
ఐపీఎల్-2025 (IPL 2025)ని వాయిదా వేస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న నిర్ణయాన్ని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) స్వాగతించాడు. దేశ సరిహద్దుల వెంబడి నెలకొన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా బోర్డు సరిగ్గా స్పందించిందని పేర్కొన్నాడు. అయితే, త్వరలోనే ఈ మెగా టోర్నీ మళ్లీ మొదలవుతుందని ధీమా వ్యక్తం చేశాడు.
దాయాది దుశ్చర్యలు
పాకిస్తాన్‌కు ఎక్కువ కాలం పోరాడే శక్తి లేదని.. కాబట్టి త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని గంగూలీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా పహల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని దాదాపు తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో భారత్ చేపట్టిన ఈ చర్యను దాయాది జీర్ణించుకోలేకపోతోంది. అందుకే అనుచితంగా దాడులకు తెగబడుతోంది.
ఈ క్రమంలో దాయాది పాక్ దుశ్చర్యలకు భారత్ గట్టి సమాధానిమిస్తోంది. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారి.. రణరంగాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా సరిహద్దుల వెంబడి పాక్ ఎక్కువగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూ.. సామాన్యులు, సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తోంది. భారత్ ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది.
ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ధర్మశాల స్టేడియంలో గురువారం పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అర్ధంతరంగా ఆగిపోయింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వారం రోజుల పాటు లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది.
పాకిస్తాన్‌కు అంత సీన్ లేదు
ఈ పరిణామాలపై స్పందించిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ బీసీసీఐ భారత, విదేశీ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే, త్వరలోనే లీగ్ మళ్లీ మొదలు కావాలని ఆకాంక్షిద్దాం. ప్రస్తుతం టోర్నీ ప్లే ఆఫ్స్ దశలో ఉంది. ఇలాంటి తరుణంలో ధర్మశాల, చండీగఢ్, ఢిల్లీ, రాజస్తాన్, జైపూర్ వంటి ప్రాంతాలు మినహా.. మిగతా చోట్ల ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది.
కాలక్రమేణా పరిస్థితులు చక్కబడతాయనే విశ్వాసం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇలాంటి పరిస్థితులను, ఒత్తిడిని ఎక్కువ కాలం భరించలేదు. ఆ దేశానికి అంతటి సామర్థ్యం లేదు. కాబట్టి బీసీసీఐ కచ్చితంగా ఐపీఎల్-2025ని పూర్తి చేస్తుంది’’ అని గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు.
సురక్షితంగా ఢిల్లీకి
ఇదిలా ఉంటే.. ధర్మశాలలో మ్యాచ్ రద్దు కాగానే.. బీసీసీఐ పంజాబ్- ఢిల్లీ ఆటగాళ్లను సురక్షితంగా ఢిల్లీకి చేర్చింది. అత్యంత భద్రత నడుమ వందే భారత్ రైలులో ఆటగాళ్లను తరలించింది.
కాగా మార్చి 22న మొదలైన ఐపీఎల్-2025లో ఇప్పటికి 57 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసులో ముందున్నాయి. మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేట్ అయిపోయాయి. మిగతా మ్యాచ్‌లలో ఢిల్లీ, కోల్‌కతా, లక్నో జట్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి.
చదవండి: విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం!.. బీసీసీఐకి చెప్పేశాడు!