
త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్‌కు ముందు హాంగ్‌కాంగ్ క్రికెట్ కీలక నియామకం చేపట్టింది. వారి జట్టుకు శ్రీలంక మాజీ ఓపెనర్ కౌశల్ సిల్వను హెడ్ కోచ్‌గా నియమించింది. డాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ అయిన కౌశల్ 2011-18 మధ్యలో శ్రీలంక తరఫున 39 టెస్ట్‌లు ఆడి 3 సెంచరీలు, 12 అర్ద సెంచరీల సాయంతో 2099 పరుగులు చేశాడు. అలాగే వికెట్ కీపింగ్‌లో 34 క్యాచ్‌లు, ఓ స్టంపింగ్ చేశాడు.
39 ఏళ్ల కౌశల్ గతంలో శ్రీలంక, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల్లో కోచింగ్ బాధ్యతలు నిర్వహించాడు. అంతర్జాతీయంగా అతనికి ఇదే తొలి కమిట్‌మెంట్. ఆసియా కప్‌కు ముందు కౌశల్ ముందు పలు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. హాంగ్‌కాంగ్ బౌలింగ్ దళం నిర్మించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. అలాగే యువ ప్రతిభను గుర్తించి ఆసియా కప్ కోసం జట్టును సిద్ధం చేయాల్సి ఉంది.
హాంగ్‌కాంగ్ ఈ ఎడిషన్ ఆసియా కప్‌కు అర్హత సాధించిన ఎనిమిది జట్లలో ఒకటి. ఆ జట్టు క్వాలిఫయర్ పోటీల ద్వారా ఖండాంతర టోర్నీకి అర్హత సాధించింది. సెప్టెంబర్ 19 నుంచి టీ20 ఫార్మాట్‌లో జరుగబోయే ఈ టోర్నీలో హాంగ్‌కాంగ్ సహా ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఒమన్ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీకి సంబంధించి వేదికలు ఇంకా ఖరారు కాలేదు. హాంగ్‌కాంగ్ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగనుంది.