
ముంబై: మహారాష్ట్ర శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ (BCCI), భారత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసియాకప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ (IND vs PAK) మధ్య మ్యాచ్ నేపథ్యంలో బీసీసీఐపై ప్రియాంక విరుచుకుపడ్డారు. భారత సైనికుల ప్రాణాలు, ప్రజల రక్తం కంటే.. బీసీసీఐకి డబ్బే ముఖ్యమా అని ప్రశ్నిస్తూ సంచలన విమర్శలు చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
ఆసియాకప్‌లో భారత్, పాక్ మ్యాచ్ విషయమై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రియాంక.. ‘బ్లాక్‌బస్టర్ ఫిక్సర్.. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా భారత్-పాక్ మ్యాచ్‌ను షెడ్యూల్ చేశారు. అలాగే, మళ్లీ సూపర్ ఫోర్, ఫైనల్స్‌లో కూడా దాయాదులు తలపడే అవకాశం ఉంది. ఇది న్యాయమేనా?. భారత సైనికుల రక్తం, త్యాగం.. భారతీయుల ఆత్మాభిమానం కంటే బీసీసీఐకి డబ్బే ముఖ్యమైనప్పుడు ఇలాంటివి ఉంటాయి. బీసీసీఐ సంపాదించాలనుకుంటున్నది రక్తపు సొమ్ము మాత్రమే కాదు.. వినాశకరమైన డబ్బు. ఆపరేషన్ సిందూర్ విషయంలో భారత ప్రభుత్వం సిగ్గుపడాలి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు ఆమెకు మద్దుతు ఇస్తూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
“Blockbuster Fixture: India vs Pakistan scheduled for 14 September, 2025 with potential rematches during Super Four and Final”
When money is more important than the blood of our fellow Indians and our men in uniform. Shame on GoI for being a hypocrite on Operation Sindoor. And… pic.twitter.com/AJG4xruesB— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) August 3, 2025
ఇదిలా ఉండగా.. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ విషయంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. పహల్గాం ఎఫెక్ట్ ఇరుదేశాల క్రీడా సంబంధాలపైనా పడింది. ఇటీవల వరల్డ్ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్ టోర్నీలోనూ పాక్ ఛాంపియన్స్‌తో ఆడేందుకు భారత్ నిరాకరించింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ రద్దైంది. ఆసియాకప్‌లో కూడా భారత్-పాక్ మ్యాచ్‌లను నిర్వహించాలనుకోవడంపైనా విమర్శలు వచ్చాయి. ఈ సమయంలోనే ఆసియాకప్ షెడ్యూల్ విడుదల కావడంతో పలువరు నెటిజన్లు బీసీసీఐ తీరుపై విమర్శలు చేస్తున్నారు. అయితే, పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ టార్గెట్‌గా సోషల్ మీడియా ఖాతాలు, క్రికెటర్ల యూట్యూబ్ చానెల్స్ సైతం బ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే.