డిప్యూటీ దక్కేనా?

Kanimozhi May Get Lok Sabha Deputy Speaker Post - Sakshi

పరిశీలనలో ‘కని’ పేరు.. ప్రతిపక్షాల తరఫున చాన్స్‌

సాక్షి, చెన్నై: పార్లమెంట్‌ డిప్యూటీ స్పీకర్‌ పదవి డీఎంకేకు దక్కే అవకాశాలు ఉన్నట్టుగా చర్చ జోరందుకుంది. ఇందులో ఆ పార్టీ ఎంపీ కనిమొళి పేరు ప్రప్రథమంగా పరిశీలనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ప్రతి పక్షాల తరఫున ఆమెకు చాన్స్‌ దక్కడం ఖాయం అన్నట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.  2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీకి దేశ ప్రజలు ఊహించని రీతిలో మళ్లీ  పట్టం కట్టారు. బీజేపీ కూటమి 352 స్థానాల్ని దక్కించుకోగా, అందులో బీజేపీ అభ్యర్థులే 303 మంది విజయఢంకా మోగించారు. ఇక, కాంగ్రెస్‌ తరఫున 52 మంది, ఆ కూటమిలోని డీఎంకే తరఫున 23 మంది పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్‌ పదవిని అప్పగించేందుకు తగ్గట్టుగా ప్రధాని నరేంద్రమోదీ సర్కారు నిర్ణయించినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి.

2014లో కూడా డిప్యూటీ స్పీకర్‌ పదవి ప్రతి పక్షానికి అప్పగించడంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన అన్నాడీఎంకేకు ఆ చాన్స్‌ దక్కింది. ఆ పార్టీ తరఫున తంబిదురై డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. అదే బాణిలో తాజాగా కూడా ప్రతిపక్షాలకు ఆ పదవిని అప్పగించేందుకు తగ్గట్టుగా కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. ఈ పదవిని కాంగ్రెస్‌కు అప్పగించే అవకాశాలు ఎక్కువేనని సమాచారం. అయితే, కాంగ్రెస్‌లో ఆ పదవిని చేపట్టేందుకు ఏ ఒక్క ఎంపీ సిద్ధంగా లేనట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో మిత్ర పక్షం డీఎంకేకు ఆ పదవిని అప్పగించేందుకు తగ్గట్టుగా కాంగ్రెస్‌ పరిశీలన జరిపి ఉన్నట్టు తెలిసింది. ఇందుకు తగ్గట్టుగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తోనూ కాంగ్రెస్‌ వర్గాలు చర్చించినట్టు ప్రచారం. 

కనిమొళికి చాన్స్‌ .....
దివంగత డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి కనిమొళి గతంలో రాజ్యసభ సభ్యురాలుగా వ్యవహరించారు. రెండుసార్లు ఆమె రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఢిల్లీ కొత్తేమీ కాదు. అక్కడి ఎంపీలతో ఆమెకు పరిచయాలు ఎక్కువే. తాజాగా ఆమె తూత్తుకుడి నుంచి ప్రప్రథమంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయకేతనం ఎగుర వేశారు. తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగు పెట్టనున్న కనిమొళికి పార్టీ పార్లమెంటరీ వ్యవహారాల ఉప నేత పదవిని స్టాలిన్‌ కేటాయించారు. ఆ పార్టీ పార్లమెంటరీ నేత పదవిని సీనియర్‌ నేత టీఆర్‌బాలుకు, విప్‌ పదవి ఎ.రాజాలకు అప్పగించారు. అయితే, ప్రప్రథమంగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా లోక్‌సభలో అడుగు పెట్టనున్న కనిమొళిని అందలం ఎక్కించే విధంగా కాంగ్రెస్‌ పరిశీలన జరిపి ఉన్నట్టు తెలిసింది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభ అభ్యర్థిత్వం తమిళనాడు నుంచి దక్కే విధంగా డీఎంకేతో ఇప్పటికే కాంగ్రెస్‌ వర్గాలు సంప్రదింపుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు ప్రతి ఫలం అన్నట్టుగా కనిమొళికి డిప్యూటీ స్పీకర్‌ పదవి అప్పగించే విధంగా చర్చ సాగి ఉన్నట్టు ప్రచారం.

మన్మోహన్‌ రాజ్యసభ అభ్యర్థిత్వానికి పరోక్షంగా స్టాలిన్‌ అంగీకరించి ఉన్నట్టు, అందుకే కనిమొళి పేరును కాంగ్రెస్‌ పరిశీలనలోకి తీసుకున్నట్టు రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. స్పీకర్‌గా కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ పేరు పరిశీలనలో ఉన్న దృష్ట్యా, ప్రతి పక్షాల తరఫున మహిళగా కనిమొళికి చాన్స్‌ ఇచ్చే రీతిలో ప్రయత్నాలు సాగుతున్నట్టు డీఎంకేలోనూ చర్చ సాగుతుండడం గమనార్హం. కనిమొళి విషయంలో స్టాలిన్‌ సైతం సానుకూలత వ్యక్తం చేసినట్టు చర్చ సాగుతున్న దృష్ట్యా, కనిమొళి పార్లమెంట్‌ డిప్యూటీ స్పీకర్‌ అయ్యేనా అన్నది మరి కొద్దిరోజుల్లో తేలనుంది. ఇక, తమిళ మీడియాల్లో సైతం కనిమొళి డిప్యూటీ స్పీకర్‌ ఖాయం అన్నట్టుగా చర్చ జోరందుకోవడం గమనార్హం.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top