ముంబై: శివసేన (UBT) సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో తన అభిమానులకు, మద్దతుదారులకు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరోవైపు.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
అంతకుముందు, ఎంపీ సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా..‘అకస్మాత్తుగా తన ఆరోగ్యం క్షీణించిందని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో త్వరలోనే కోలుకుంటాననే గట్టి నమ్మకం తనకు ఉందని చెప్పారు. తన పట్ల చూపిస్తున్న ప్రేమ, నమ్మకానికి కృతజ్ఞతలు చెప్పారు. కొత్త సంవత్సరంలో అందరినీ తప్పక కలుసుకుంటాను’ అని చెప్పుకొచ్చారు. అయితే, కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని, పర్యటనలకు దూరంగా ఉండాలని వైద్యులు సంజయ్ రౌత్‌కు సూచించినట్టు సమాచారం.
మరోవైపు.. సంజయ్ రౌత్ పోస్టుపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా మోదీ.. ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. దీనిపై సంజయ్ రౌత్ స్పందిస్తూ.. గౌరవనీయులైన ప్రధానమంత్రి జీకి ధన్యవాదాలు!. నా కుటుంబం నుంచి మీకు కృతజ్ఞతలు! జై హింద్! జై మహారాష్ట్ర! అని బదులిచ్చారు.
ఇదిలా ఉండగా.. సంజయ్ రౌత్ ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు తెలిసింది. కాగా, ఆయన అస్వస్థతకు కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. అయితే గతంలో ఆయన గొంతు సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందారు.
धन्यवाद! https://t.co/jQOqgw2foc
— Sanjay Raut (@rautsanjay61) October 31, 2025


