హైదరాబాద్‌లో ఐసిస్ అలికిడి!

హైదరాబాద్‌లో ఐసిస్ అలికిడి!


- దేశవ్యాప్త విధ్వంసానికి కుట్ర


- నగరంలో నలుగురిని.. బెంగళూరు, ముంబై, లక్నోల్లో 11 మందిని పట్టుకున్న ఎన్‌ఐఏ


- ఏయూటీ, ‘జనూద్’లకు చెందిన భారీ మాడ్యూల్‌తో రంగంలోకి ఐసిస్


- కీలకంగా వ్యవహరించిన ఆరుగురు హైదరాబాదీలు


- సామాజిక మాధ్యమాల ద్వారా సంప్రదింపులు


- హరిద్వార్‌లో రెక్కీ చేస్తూ దొరికిపోయినవారి విచారణతో కదిలిన డొంక


 


ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ హైదరాబాద్‌లోనూ అడుగుపెట్టింది. రిపబ్లిక్ డే సందర్భంగా నగరంతోపాటు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నింది. ఐసిస్‌కు విధేయత ప్రకటించిన ‘అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్(ఏయూటీ)’కు అనుబంధంగా ఏర్పడిన ‘జనూద్ ఉల్ ఖలీఫా ఏ హింద్’ ఉగ్రవాద సంస్థకు చెందిన భారీ మాడ్యూల్‌తో రంగంలోకి దిగింది.


 


దీనిపై కొంతకాలంగా నిఘాపెట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) 25 మందిని గుర్తించి... గురువారం అర్ధరాత్రి అనంతరం దాడులు చేసింది. హైదరాబాద్‌లో నలుగురు సహా కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల్లో 15 మందిని అదుపులోకి తీసుకుంది. పరారైన మిగతా 10 మందికోసం విస్తృతంగా గాలింపు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు.
 

సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా భారీ ఎత్తున దాడులకు కుట్ర పన్నింది. ఐసిస్‌కు విధేయత ప్రకటించిన ‘అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ)’కు అనుబంధంగా ఏర్పడిన ‘జనూద్ ఉల్ ఖలీఫా ఏ హింద్’ ఉగ్రవాద సంస్థలకు చెందిన భారీ మాడ్యూళ్లతో రంగంలోకి దిగింది. రిపబ్లిక్ డే, హరిద్వార్ అర్ధకుంభమేళాలలో దాడులకు సిద్ధమైంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈ కుట్రను గుర్తించి, భగ్నం చేసింది. గురు, శుక్రవారాల్లో నాలుగు రాష్ట్రాల్లో దాడులు చేసి 25 మంది ఉగ్రవాదులను గుర్తించింది.హైదరాబాద్‌కు చెందిన నలుగురు సహా కర్ణాటక, మహారాష్ట్ర, యూపీలలో 15 మందిని అరెస్టుచేసింది. వారి నుంచి భారీగా పేలుడు పదార్థాలు, డిజిటల్ టైమర్లు, తుపాకులు, మ్యాపులను స్వాధీనం చేసుకుంది. వీరంతా ఏయూటీకి చెందిన ఆర్మార్‌తో పాటు ‘జనూద్’తో సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించారు. ఇరాక్, సిరియాల్లో ఉన్న ఏయూటీ కేడర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆధారాలు సేకరించారు. పట్టుబడిన వారిచ్చిన సమాచారం, సామాజిక మాధ్యమాలపై నిఘా ద్వారా వీరందరిపైనా కొంతకాలంగా ఎన్‌ఐఏ ఓ కన్నేసి ఉంచినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఇబ్రహీం నౌఫాల్ నేతృత్వంలో..

 దేశవ్యాప్తంగా ఉన్న ఈ మాడ్యుల్ కర్ణాటకలోని హసన్ ప్రాంతానికి చెందిన ఇబ్రహీం నౌఫాల్ నేతృత్వంలో ఏర్పాటైంది. ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్న నౌఫాల్... ఐసిస్‌లో చేరేందుకు సిరియా వెళ్తూ టర్కీ వద్ద  గతేడాది జనవరి 30న దొరికాడు. ఇతడితో పాటు పట్టుబడిన తొమ్మిది మందిలో ఖమ్మం జిల్లాకు చెందిన జావేద్ బాబా ఉన్నాడు. ఈ తొమ్మిది మందిని అక్కడి ఏజెన్సీలు గతేడాది ఫిబ్రవరి 1న బెంగళూరుకు తిప్పి పంపాయి. అలానాటి ప్రయత్నం విఫలం కావడంతో బెంగళూరు కేంద్రంగా వివిధ రాష్ట్రాల్లో ఆన్‌లైన్ ద్వారానే ఉగ్రవాద మాడ్యుల్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ముంబైకి చెందిన మునబీర్ ముస్తాఖ్ ై కీలకంగా వ్యవహరించాడు. వీరిద్దరూ సిరియాలో ఉన్న షఫీ ఆర్మర్‌తో పాటు ఇరాక్ కేంద్రంగా పనిచేస్తున్న యూసుఫ్‌తో సంప్రదింపులు కొనసాగించారు. వారి ఆదేశాల మేరకు విధ్వంసాలకు కుట్ర పన్నారు. రెక్కీ చేస్తూ దొరికిపోవడంతో..

 ఈ ఉగ్రవాద మాడ్యుల్ అర్ధకుంభమేళా జరిగే ప్రాంతంలో రెక్కీ చేసి, బాంబులు అమర్చడం, దాడులు చేయడానికి అనువైన ప్రాంతాలను గుర్తించే బాధ్యతలను.. రూర్కీకి చెందిన అఖ్లాల్ రెహ్మాన్, మహ్మద్ ఒసామా, మహ్మద్ అజీంషా, మెహ్రోజ్‌లకు అప్పగించింది. మంగళవారం హరిద్వార్‌కు వెళ్లిన ఈ నలుగురిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారించగా ఐదు రాష్ట్రాలకు చెందిన వారి వివరాలు బయటకొచ్చాయి. వ్యవస్థీకృతంగా మాడ్యూల్

 ఈ మాడ్యుల్ పక్కా వ్యవస్థీకృతంగా వ్యవహారాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఉగ్రవాదులంతా వాయిస్ ఓవర్ ఇంటర్‌నెట్ ప్రొటోకాల్, వాట్సప్, ఫేస్‌బుక్, హైక్ వంటి ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా సంప్రదింపులు జరిపారు. మాడ్యుల్ ఆరు విభాగాలుగా పనిచేస్తోంది. తమ భావజాలం ప్రచారం, కొత్త వారి ఎంపిక, ఆయుధాల వినియోగం, పేలుడు పదార్థాల తయారీలో శిక్షణ, ఆపరేషన్స్ నిర్వహించే ఉగ్రవాదులకు అవసరమైన రవాణాసాయం, రెక్కీ నిర్వహించడం... ఇలా బృందాల వారీగా విధులు నిర్వర్తిస్తుంది. ఈ ఉగ్రవాదులు తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, మహారాష్ట్రల్లో విస్తరించి ఉన్నట్లు ఎన్‌ఐఏ ఆధారాలు సేకరించింది. వీరికి విదేశాల నుంచి హవాలా రూపంలో ఆర్థిక సాయం అందినట్లు గుర్తించింది.

 

 ‘లోన్ వూల్ఫ్’ దాడులకూ ప్రణాళిక

 ఉగ్రవాదులు ‘లోన్ వూల్ఫ్’ దాడులకూ కుట్రపన్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఉగ్రవాదులు ముఠా(మాడ్యుల్)గా ఏర్పడి వేరే దేశం/ప్రాంతంలోని నిర్వాహకులు (హ్యాండ్లర్స్) ఇచ్చే సూచనలతో లక్ష్యం కోసం పనిచేస్తుంటారు. తరచూ సంప్రదించుకుంటారు. కానీ ‘లోన్ వూల్ఫ్’ వ్యవహారం ఇందుకు భిన్నం. సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద ప్రేరణ పొందుతున్నవారు ప్రత్యేకమైన లక్ష్యంతో పని లేకుండా సంచలనం సృష్టించడమే ప్రధానంగా రెచ్చిపోతుంటారు. వీరు ఒకరిద్దరే ఉంటారు.

 

 హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు


 ఈ మాడ్యుల్‌లో హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు కీలక పాత్ర పోషిస్తున్నారు. టోలిచౌకిలోని ఒబేదుల్లా ఖాన్ (కంప్యూటర్ స్పేర్‌పార్ట్స్ దుకాణం), షరీఫ్ మొయినుద్దీన్ ఖాన్ (ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్), మాదాపూర్‌కు చెందిన అబు అనార్ (సాఫ్ట్‌వేర్ ఉద్యోగి)తో పాటు నఫీజ్‌ఖాన్‌లను అరెస్టుచేశారు. పేలుడు పదార్థాలు, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన నలుగురిలో నఫీజ్‌ఖాన్ స్వస్థలం హైదరాబాద్ కాకపోవడంతో రిపబ్లిక్ డే రోజున దాడి చేసేందుకు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. పరేడ్ జరిగే ప్రాంతం మ్యాప్ వీరి వద్ద లభించింది. షరీఫ్ మొయినుద్దీన్‌ఖాన్ టోలిచౌకిలోని నిజాం కాలనీలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో రెండేళ్లుగా నివసిస్తున్నాడు. ఇతడికి భార్య, ఆరుగురు సంతానం ఉన్నారు.  ఇదే ప్రాంతంలోని ఎండీ లైన్స్ ప్రధాన రహదారిపై ఒబేద్ రెండేళ్లుగా కంప్యూటర్ పాయింట్ నిర్వహిస్తున్నాడు.

 

 దేశవ్యాప్తంగా హైఅలర్ట్

 గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారీ దాడులకు ఉగ్రవాదులు కుట్ర, ఎన్‌ఐఏ దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై సహా చాలా ప్రాంతాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. రాష్ట్ర పోలీసులు హైదరాబాద్‌ను జల్లెడ పడుతున్నారు. సామాజిక మాధ్యమాలపైనా నిఘా పెట్టారు. ఢిల్లీలోనూ  హైఅలర్ట్ జారీ చేశారు. పఠాన్‌కోట్‌లో రెండు రోజుల కింద ఓ కారును హైజాక్ చేసిన ముగ్గురు వ్యక్తులు.. దాని డ్రైవర్‌ను హతమార్చారు. దీనికితోడు ఐటీబీపీ ఇన్స్‌పెక్టర్ కారు చోరీ అయింది. ఉగ్రవాదులే వీటికి కారణం కావచ్చని భావిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top