తదుపరి సీజేఐగా జస్టిస్‌ గొగోయ్‌!

Justice Ranjan Gogoi to be next Chief Justice - Sakshi

ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ మిశ్రా ప్రతిపాదన

త్వరలో న్యాయశాఖకు సిఫార్సు

న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా పదవీకాలం అక్టోబర్‌ 2న ముగియనున్న నేపథ్యంలో సంప్రదాయాన్ని అనుసరించి సుప్రీంలో తన తర్వాత అత్యంత సీనియర్‌ అయిన జస్టిస్‌ గొగోయ్‌ పేరును మిశ్రా ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జస్టిస్‌ దీపక్‌ మిశ్రా చేసిన సిఫార్సును త్వరలోనే కేంద్ర న్యాయశాఖకు పంపనున్నట్లు వెల్లడించాయి.

అన్ని సవ్యంగా సాగితే అక్టోబర్‌ 3న జస్టిస్‌ గొగోయ్‌ సీజేఐగా ప్రమాణం చేస్తారని పేర్కొన్నాయి. సాధారణంగా పదవీకాలం ముగిసేందుకు నెల రోజుల ముందుగా తదుపరి సీజేఐ పేరును సిఫార్సు చేయాలని కేంద్ర న్యాయ శాఖ సీజేఐని కోరుతుంది. దీంతో తన తర్వాత అత్యంత సీనియర్‌ను తర్వాతి సీజేఐగా ప్రస్తుత సీజేఐ ప్రతిపాదిస్తారు. ఇదే తరహాలో వారం రోజుల క్రితం కేంద్రం తదుపరి సీజేఐ నియామకంపై జస్టిస్‌ మిశ్రాకు లేఖ రాసింది. దీంతో సంప్రదాయాన్ని అనుసరించి జస్టిస్‌ గొగోయ్‌ పేరును జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ప్రతిపాదించారు.

సుప్రీంకోర్టు నిర్వహణతో పాటు కేసుల కేటాయింపులో సీజేఐ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రిటైర్డ్‌ జస్టిస్‌ జె.చలమేశ్వర్, జస్టిస్‌ ఎంబీ లోకూర్, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌లతో కలసి జస్టిస్‌ గొగోయ్‌ ఈ ఏడాది జనవరిలో మీడియా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్‌ గొగోయ్‌ పేరును సీజేఐ మిశ్రా ప్రతిపాదించకపోవచ్చని వార్తలొచ్చాయి. సీజేఐ ప్రతిపాదనలను న్యాయశాఖ ప్రధాని ముందు ఉంచుతుంది. అనంతరం కొత్త సీజేఐ నియామకంపై ప్రధాని రాష్ట్రపతికి సలహా ఇస్తారు.

అసోం నుంచి సుప్రీంకోర్టు వరకూ..
జస్టిస్‌ గొగోయ్‌ 1954, నవంబర్‌ 18న అసోంలో జన్మించారు. 1978లో బార్‌ అసోసియేషన్‌లో పేరు నమోదు చేయించుకున్నారు. ఆ తర్వాత గొగోయ్‌ గువాహటి హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 2001, ఫిబ్రవరి 28న గొగోయ్‌ గువాహటి హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010, సెప్టెంబర్‌లో పంజాబ్‌–హరియాణా హైకోర్టుకు బదిలీఅయిన గొగోయ్, మరుసటి ఏడాది ఫిబ్రవరిలో అదే హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012, ఏప్రిల్‌ 23న జస్టిస్‌ గొగోయ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

అసోంలో ఇటీవల ప్రకటించిన జాతీయ పౌర రిజిస్టర్‌(ఎన్నార్సీ)ను గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనమే పర్యవేక్షించింది. మద్రాస్‌ హైకోర్టు వివాదాస్పద మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కర్ణన్‌పై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసును జస్టిస్‌ చలమేశ్వర్‌తో కలసి విచారించారు. అయితే 2016లో సౌమ్య అనే యువతి రేప్, హత్య కేసులో దోషికి ట్రయల్‌ కోర్టు విధించిన మరణశిక్షను జస్టిస్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం యావజ్జీవంగా మారుస్తూ ఇచ్చిన తీర్పుపై అన్నివర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top