
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly)పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదా నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని వాపోతున్నారు. అసలేం జరిగిందంటే.. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు ఇటీవలే షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే.
కుదిరితే మూడుసార్లు
ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ మెగా ఈవెంట్లో భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. ఇరుజట్లు సెప్టెంబరు 14న దుబాయ్‌లో ముఖాముఖి తలపడనున్నాయి. ఆసియా క్రికెట్ మండలి (ACC) ప్రసారకర్తలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సూపర్ ఫోర్ దశలో ఇరుజట్లు మరోసారి పరస్పరం ఢీకొట్టే అవకాశం ఉంది.
అంతా సవ్యంగా సాగి.. మెరుగైన ప్రదర్శన కనబరిస్తే సెప్టెంబరు 28 నాటి ఫైనల్లోనూ దాయాదులు పోటీపడతాయి. నిజానికి ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్‌వి. అయితే, అంతకుముందు పాక్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులు దక్కించుకోగా.. టీమిండియాను అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిరాకరించింది.
తటస్థ వేదికపైనే
భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌కు వెళ్లలేమని ఐసీసీకి తేల్చిచెప్పింది. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా ఈ టోర్నీ జరుగగా.. టీమిండియా చాంపియన్‌గా నిలిచింది.
అయితే, నాటి చర్చల ప్రకారం 2027 వరకు భారత్- పాక్ ఏ టోర్నీ ఆతిథ్య హక్కులు దక్కించుకున్నా తటస్థ వేదికపైనే ఆడాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇందుకు అంగీకరించాయి. కానీ.. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మరోసారి పరిస్థితులు శ్రుతిమించాయి.
పాక్‌కు బుద్ధి చెప్పిన భారత సైన్యం
ప్రశాంతమైన పహల్గామ్ లోయలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. ఇందుకు ప్రతిగా భారత సైన్యం పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అయితే, ఉగ్రవాదులపై జరిపిన దాడులకు పాక్ సైన్యం స్పందిస్తూ.. ప్రతిదాడికి దిగగా.. ఇండియన్ ఆర్మీ గట్టిగా బుద్ధిచెప్పింది.
ఈ నేపథ్యంలో ఇకపై పాకిస్తాన్‌తో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదని.. క్రీడల్లోనూ బంధం తెంచుకోవాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ విషయంపై గంగూలీ గతంలో స్పందిస్తూ.. ఈ డిమాండ్లకు మద్దతు తెలిపాడు. అయితే, తాజాగా మరోసారి ఆసియా కప్-2025 నేపథ్యంలో ఇందుకు సంబంధించి ప్రశ్న ఎదురుకాగా దాదా భిన్నంగా స్పందించాడు.
పాక్‌తో మ్యాచ్.. ఆటలు కొనసాగాలి
‘‘ఇరుజట్లు పరస్పరం పోటీపడటంలో నాకెలాంటి ఇబ్బందీ లేదు. ప్రణాళిక ప్రకారం క్రీడలు కొనసాగాలి. అదే సమయంలో పహల్గామ్ వంటి ఘటనలను అరికట్టాలి. అయితే, ఆటలు మాత్రం కొనసాగుతూనే ఉండాలి. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలి.
ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్ పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. కాబట్టి క్రీడలు కొనసాగించడంలో తప్పులేదు’’ అని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 సీజన్‌లో భాగంగా ఇండియా- పాకిస్తాన్‌తో తలపడాల్సి ఉండగా.. విమర్శల నేపథ్యంలో మ్యాచ్ రద్దైపోయింది.
ఇండియా చాంపియన్స్ జట్టులో భాగమైన శిఖర్ ధావన్, సురేశ్ రైనా తదితరులు పాక్‌తో ఆడేందుకు విముఖత వ్యక్తం చేయడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆసియా కప్ వంటి కీలక టోర్నీలో బీసీసీఐ.. దాయాదితో ముఖాముఖి పోరు నాటికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!
చదవండి: Asia Cup 2025: పూర్తి షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్‌లు ఎప్పుడంటే?
#WATCH | Kolkata: On India-Pakistan placed in the same group in the Asia Cup, former Indian cricketer Saurav Ganguly says, "I am okay. The sport must go on. At the same time Pahalgam should not happen, but the sport must go on. Terrorism must not happen; it needs to be stopped.… pic.twitter.com/Qrs17KOKrN
— ANI (@ANI) July 27, 2025