రజ్దాన్ (64) ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె కమిషన్ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. డీపీ అగర్వాల్ స్థానంలో రజినీ బాధ్యతలు చేపట్టారు. యూపీఎస్సీ చైర్మన్ పదవీ కాలం ఆరేళ్లు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా తంబిదురై లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే ఎంపీ తంబిదురై ఆగస్టు 13న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తద్వారా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని రెండోసారి చేపట్టిన తొలి నేతగా రికార్డులకెక్కారు. మొదటి సారిగా 1995లో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 37 మంది సభ్యులతో ఏఐఏడీఎంకే లోక్‌సభలో మూడో అతిపెద్ద పార్టీగా ఉంది. వ్యయ నిర్వహణ కమిషన్ సారథి బిమల్‌జలాన్ వ్యయ నిర్వహణ కమిషన్ చైర్మన్‌గా భారతీయ రిజర్వ్‌బ్యాంక్ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నియమితులయ్యారు. ఆహారం, ఎరువులు, చమురుపై రాయితీల తగ్గిం పు, ద్రవ్యలోటు కట్టడికి అవసరమైన సూచనలు ఇచ్చేందు కు వ్యయ నిర్వహణ కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. అవార్డులు మంజుల్ భార్గవకు ఫీల్డ్స్ మెడల్ భారత సంతతికి చెందిన మంజుల్ భార్గవకు గణిత శాస్త్రంలో నోబెల్ గా భావించే ఫీల్డ్స్ మెడల్ లభించింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో అంతర్జాతీయ గణిత కాంగ్రెస్ - 2014లో ఆగస్టు 13న భార్గవ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మంజుల్ భార్గవ్ ప్రస్తుతం ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసున్నారు. ఇరాన్ గణితశాస్త్రవేత్త మరియం మీర్జాఖానీ ఫీల్డ్ మెడల్ అందుకున్న తొలి మహిళగా గుర్తింపుపొందింది. సల్మాన్ రష్దీకి డెన్మార్క్ సాహిత్య పురస్కారం భారత సంతతికి చెందిన బ్రిటన్ రచయిత సల్మాన్ రష్దీకి డెన్మార్క్ అత్యున్నత సాహిత్య పురస్కారం లభించింది. ద హాన్స్ క్రిస్టియన్ అండర్సన్ లిటరేచర్‌గా పిలిచే ఈ పురస్కారాన్ని 2013కు గాను రష్దీకి డెన్మార్క్ యువరాణి మేరీ ఆగస్టు 17న ఓడెన్స్ నగరంలో అందజేశారు. రెండేళ్లకోసారి ప్రదానం చేసే ఈ అవార్డు కింద 500,000 డేనిస్ క్రోన్లు బహుకరిస్తారు. ఉత్తమ పార్లమెంటేరియన్లు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆగస్టు 12న న్యూఢిల్లీలో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులను ప్రదానం చేశారు. వివరాలు..2010-అరుణ్ జైట్లీ (బీజేపీ); 2011-కరణ్‌సింగ్ (కాంగ్రెస్); 2012-శరద్ యాదవ్ (జేడీయూ); మేజర్ ముకుంద్ వరద రాజన్‌కు అశోకచక్ర జమ్మూకాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను ఎన్కౌంటర్లో హతమార్చి, అమరుడైన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్‌కు శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత శౌర్య పతకం అశోక చక్రను కేంద్రం ప్రకటించింది. అలాగే విధి నిర్వహణలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన మరో 12 మందిని దేశ మూడో అత్యున్నత శౌర్య పతకమైన శౌర్య చక్రతో గౌరవించింది. ఈ ఏడాది సాయుధ బలగాల సిబ్బందికి మొత్తం 55 శౌర్య పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ఒక అశోక చక్ర, 12 శౌర్య చక్ర, 39 సేనా పతకాలు, ఒక నవో సేనా పతకం, 2 వాయు సేనా పతకాలు ఉన్నాయి. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సంద ర్భంగా పతకాలను ప్రదానం చేశారు. జ్ఞాన్ కొరియన్‌కు గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు గుజరాతీ సినిమా ‘ద గుడ్ రోడ్’ దర్శకుడు జ్ఞాన్ కొరియన్ కు గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు-2013ను ఆగస్టు 12న చెన్నైలో ప్రదానం చేశారు. సునీల్‌కుమార్‌కు గ్లోబల్ సౌత్ అవార్డు ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన రాజనీతిశాస్త్ర ఆచార్యుడు సునీల్‌కుమార్ ప్రతిష్టాత్మక గ్లోబల్‌సౌత్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల తీరుతెన్నులపై సునీల్ కుమార్ సమర్పించిన పత్రానికి ఇంటర్నేషనల్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ ఈ అవార్డును ప్రకటించింది. సైన్స అండ్ టెక్నాలజీ విద్యుత్ ఉత్పత్తిలో రావత్‌భటా రికార్డు విద్యుత్ ఉత్పత్తిలో రాజస్థాన్‌లోని రావత్‌భటా అణువిద్యుత్ కేంద్రం కొత్త రికార్డు సృష్టించింది. ఈ కేంద్రంలోని యూనిట్-5 నిరంతరాయంగా ఆగస్టు 11 నాటికి 739 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసింది. దీంతో ప్రపంచంలో సుదీర్ఘకాలం నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేసిన రెండో కేంద్రంగా రావత్‌భటా నిలిచింది. కెనడాలోని ఓంటారియోలా పికెరింగ్ న్యూక్లియర్ జనరేటింగ్ స్టేషన్ 1994లో 894 రోజుల పాటు ఆగకుండా విద్యుత్ ఉత్పత్తి చేసింది. సాధారణంగా విద్యుత్ కేంద్రం 300 రోజులు అంతరాయం లేకుండా పనిచేస్తే దాన్ని ఉత్తమ పనితీరు కనబరిచినట్లు పరిగణిస్తారు. ఆకాశ్ క్షిపణి పరీక్ష విజయవంతం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణిని ఆగస్టు 13న ఒడిశాలోని చాందీపూర్ నుంచి వైమానిక దళం విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఈ క్షిపణి 25 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 60 కిలోల ఆయుధాలను మోసుకుపోగలదు. ఐఎన్ఎస్ కోల్‌కత జాతికి అంకితం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్ఎస్ కోల్‌కత భారత నావికాదళంలోకి ఆగస్టు 16న చేరింది. దీన్ని ప్రధాని నరేంద్రమోడీ ముంబై నావల్ డాక్‌యార్డ్‌లో జాతికి అంకితం చేశారు. ఐఎన్ఎస్ కోల్‌కత గెడైడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక. దీన్ని మజగావ్ డాక్‌యార్డ్ నిర్మించింది. దీని బరువు 6,800 టన్నులు. పొడవు 164 మీటర్లు. వెడల్పు 18 మీటర్లు. పూర్తి స్థాయిలో సామాగ్రిని మోసుకెళితే బరువు 7,400 టన్నులు. నౌకలో 4.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తవుతుంది. ఈ యుద్ధనౌకలో 30 మంది అధికారులు, 300 మంది సిబ్బంది ఉంటారు.