భారీగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను వాంతి చేసుకున్న పాము

King Cobra Throws Up Huge Amount Of Plastic In Mumbai Malad - Sakshi

ముంబై : ఇప్పటి వరకు మనం మన్ను తిన్న పాము అని వినుంటాం.. కాలం మారింది ఇప్పుడు ప్లాస్టిక్‌ తిన్న పాము అని వినాల్సి వస్తోంది. ప్లాస్టిక్‌ తిన్న ఓ పామును చావు నుంచి కాపాడాడు ఓ జంతు సంరక్షణా సిబ్బంది. ఈ సంఘటన మంగళవారం ముంబై నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని మలద్‌  పటన్‌వాడీ ఏరియాకు చెందిన భగేష్‌ భగవత్‌ పాముల సంరక్షణపై అవగాహన కల్పిస్తుంటాడు. మంగళవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో చావల్‌లోని ఓ ఇంటి పైకప్పులో మూడు అడుగుల నాగుపాము ఉన్నట్లు అతనికి ఫోన్‌ వచ్చింది. భగేష్‌ భగవత్‌ వెంటనే అక్కడికి చేరుకున్నాడు. ఆ ఇంటి పైకప్పు చెక్కతో తయారుచేసింది కావటం మూలాన పాము చెక్కల మధ్య ఉన్న ఖాళీలలో తిరగటం మొదలుపెట్టింది. ఓ గంట శ్రమించిన తర్వాత నాగుపాము ఉన్న చోటును భగవత్‌ కనిపెట్టాడు.

దాని తోక భాగాన్ని పట్టుకొని  బయటకు లాక్కెళ్లాడు. ఆ సమయంలో పాము నోట్లో ఏదో ఉన్నట్లు అతడు గుర్తించాడు. పాము ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశ్యంతో దాని తోకను అలాగే పట్టుకొని  కిందకు వదిలిపెట్టాడు. అంతే పాము కిందకు దిగిన వెంటనే వాంతి చేసుకోవటం ప్రారంభించింది. పాము నోట్లో నుంచి పెద్ద మొత్తంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు బయటపడ్డాయి. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడి వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్లాస్టిక్‌ భూతం ఆఖరికి పాములను కూడా వదిలిపెట్టడం లేదని వారు వాపోయారు. భగేష్‌ భగవత్‌ మాట్లాడుతూ.. ‘‘పాము ప్లాస్టిక్‌ వ్యర్థాలను వాంతి చేసుకోవటంతో షాక్‌కు గురయ్యాను. పాముల సంరక్షణపై అవగాహన కల్పించటానికి ఆ దృశ్యాలను వీడియో తీసి ఉంచాము. అయితే అంత పెద్ద మొత్తంలో ప్లాస్టిక్‌ ఎలా తిందో తెలియటం లేదు. అది కొద్దిసేపు అలాగే ఉంటే ఖచ్చితంగా చనిపోయేద’’ని అన్నాడు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top