72 శాతం మంది భారతీయుల్లో కండరాల బలహీనత

Indians Does Not Have Nutrition Food And Suffering With More Fat - Sakshi

తూర్పు ప్రాంత మహిళల్లో 80 శాతం

ఇన్‌బాడీ సంస్థ అధ్యయనంలో వెల్లడి

నగరంలో 75 శాతం మందిలో కండరాలు శక్తి హీనం

‘తిండికలిగితే కండకలదోయ్‌.. కండకలవాడేను మనిషోయ్‌’ అన్నారు గురజాడ అప్పారావు. కానీ రానురాను కండగలవారు కరువైపోతున్నారు దేశంలో. ప్రతి పదిమందిలో ఏడుగురు కండరాల బలహీనతతో బాధపడుతున్నారు. దేశంలో 72 శాతం మంది కండరాల బలహీనత సమస్య ఎదుర్కొంటున్నారు. ఇన్‌బాడీ అనే సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ప్రధానంగా 50 ఏళ్లు దాటిన వారిలో 77 శాతం మందికి కండరాల బలహీనత ఉందని సర్వే తెలిపింది. హైదరాబాద్‌లో 75 శాతం (పురుషులు 78%, మహిళలు 72%) మందిలో ఇదే పరిస్థితి ఉందని పేర్కొంది. దేశంలోని తూర్పు, దక్షిణాది ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉందని వివరించింది. తూర్పు ప్రాంతాల్లో నివసించే మహిళల్లో ప్రమాదకర స్థాయిలో 80 శాతం మందికి కండరాల బలహీనత ఉందని చెప్పింది. దేహంలోని కండరాలను బలోపేతం చేయడంలో ప్రొటీన్లు కీలక భూమిక పోషిస్తాయి. అయితే 68 శాతం మంది భారతీయులు ప్రొటీన్ల లోపంతో బాధపడుతున్నట్టు అధ్యయనంలో తేలింది. ప్రొటీన్ల లోపం వల్లే 50 ఏళ్లకు పైబడిన వారిలోనూ, మహిళల్లోనూ కండరాల బలహీనత ఉంది. తగిన మోతాదులో ప్రొటీన్లు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఎమినోయాసిడ్స్‌ అందుతాయి. అలా కండరాల్లో శక్తి పుంజుకుంటుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఒక కేజీ శరీర బరువుకి 0.8 నుంచి 1 గ్రాము ప్రొటీన్లు అవసరం ఉంటుంది.

కొవ్వు కరిగించాల్సిందే..
భారతీయుల్లో 95 శాతం మంది శరీరంలో కొవ్వు పేరుకుపోయింది. అధిక బరువుకి మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ప్రధానమైన కారణం. వీరంతా కొవ్వు కరిగించుకోవాల్సిందే. అందుకు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం ఒక్కటే మార్గం. 40 ఏళ్లు దాటిన వారిలో 97–98 శాతం మంది కొవ్వు తగ్గించుకోవాల్సి ఉంది. శరీరంలో ప్రధానంగా పొట్ట భాగంలో పేరుకునే కొవ్వు, చర్మం కింద పేరుకునే కొవ్వు (సబ్‌క్యుటేనియస్‌ ఫ్యాట్, విసెరల్‌ ఫ్యాట్‌) అని రెండు రకాలైన కొవ్వులుంటాయి. వీటిలో ఏదీ అధికంగా ఉండ కూడదు. విసెరల్‌ ఫ్యాట్‌ పెరగడం మరింత ప్రమాదకరం. విసెరల్‌ ఫ్యాట్‌.. డయాబెటీస్, బీపీ, కేన్సర్, హృద్రోగాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో విసెరల్‌ ఫ్యాట్‌ 1 నుంచి 20 శాతం ఉండాలి. కానీ దేశంలో 56 శాతం మందికి ఉండాల్సిన దానికంటే అధికంగా విసెరల్‌ ఫ్యాట్‌ పేరుకుపోయింది. 75 శాతం మహిళల్లో మరింత ప్రమాదకరంగా తయారైంది. 30 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు వారిలో కొవ్వు అధికంగా ఉండడంతోపాటు, కండరాలు బలహీనత ప్రమాదకరంగా ఉంది. కండరాల బలోపేతంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన ఆవశ్యకతను తాజా అధ్యయనం నొక్కి చెబుతోంది. రోజూ ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తోంది. 9 నుంచి 10 గ్రాముల ప్రొటీన్లుండేలా చూసుకోవాలంటోంది.

సర్వే ఇంకా ఏం చెప్పిందంటే..
దేశంలో ప్రతి పదిమందిలో ఏడుగురు కండరాల బలహీనతతో బాధపడుతున్నారు.
పౌష్టికాహార లేమి, వ్యాయామం చేయకపోవడమే ఇందుకు కారణం.
31 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారిలో 72 శాతం కండరాలు శక్తిహీనం.
ఉద్యోగస్తుల్లో 72 శాతం. ఉద్యోగాలు చేయని వారిలో 69 శాతం.
హైదరాబాద్‌లో 75 శాతం, అహ్మదాబాద్‌లో 73 శాతం, లక్నోలో 81 శాతం, పట్నాలో 77 శాతం మంది కండరాలు బలహీనం.
పట్నా మహిళల్లో అత్యధికంగా 80 శాతం మందికి కండరాల బలహీనత.
95 శాతం మంది భారతీయుల శరీరంలో కొవ్వు పేరుకుపోయింది.
పొట్టభాగంలో కొవ్వుతో ఇబ్బంది పడుతున్న వారు 56 శాతం.
81 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు.
మహిళల్లో 86 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు.
– సాక్షి, నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top