
స్వదేశంలో ఆస్ట్రేలియా చేతిలో వరుస పరాజయాలతో విసిగి వేసారిపోయిన వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది. నాలుగో టీ20లో స్లో ఓవర్ రేట్ మెయిన్‌టైన్ చేసినందుకు గానూ ఆ జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌లో 10 శాతం కోత విధించింది. ఆ మ్యాచ్‌లో విండీస్ బౌలర్లు నిర్దేశిత సమయంలోగా రెండు ఓవర్లు వెనుకపడ్డారు.
దీంతో ఓవర్‌కు 5 శాతం చొప్పున ఐసీసీ విండీస్ ఆటగాళ్లందరికీ జరిమానా విధించింది. ఈ జరిమానాను విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అంగీకరించడంతో తదుపరి విచారణ అవసరం లేదని మ్యాచ్ రిఫరీ అన్నాడు.
నాలుగో టీ20లో విండీస్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసినా ఘోర పరాజయం ఎదుర్కొంది. ఆ మ్యాచ్‌లో విండీస్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రూథర్‌ఫోర్డ్ 31, రోవ్‌మన్ పావెల్, రొమారియో షెపర్డ్ తలో 28, హోల్డర్ 21 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో జంపా 3, ఆరోన్ హార్డీ, బార్ట్‌లెట్, అబాట్ తలో 2 వికెట్లు తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. మ్యాక్స్‌వెల్ (47), ఇంగ్లిస్ (51), కెమరూన్ గ్రీన్ (55 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకపడటంతో 19.2 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. విండీస్ బౌలర్లలో బ్లేడ్స్ 3, హోల్డర్, షెపర్డ్, అకీల్ హొసేన్ తలో వికెట్ తీశారు.
కాగా, 5 మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో విండీస్‌కు ఏది కలిసి రావడం లేదు. ఇప్పటివరకు ఆడిన నాలుగు టీ20ల్లో ఓటమిపాలైంది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే 0-4తో సిరీస్‌ను కోల్పోయింది. అంతకుముందు టెస్ట్ సిరీస్‌లోనూ విండీస్‌ది ఇదే పరిస్థితి. మూడు మ్యాచ్‌ల ఆ సిరీస్‌ను కూడా విండీస్ 0-3 తేడాతో కోల్పోయింది. స్వదేశంలో జరుగుతున్న ఈ సిరీస్‌లలో విండీస్ ఇప్పటివరకు ఒక్క గెలుపుకు కూడా నోచుకోలేదు.