'మహా'మ్మారి మెడలు వంచేదెలా ?

Inter-ministerial central teams to assess COVID-19 situation in Maharashtra - Sakshi

మహారాష్ట్రలో 6 వేలకు చేరువలో కేసులు

సైన్యాన్ని దింపుతారని ఊహాగానాలు

ముంబై: మహారాష్ట్రలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఏప్రిల్‌ 30– మే 15 మధ్య మహారాష్ట్రలో కరోనా వికృతరూపాన్ని చూడడానికి సంసిద్ధంగా ఉండాలని ముంబై, పుణెలలో పర్యటించిన కేంద్ర బృందం ఉద్ధవ్‌ఠాక్రే ప్రభుత్వాన్ని హెచ్చరించింది. నాలుగు రోజుల్లోనే 2 వేలు తాజా కేసులు నమోదయ్యాయి. కొన్నాళ్లుగా ప్రతిరోజూ సుమారుగా 400 కొత్త కేసులు నమోదు కావడం, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6 వేలకు చేరువలో ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీమ్‌ (ఐఎంసీటీ) ముంబైలో ఏప్రిల్‌ 30నాటికి 42,604 కేసులు, మే 15నాటికి 6.56 లక్షలకి కేసులు పెరిగిపోతాయని అంచనా వేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిఠాక్రేకు పరిపాలనా అనుభవం లేకపోవడం, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌లో సమన్వయ లోపాలతో కేసులు అత్యధికంగా పెరిగిపోతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ముంబైలో 4 వేలకు చేరువగా కేసులు పెరుగుతున్నాయి. ఈ సంక్షోభ సమయంలో హోంశాఖ, ఆరోగ్య శాఖ మంత్రులు అనిల్‌ దేశ్‌ముఖ్, రాజేష్‌ తోపే ఎన్సీపీకి చెందినవారు కావడం, సీఎంకు వారికి మధ్య సమన్వయ లోపాలు బయటపడుతున్నాయి.∙పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకున్నామని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్‌అంటున్నారు.  

ఆస్పత్రుల్లో సన్నద్ధత కరువు  
ముంబైలో దేశంలో మరెక్కడా లేనటువంటి వైద్య సౌకర్యాలు ఉన్నాయి. కానీ అవేవీ కరోనాను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా లేవు. నిపుణులైన వైద్యులు ఉన్నప్పటికీ నిరుపేదలకు వైద్యం సరిగా అందడం లేదు. దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 25 శాతం మహారాష్ట్రలో∙ఉన్నాయి. మృతుల రేటు ఇక్కడ ఎక్కువే. 6–7 శాతం మంది కోవిడ్‌తో మరణిస్తున్నారు. ప్రపంచ సగటు రేటు 3–4 శాతం కంటే ఇది రెట్టింపు కావడం కలవరపెట్టే అంశం.

4 ‘టీ‘లలో విఫలం
ట్రాక్, ట్రేస్, టెస్ట్, ట్రీట్‌.. కోవిడ్‌పై పోరాటానికి ఈ నాలుగు ‘టీ’లను అమలు చేయాలి. ఉద్ధవ్‌ ఠాక్రే సర్కార్‌ పనితీరు వీటన్నింటిలోనూ అసంతృప్తిని రాజేస్తోంది. రాజస్తాన్, కేరళ, ఢిల్లీ కంటే ఇక్కడ టెస్టులు తక్కువగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా జరిగే నిర్ధారణ పరీక్షల్లో కనీసం 17 శాతం కూడా మహారాష్ట్రలో జరగడం లేదు. మహారాష్ట్ర నుంచి మర్కజ్‌ సమావేశాలకు 58 మంది వెళితే ఇప్పటివరకు 40 మందినే గుర్తించారు. మరో 18 మందిని పట్టుకోవడంలో పోలీసు యంత్రాంగం విఫలమైంది. వారిలో ఎంతమందికి పాజిటివ్‌ ఉందో, వారి ద్వారా ఇంకెంతగా విస్తరిస్తుందోనన్న ఆందోళన నెలకొంది.

లాక్‌డౌన్‌ అంతంత మాత్రం !
కరోనా వ్యాప్తిని ఆపాలంటే లాక్‌డౌన్‌కు మించింది లేదు.  కేంద్రం లాక్‌డౌన్‌ని మే 3 వరకు పొడిగించినప్పటికీ మహారాష్ట్రలో యథేచ్ఛగా ఉల్లంఘన జరుగుతోంది. బాంద్రా స్టేషన్‌ దగ్గరకి 3 వేల మంది వలస కార్మికులు రావడం, ఎన్సీపీ నాయకుల ఇళ్ల దగ్గర అనుచరుల హంగామా వంటి చర్యలన్నీ లాక్‌డౌన్‌కు విఘాతం కలిగించాయి. ఇక ఏప్రిల్‌ 20 తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌కి మినహాయింపులు ఇవ్వడంతో ముంబై, పుణే వంటి నగరాల్లో రోడ్లపై జనాల తాకిడి పెరిగింది.

వలస కార్మికుల్ని వారి స్వస్థలాలకు వెళ్లడానికి మహారాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అమితాబ్‌ గుప్తా అనుమతినివ్వడం కూడా వివాదాస్పదమైంది. ఇక థానేకు చెందిన ఒక ఇంజనీర్‌ను ఎన్సీపీ మంత్రి జితేంద్ర అవ్హాద్‌ సమక్షంలోనే పోలీసులు తీవ్రంగా హింసించిన ఘటన కూడా కలకలం రేపింది. ఫేస్‌బుక్‌లో అనుచిత పోస్టు పెట్టారని ఆ ఇంజనీర్‌ని ఎన్సీపీ కార్యకర్తలు బలవంతంగా మంత్రి దగ్గరకు తీసుకువచ్చారు. అక్కడే పోలీసులు అతనిని చితకబాదారు. ఆ పోలీసుల్లో ఒకరికి కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో మరో 14 మంది కూడా కోవిడ్‌ బారిన పడడం ఆందోళన రేపింది.

ఎన్సీపీ మంత్రి జితేంద్ర అవ్హాద్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత మంత్రికి నెగిటివ్‌ అని చెప్పడంతో మహారాష్ట్ర సర్కార్‌ నిజాలు దాచిపెడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కోవిడ్‌ను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్న విమర్శలు ఎక్కువైపోతూ ఉండడంతో శివసేన సంకీర్ణ సర్కార్‌ ముంబై, పుణెలో లాక్‌డౌన్‌ ఆంక్షల్ని మళ్లీ పూర్తి స్థాయిలో విధించింది. వలస కార్మికుల్ని రాష్ట్రం నుంచి వారి సొంత రాష్ట్రాలకు పంపించడానికి ప్రత్యేకంగా రైలు నడపాలని డిమాండ్‌ చేస్తోంది. మరి రాబోయే రోజుల్లో పొంచి ఉన్న ముప్పుని మహారాష్ట్ర సర్కార్‌ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.

సవాళ్లు విసురుతున్న ముంబై మురికివాడలు
రెండు కోట్ల జనాభా ఉన్న ముంబైలో జనసాంద్రత చాలా ఎక్కువ. ప్రతీ చదరపు కిలోమీటర్‌కి 20,634 మంది నివసిస్తారు. నగర జనాభాలో 40 శాతం మంది కనీస వసతుల్లేని ధారావి, గోవండీ, వొర్లికొలివాడ వంటి మురికివాడల్లో తలదాచుకుంటున్నారు. ఈ మురికివాడల్లో కోవిడ్‌–19 విస్తరిస్తూ ఉండడంతో పరిస్థితులు అదుపులోనికి తేవడానికి సైన్యాన్ని రంగంలోకి దింపుతారన్న ప్రచారమూ సాగుతోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top